‘ధృవ’ విలన్.. భరించలేం బాబోయ్

Update: 2016-12-15 12:44 GMT
ధృవ’ సినిమా చూసిన వాళ్లెవరూ అరవింద్ స్వామిని పొగడకుండా ఉండలేరు. తెలుగు సినిమాల్లో ఇలాంటి విలన్ పాత్రే అరుదంటే.. అరవింద్ స్వామి మరింత అరుదైన రీతిలో నటించి ఆ పాత్రను పండించాడు. ప్రేక్షకులపై అరవింద్ ఇంపాక్ట్ మామూలుగా లేదిప్పుడు. అతణ్ని ఇలాంటి పాత్రల్లో మళ్లీ చూడాలని కోరుకుంటున్నారు ప్రేక్షకులు. రచయితలు.. దర్శకులు కూడా అతణ్ని మనసులో పెట్టుకుని పాత్రలు సిద్ధం చేసేంతగా ఆ పాత్ర స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు. ఆల్రెడీ అరవింద్ కోసం కొందరు ప్రముఖ దర్శకులు ఆఫర్లు కూడా ఇస్తున్నారట. ఐతే అరవింద్ వాటిని టేకప్ చేసే స్థితిలో లేడు. పారితోషకం విషయంలో అతను అస్సలు తగ్గకపోవడమే ఇందుకు కారణం.

నిజానికి ‘తనీ ఒరువన్’ చేశాక అదే పాత్రను తెలుగులో చేయడానికి అరవింద్ ఒప్పుకోలేదు. అయితే అతను తప్ప మరెవ్వరూ ఆ పాత్ర చేయలేరన్న అభిప్రాయంతో సురేందర్ రెడ్డి పట్టుబట్టి అతణ్ని ఒప్పించాడు. భారీ పారితోషకం ఆఫర్ చేయడం కూడా అరవింద్ ఓకే చెప్పడానికి ఒక కారణం. ఈ చిత్రానికి రూ.3 కోట్ల దాకా పారితోషకం పుచ్చుకున్నాడట అరవింద్ స్వామి. ‘ధృవ’కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో తన పారితోషకం మరింత పెంచి.. మూడున్నర నాలుగు కోట్ల దాకా అడుగుతున్నాడట. ఈ విషయంలో అతను ఏమాత్రం తగ్గట్లేదని.. పాత్ర బాగున్నా సరే రెమ్యూనరేషన్ తగ్గితే సినిమా ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదని సమాచారం. ‘ధృవ’కు అరవింద్ ఎంత బలంగా మారినప్పటికీ.. ప్రతి సినిమాకూ అంత విలువ చేకూరుస్తాడని అనుకోలేం. అందుకే అంతేసి పారితోషకం అతడికివ్వలేం అంటూ చాలామంది నిర్మాతలు వెనక్కి తగ్గున్నారట. అరవింద్ కొంచెం తగ్గితే తప్ప అతను తెలుగులో సినిమాలు చేయడం కష్టమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News