ఈ అనిరుధ్.. మామూలోడు కాదబ్బా

Update: 2017-12-14 06:41 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో సంగీత దర్శకుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడమంటే మామూలు విషయం కాదు. ఈ అరుదైన అవకాశం అనిరుధ్ రవిచందర్ కు దక్కింది. ఈ అవకాశాన్ని అతను రెండు చేతులా అందిపుచ్చుకున్నట్లున్నాడు. ఈ సినిమా నుంచి అతను లాంచ్ చేసిన తొలి పాట ‘బైటికొచ్చి చూస్తే..’ ఇన్ స్టంట్ హిట్టయింది. ఈ పాట సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించింది. ఇప్పుడు ‘గాలి వాలుగా..’ అంటూ అతను లాంచ్ చేసిన మరో పాట కూడా అదే తరహాలో ఆకట్టుకుంటోంది. ఇతను మామూలోడు కాదు అన్న ఫీలింగ్ కలుగుతోంది తెలుగు సంగీత ప్రియులకు.

అనిరుధ్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. ఏదో పాటలు కంపోజ్ చేశాం.. ఆడియో ఇచ్చేశాం అన్నట్లు ఉండదు అతడి వ్యవహారం. ఒక్కో పాటను మంచి ప్రమోషన్ తో సోషల్ మీడియాలో లాంచ్ చేసే బాధ్యతను తనే తీసుకుంటాడు. ప్రతి పాటకూ ఏదో ఒక విశేషం జోడిస్తాడు. పాట లాంచ్ అయ్యాక కొన్ని రోజుల పాటు దాన్ని ప్రమోట్ చేసే బాధ్యత తీసుకుంటాడు. ఇలా ఫుల్ ఆడియో రిలీజ్ కావడానికంటే ముందు ఆల్బం జనాల్లోకి వెళ్లిపోయేలా చేస్తాడు. సోషల్ మీడియాలో ఇలా ఒక్కో పాట లాంచ్ చేసి జనాల్లోకి తీసుకెళ్లే ప్రమోషనల్ ఐడియాను బాగా పాపులర్ చేసింది అనిరుధే. తమిళంలో అతను పని చేసిన సినిమాలన్నింటికీ ఇదే ప్రమోషనల్ స్ట్రాటజీ అనుసరించాడు ఈ కుర్రాడు.

ఇప్పుడు పవన్ సినిమా పాటలకు మరింత హంగులు జోడించాడు. ‘గాలి వాలుగా..’ పాటతో పాటు అతను రిలీజ్ చేసిన ప్రమోషనల్ వీడియోకు పవన్ ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి ప్రమోషనల్ సాంగ్ ఇప్పటిదాకా తెలుగులో రాలేదనే చెప్పాలి. తన పాటల్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ.. అనిరుధ్ తెలుగులో ట్వీట్ పెట్టడం ద్వారా మరింతగా మనోళ్ల మనసులు గెలిచాడు. మొత్తంగా తెలుగులో చేస్తున్న తొలి సినిమాకు ఔట్ పుట్ విషయంలో కానీ.. ప్రమోషన్ పరంగా కానీ తన వంతుగా పూర్తి న్యాయం చేస్తూనే.. తనకు ఇక్కడ మంచి ఫాలోయింగ్ వచ్చేలా చేసుకోవడంలో అనిరుధ్ చేస్తున్న ప్రయత్నం అందరి మెప్పు పొందుతోంది.
Tags:    

Similar News