ఆ డైరెక్టర్‌పై అల్లు అరవింద్ ఎటాక్

Update: 2023-06-01 16:10 GMT
ఆ డైరెక్టర్‌పై అల్లు అరవింద్ ఎటాక్
టాలీవుడ్‌లో ఉన్న బడా ప్రొడ్యూసర్‌లలో అల్లు అరవింద్ ఒకరు. గీతా ఆర్ట్స్ అనే బ్యానర్ ద్వారా ఈయన ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. కెరీర్ తొలినాళ్లలో కేవలం మెగా కాంపౌండ్‌లోని హీరోలతో మాత్రమే సినిమాలు తీసిన ఆయన టాలీవుడ్‌లోని ఎంతో మంది హీరోలతో పని చేస్తోన్నారు. అలాగే, ఎంతో మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

తెలుగులోని పెద్ద నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ స్థాపించిన గీతా ఆర్ట్స్ బ్యానర్‌ నుంచి టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన దర్శకులు చాలా మంది స్టార్లుగా వెలుగొందుతోన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఆయన '2018' సినిమా సక్సెస్‌ మీట్‌లో పాల్గొని కొందరు దర్శకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు ఇది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.

తాజాగా జరిగిన '2018' ఈవెంట్‌లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. 'నేను ఇక్కడికి రాగానే చందూ మొండేటి, బన్నీ వాసుతో కలిసి ఓ ఫొటో దిగాను. అది ఎందుకో ముందు చెప్తాను. ఈయన (చందూ) కార్తికేయ 2 కంటే ముందే మాతో రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. ఈ కారణంగా ఆ తర్వాత అతడికి ఎన్నో ఆఫర్లు వచ్చినా మా గురించి దేన్ని కూడా ఒప్పుకోలేదు' అని చెప్పారు.

ఆ తర్వాత ఆయన కంటిన్యూ చేస్తూ.. 'చందూ మొండేటి గొప్ప డైరెక్టర్ అవుతాడని భావించి నేను రెండు సినిమాలకు బుక్ చేసుకున్నాను. చాలా మంది టెంప్టింగ్ ఆఫర్లు ఇచ్చినా దానికి అతడు కట్టుబడి ఉన్నాడు. కానీ, నా ద్వారా పైకి వచ్చిన కొందరు దర్శకులు పేర్లు చెప్పను కానీ.. వాళ్లు గీత దాటి వెళ్లి పని చేసుకున్నారు. కానీ, ఈయన నిలబడిపోయి ఉన్నాడు' అని తెలిపారు.

ఇక, అల్లు అరవింద్ పేర్కొన్న గీత దాటిన దర్శకులు ఎవరా అని సినీ ప్రియులంతా చర్చలు జరుపుకుంటున్నారు. అదే సమయంలో ఆయన పరశురాం పెట్ల గురించే పరోక్షంగా కామెంట్లు చేశారన్న టాక్ వినిపిస్తోంది.

వాస్తవానికి ఆ డైరెక్టర్ - విజయ్ దేవరకొండతో అల్లు అరవింద్ ఓ మూవీ ప్లాన్ చేశారు. కానీ, పరశురాం ఈ బ్యానర్‌ను కాదని దిల్ రాజుతో సినిమా చేస్తున్నారు. దీన్ని ఉద్దేశించే అల్లు అరవింద్ కామెంట్ చేశారని అంటున్నారు.

Similar News