#పుష్ప‌.. మేక పీక‌ కోసేందుకు దిగిన మృగంలా ఉన్నాడు

Update: 2021-08-12 10:30 GMT
వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాల వెల్లువ‌లో `పుష్ప‌` స్థానం ఎక్క‌డ‌? అంటే ఆర్.ఆర్.ఆర్ .. స‌లార్ లాంటి చిత్రాల‌కు ధీటుగానే ఈ సినిమాని రిలీజ్ చేయాల‌న్న పంతం క‌నిపిస్తోంది. ప్ర‌మోష‌న్ మెటీరియ‌ల్ తోనే బ‌న్ని త‌న ఫ్యాన్స్ ని టీజ్ చేస్తున్న తీరు షాక్ కి గురి చేస్తోంది. ఇంత‌కుముందు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్.. టీజ‌ర్ తోనే జ‌నాల్ని వెర్రెత్తించాడు. గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్ పుష్ప‌రాజ్ పాత్ర‌లో క‌ర్క‌శుడిగా క‌నిపిస్తున్న బ‌న్ని పూర్తిగా మాస్ లుక్ లో మ్యాసివ్ ఫైట్స్ తో ర‌క్తి క‌ట్టించేందుకు వ‌స్తున్నాడు.

తాజాగా ఈ సినిమా థీమ్ ని ఎలివేట్ చేసేలా తొలి లిరిక‌ల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసేందుకు సుకుమార్ బృందం ఏర్పాట్లు చేశారు. ఈ శుక్ర‌వారం ఉద‌యం 11.7 గంట‌ల‌కు ``దాక్కో దాక్కో మేక పులొచ్చి కొరుకుద్ది పీక‌..`` అంటూ సాగే సింగిల్ సాంగ్ ని రిలీజ్ చేయ‌నున్నారు. అందుకు సంబంధించిన ప్రోమో ఇంత‌కుముందే రిలీజ్ కాగా బ‌న్ని అభిమానుల్లో వైర‌ల్ గా మారింది.

కొన్ని సెక‌న్ల టీజ‌ర్ లో బ‌న్ని రూపం చూస్తుంటే పూర్తి డీగ్లామ‌ర‌స్ అవ‌తార్ లో మాసీ లుక్ తో హీటెక్కించేస్తున్నాడు. గిర‌జాల జుత్తు మాసిన గ‌డ్డం మీసాల‌తో అత‌డి రూపం మాస్ కా బాస్ అనే రేంజులో ఉంది. అలా నోట్లో బండ‌క‌త్తిని క‌రిచి ప‌ట్టుకుని మేక‌ను కోసేందుకు దిగిన మృగంలా ఉన్నాడు. ఇక పూర్తి లిరిక‌ల్ వీడియోలో అతడు ఇంకెంత ర‌చ్చ చేస్తాడో.. ఇక బ‌న్ని లుక్కుకి లిరిక్ కి త‌గ్గట్టే రాక్ స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్ బాణీ ఇంకెంత ర‌చ్చ చేస్తుందో చూడాల‌న్న ఆస‌క్తి పెరిగింది. ఈ చిత్రాన్ని ద‌స‌రా లేదా క్రిస్మ‌స్ కానుక‌గా ఈ ఏడాది రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

బ‌న్ని మాస్ లుక్ పైనే ఫోక‌స్:

బ‌న్ని ఈ రెండు భాగాల చిత్రంలో మాస్ అవ‌తార్ తో అభిమానుల‌కు అదిరిపోయే ట్రీటివ్వ‌బోతున్నాడు. గంధ‌పు చ‌క్క‌ల స్మ‌గ్ల‌ర్ గా నెగెటివ్ రోల్ తో స‌ర్ ప్రైజ్ చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే అత‌డి లుక్ పై అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. గుబురు గ‌డ్డం.. జుల‌పాల జుత్తుతో మాసీగా క‌నిపిస్తున్న బ‌న్ని యాక్ష‌న్ ని పీక్స్ కి తీసుకెళుతున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. అడ‌వుల నేప‌థ్యంలోని యాక్షన్ థ్రిల్లర్ కావ‌డంతో పూర్తి గ్రామీణ భార‌తానికి వెళ్లి ఈ సినిమాని చిత్రీక‌రిస్తున్నారు. బ‌న్ని త‌న‌ పాత్ర స్పెసిఫికేషన్ లకు తగినట్లుగా మేకోవర్ తో అద‌రగొడుతున్నాడు.

బ‌న్ని ఇందులో క్రూరుడైన స్మ‌గ్ల‌ర్ గా కనిపిస్తాడు. అల్లు అర్జున్ తన గెట‌ప్ కోసం మేకప్ రూమ్ లో రోజుకు 2 గంటలకు పైగా గడుపుతున్నార‌ని స‌మాచారం. పుష్ప అతని తొలి పాన్-ఇండియా చిత్రం. ఈ సినిమా ద‌స‌రా టార్గెట్ మిస్స‌యితేనే క్రిస్మ‌స్ కి వ‌స్తుంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక ఇందులో ర‌ష్మిక మంద‌న విలేజీ అమ్మాయిగా న‌టిస్తుండ‌గా అన‌సూయ పాత్ర బిగ్ స‌ర్ ప్రైజ్ ఇస్తుంద‌ని చెబుతున్నారు. దిశా ప‌టానీ కానీ క‌త్రిన కానీ ఇందులో ఐటమ్ నంబ‌ర్ లో న‌ర్తించే వీలుంద‌ని తెలుస్తోంది. దేవీశ్రీ అదిరిపోయే ఐట‌మ్ నంబ‌ర్ ట్యూన్ ని కూడా రెడీ చేస్తున్నారు.
Tags:    

Similar News