అల్లరోడు అతడిని నమ్ముకున్నాడు

Update: 2017-10-20 13:13 GMT
ఒకప్పుడు అల్లరి నరేష్ కెరీర్ ఆరు కమిట్మెంట్లు మూడు రిలీజులు అన్నట్లుగా ఉండేది. ఎప్పుడూ కనీసం అరడజను సినిమాలు చేతిలో ఉంచుకునేవాడు నరేష్. ఏడాదికి మూడు సినిమాల దాకా రిలీజయ్యేవి. అల్లరోడి సినిమా ఫ్లాపైనా బయ్యర్లు.. సేఫ్ అన్నంత భరోసా ఉండేది. కానీ గత కొన్నేళ్లలో వరుస ఫ్లాపుల వల్ల అతడి కెరీర్ దెబ్బ తినేసింది. ఐదేళ్లుగా హిట్టు ముఖమే చూడలేదు నరేష్. ఇటీవలే ‘మేడమీద అబ్బాయి’ అనే సినిమాతో పలకరించాడు అల్లరోడు. తన శైలిని పక్కన పెట్టి కొంచెం భిన్నమైన ప్రయత్నమేదో చేశాడు కానీ.. అది కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో నరేష్ కెరీర్ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పడిపోయింది.

ఈ పరిస్థితుల్లో నరేష్ కు ఇంకో ఛాన్సె ఇచ్చేదెవరు అనుకుంటుండగా.. అతడికో సినిమా వచ్చింది. రామా ఫిలిమ్స్ బేనర్ మీద సుధీర్.. నరేష్ తో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. ఇంతకుముందు నరేష్ తో ‘నేను’.. ‘యముడికి మొగుడు’.. ‘జంప్ జిలాని’ సినిమాలు తీసిన ఇ.సత్తిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలూ పెద్దగా ఆడలేదు. అందులోనూ చివరగా వచ్చిన ‘జంప్ జిలాని’ అల్లరోడి ఫ్లాపుల పరంపరలో ఒకటిగా కలిసిపోయింది. అయినప్పటికీ నరేష్ అతడినే నమ్ముకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. సత్తిబాబు కూడా హిట్టు కొట్టి చాలా కాలమైపోయింది. మరి వీళ్లిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఇద్దరికీ విజయాన్నిస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News