ఆపిల్ బ్యూటీ హ‌న్సిక పెళ్లి ఫిక్స్.. వెన్యూ ఇదే!

Update: 2022-10-16 12:53 GMT
అందాల భామ‌లు ఒక‌రి వెంట ఒక‌రిగా పెళ్లికి రెడీ అవుతున్నారు. క‌థానాయిక‌లంతా ఓ ఇంటివాళ్ల‌వుతున్నారు. ఇంత‌కుముందు ఆలియా- క‌త్రిన తాము వ‌ల‌చిన అంద‌గాళ్లను పెళ్లాడేసారు. ఇంకా పెళ్లాడాల్సిన నాయిక‌ల జాబితా చాలా పెద్ద‌దే ఉంది. నిర్మాత కం న‌టుడు జాకీ భ‌గ్నానీని ర‌కుల్ పెళ్లాడ‌నుంద‌న్న ప్ర‌చారం ఉంది. గోవా బ్యూటీ ఇలియానా తొంద‌ర‌లోనే క‌త్రిన సోద‌రుడిని పెళ్లాడ‌నుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇంత‌లోనే హ‌న్సిక పెళ్లి ఫిక్స‌యిందంటూ ఒక కొత్త క‌బురు అందింది. హన్సిక మోత్వాని పెళ్లి ముహూర్తం ఫిక్స‌యింది. డిసెంబర్ లో జైపూర్ కోటలో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్ప‌టికే పెళ్లికి సన్నాహాలు జరుగుతున్నాయి.. అని ప్ర‌ముఖ మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ‌డం సంచ‌ల‌న‌మైంది.

టీవీ సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్‌ను ప్రారంభించిన హన్సిక మోత్వానే తెలుగు-త‌మిళం-హిందీ ప‌రిశ్ర‌మ‌ల్లో క‌థానాయిక‌గా న‌టించింది. ప‌లువురు హీరోల‌తో ప్రేమాయ‌ణాలు సాగించింద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇంత‌కుముందు త‌మిళ హీరో సింబుతో ప్రేమాయ‌ణం బ్రేక‌ప్ గురించి తెలిసిందే.

ఎట్ట‌కేల‌కు ఆపిల్ బ్యూటీ హ‌న్సిక వ్య‌క్తిగ‌త జీవితంలో కొత్త అంకం మొద‌లు కానుంది. మ‌న‌సుకు న‌చ్చిన వాడితో పెళ్లికి సిద్ధమైంది. ఈ ఏడాది డిసెంబర్‌లో జైపూర్ కోటలో వివాహం చేసుకోనుంది. ఆ స్పెష‌ల్ డే కోసం ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. 450 ఏళ్ల నాటి కోట జైపూర్ ప్యాలెస్ వేదిక కావడంతో హన్సిక వివాహ వేడుక పాతకాలపు ట్రెడిష‌న‌ల్ టచ్ తో రాయల్ గా ఉంటుందని భావిస్తున్నారు. డిసెంబర్ లో ఈ పెళ్లి జరగనుంది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే హ‌న్సిక‌ వ్యక్తిగత జీవితంలో ఈ పెద్ద అడుగు గురించి పుకార్లు వినిపించాయి. ఎట్ట‌కేల‌కు హ‌న్సిక‌ పెళ్లికి సిద్ధంగా ఉందని ధృవీకర‌ణ వ‌చ్చింది. జైపూర్ లోని ముండోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్ అందుకు వేదిక‌. విలాసవంతమైన డెస్టినేషన్ వెడ్డింగ్ త‌న‌కు త‌న‌కు కాబోయే భర్తకు జీవితకాల జ్ఞాపకాలను అందిస్తుంద‌న‌డంలో సందేహం లేద‌ని స‌ద‌రు క‌థ‌నం వెల్ల‌డించింది.

అయితే హన్సిక మోత్వాని పెళ్లికి సంబంధించిన ఖచ్చితమైన తేదీ ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. వివాహం కోసం అతిథుల సౌక‌ర్యం కోసం ప్యాలెస్ లో గదులు సిద్ధం చేస్తున్నార‌ని... పనులు జరుగుతున్నాయని ప్యాలెస్ కి చెందిన ఒక సోర్స్ వెల్ల‌డించిన‌ట్టు తెలుస్తోంది.  సాంస్కృతిక సంపన్నమైన నగరంలో వెన్యూ వ‌ద్ద‌కు అతిథుల రాకకు ముందుగానే ఏర్పాట్లు చేయనున్నారు.

జైపూర్‌లోని ముండోటా కోట -ప్యాలెస్ లో ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీల వివాహాలు జ‌రిగాయి. ఇక్కడ హన్సిక తన డ్రీమ్ బోయ్ ని వివాహం చేసుకోనుంది. ఈ ప్రదేశానికి దేశ రాజధాని న్యూఢిల్లీ నుండి ఐదు గంటల ప్రయాణ స‌మ‌యం ప‌డుతుంది.

హన్సిక మోత్వాని షక లక బూమ్ బూమ్- క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ - సోన్ పరీ వంటి టీవీ సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్ ను ప్రారంభించింది. ఆమె హృతిక్ రోషన్ హిట్ చిత్రం కోయి మిల్ గయాలో కూడా న‌టించింది. బాలీవుడ్ లో ఆమె ఆప్ కా సురూర్ - మనీ హై తో హనీ హై వంటి చిత్రాలను చేసింది. ఆమె 50వ సినిమా ప్రాజెక్ట్ `మహా` ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైంది. తదుపరి ఆమె తమిళ చిత్రం `రౌడీ బేబీ`లో కనిపించనుంది. తెలుగులో బ‌న్ని స‌ర‌స‌న దేశ‌ముదురు లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లో న‌టించిన హ‌న్సిక మంచు కాంపౌండ్ లో ఎక్కువ సినిమాలు చేసింది. స‌రైన విజ‌యాల్లేక త‌మిళ ప‌రిశ్ర‌మ‌కు షిఫ్ట‌యింది.
Tags:    

Similar News