టాలీవుడ్ లో మ‌ల‌యాళీ రీమేక్ ల‌ హవా

Update: 2020-07-06 12:30 GMT
స‌హ‌జ సిద్ధ‌త (నేచురాలిటీ).. వాస్త‌విక‌త పేరుతో .. నిజ జీవిత క‌థ‌ల పేరుతో చ‌ప్ప‌గా సినిమా తీస్తే చూడ‌లేం. వాస్త‌వ క‌థ‌ల‌కు క‌మ‌ర్షియాలిటీని అద్ది ఆద్యంతం కుర్చీ అంచున కూచోబెట్టేలా సినిమా తీస్తేనే జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తారు. అయితే ఇలాంటివేవీ లేకుండానే మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ ద‌శాబ్ధాలుగా మ‌నుగ‌డ సాగిస్తోంది. ఆ సినిమాలు చూడాలంటే తెలుగు ఆడియెన్ కి ఓపిక చాల‌దు. మంచి క‌థ‌లు సీన్లు ఉన్నా కానీ బోరింగ్ ఎపిసోడ్లు.. ల్యాగ్ ని భ‌రించాల్సి ఉంటుంది. ఎమోష‌న్ ఉన్నా.. అంత‌కుముందే ఓపిగ్గా ఎన్నిటినో భ‌రించాలి. వీళ్ల సినిమాలు వాస్త‌విక‌త‌ను లైఫ్ ని చూపిస్తాయి కాబ‌ట్టి జాతీయ అవార్డులు వెల్లువెత్తుతుంటాయి. అయితే ఇవి ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో ఆవిష్క‌రించే సినిమాలు కానే కావు.

మొన్న‌టికి మొన్న `సూఫీయుం సుజాత‌యిం` అనే మ‌ల‌యాళీ చిత్రం అమెజాన్ లోకి వ‌చ్చింది. కానీ అది చూసేవారికి విసుగు పుట్ట‌డం ఖాయం. కానీ అందులో చ‌క్క‌ని ప్రేమ‌క‌థ‌.. అదిథీరావ్ హైద‌రీ అంద‌చందాలు అభిన‌యం మైమ‌రిపిస్తాయి. హిందూ-ముస్లిమ్ ప్రేమ‌క‌థ‌ను భావోద్వేగ‌భ‌రితంగా తెర‌కెక్కించారు. కానీ ఏం లాభం?  పూర్తిగా డ్రాగ్ చేసేయ‌కుండా చూడాలంటే చాలా ఓపిక అవ‌స‌రం. అందుకే మ‌ల్లూ సినిమాల క‌థ‌ల్ని మాత్ర‌మే తీసుకుని తెలుగైజ్ చేయాలంటే క‌మ‌ర్షియ‌ల్ హంగుల్ని అద్దాల్సి ఉంటుంది. అలా కాకుండా కొన్నిటిని అక్క‌డా క‌మ‌ర్షియ‌ల్ పంథాలో తీసి విజ‌యం సాధించిన సంద‌ర్భాలు లేక‌పోలేదు.

మలయాళ చిత్ర పరిశ్రమ కాస్త‌ ఆలస్యంగా అయినా ఇటీవ‌ల వ‌రుస‌గా ఉత్తమ సినిమాలను అందిస్తోంది. నటీనటుల గొప్ప ప్రతిభ దానిని తదుపరి స్థాయికి చేరుస్తోంది. మ‌న‌ తెలుగు చిత్రనిర్మాతలు మలయాళ చిత్రాల నుండి కొత్త కంటెంట్ ని ఇక్క‌డ‌కు తీసుకురావడానికి ఎందుకు ప్రేరణ పొందుతున్నారో దీరిరి బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. ఒరిజిన‌ల్ ని అనువ‌దించి రిలీజ్ చేసే కంటే తెలుగులో మ‌న‌వాళ్లు రీమేక్ చేయాలనుకుంటున్నారు.

నటుడు పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫెర్ (మోహ‌న్ లాల్ హీరో) రీమేక్ లో చిరంజీవి న‌టిస్తున్నారు. ఆచార్య పూర్త‌య్యాక ఇందులో న‌టిస్తారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ .. అయ్యప్పనమ్ కోషియం  తెలుగులో రీమేక‌వుతున్నాయి. అయ్యప్పనమ్ కోషియం రీమేక్ హక్కులను సితార సంస్థ దక్కించుకుంది. కప్పేలా అనే మూవీ రైట్స్ ని సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ద‌క్కించుకుంద‌ని తాజాగా క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇవ‌న్నీ స‌హ‌జ‌సిద్ధ‌త‌కు పెద్ద పీట వేసి తీసిన‌వి. అక్క‌డ‌ విజ‌యం సాధించిన‌వి. అందుకే తెలుగైజ్ చేసేందుకు మ‌న నిర్మాత‌లు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు.

మరో మలయాళ చిత్రం హెలెన్ (మాథుకుట్టి జేవియర్ దర్శకుడు) సర్వైవల్ థ్రిల్లర్ క‌థాంశంతో తెర‌కెక్కి ప్రేక్ష‌కులు క్రిటిక్స్ నుంచి ప్రశంసలను అందుకుంది. తెలుగులో రీమేక్ హ‌క్కుల్ని పీవీపీ ద‌క్కించుకున్నారు. కేరాఫ్ కాంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన  `ఉమమహేశ్వర ఉగ్రరూపాస్య` (స‌త్య‌దేవ్ హీరో) మలయాళ రీమేక్.

వెంకటేశ్ దృశ్యం.. నాగ‌చైత‌న్య ప్రేమ‌మ్ స‌క్స‌స్ సాధించింది మొద‌లు టాలీవుడ్ లో మ‌ల‌యాళ చిత్రాల రీమేక్ ల శాతం పెరిగింద‌నే చెప్పాలి. అప్పటితో పోలిస్తే ఇటీవ‌ల రీమేక్ ల స్పీడ్ పెరుగుతోంది. అటు త‌మిళం .. హిందీలోనూ ఘ‌న‌విజ‌యం సాధించిన ప‌లు చిత్రాల్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అసుర‌న్.. అంధాధున్ త‌దిత‌ర చిత్రాల రీమేక్ లు ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్నాయి.
Tags:    

Similar News