అమ్మో ఒక‌టో తారీఖు.. అన్ని రిలీజ్ లే!

Update: 2020-01-01 05:35 GMT
2020 ఆరంభ‌మే 11 సినిమాలు క్యూ క‌ట్టాయి. ఇప్ప‌టికే 5 సినిమాలు డిసెంబ‌ర్ లో రిలీజై థియేట‌ర్ల‌లో వున్నాయి. వాటిని తీసేయ‌కుండా కొత్త‌గా వ‌చ్చే 11 చిత్రాల‌కు థియేట‌ర్లు కావాల్సి ఉంది. అన్ని సినిమాలు ఒకేసారి రిలీజైతే.. అది కుదిరే ప‌నేనా? ఇంత‌కీ రిలీజ్ బ‌రిలో ఉన్న సినిమాలేవి?. రేస్ లో ఎవ‌రి ద‌మ్మెంత‌..?

ప‌ద‌కొండు చిత్రాలు జ‌న‌వ‌రి 1న రిలీజ్ అంటూ ప్ర‌చార‌మైంది. కానీ రిలీజ్ తేదీ విష‌యంలో ఎంతో క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంది. థియేట‌ర్ల ఇష్యూ ఉండ‌డంతో కొన్నిటిని అటూ ఇటూ తేదీలు మార్చి స‌ర్ధారుట‌. రామ్‌గోపాల్ వ‌ర్మ పిచ్చ పిచ్చగా ప‌బ్లిసిటీ చేసిన బ్యూటిఫుల్.. జ‌న‌వ‌రి 1 రేసులో ఉంది. ఆయ‌న శిష్యుడు ఆగ‌స్త్య మంజు ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. `రంగీలా` చిత్రానికి ట్రిబ్యూట్ గా ఈ సినిమాని తెర‌పైకి తీసుకొచ్చామ‌ని మేక‌ర్స్ మొద‌టి నుంచి చెబుతున్నారు. క‌థ కూడా దానికి సిమిల‌ర్ గానే క‌నిపిస్తోంది. దీని కోసం ఎంత ర‌చ్చ చేయాలో అంత చేసిపెట్టారు వ‌ర్మ‌. ఈ చిత్రం ఎంత‌వ‌ర‌కూ వ‌ర్కవుటవుతుంది? అన్న‌ది చూడాలి. ఆ త‌రువాత రేసులో నిలిచిన చిత్రాల్లో న‌టుడు స‌త్య‌ప్ర‌కాష్ త‌న కొడుకుని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ తానే ద‌ర్శ‌కుడిగా మారి నిర్మించిన `ఉల్లాలా ఉల్లాలా` రిలీజ‌వుతోంది. దీంతో పాటే `ర‌ధేరా` విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.

ఆ త‌రువాత జ‌న‌వ‌రి 3న‌ పోటీప‌డుతున్న చిత్రాల్లో స‌మ‌రం- న‌మ‌స్తే నేస్త‌మా- వైఫ్ ఐ- హ‌ల్ చ‌ల్‌- క‌ళాకారుడు అంటూ కొన్ని పేర్లు వినిపించాయి. ఈ ఐదు సినిమాల‌కు స‌రైన ప్ర‌చారం లేక‌ ఏవీ జ‌నాల‌కు తెలీవు. ఇక వీటితో పాటు జ‌న‌వ‌రి 1న డ‌బ్బింగ్ సినిమాలు కూడా పోటీకి దిగుతున్నాయి. ర‌ష్మిక మంద‌న్న మాజీ ల‌వ‌ర్ ర‌క్షిత్‌ శెట్టి న‌టించిన `అత‌డే శ్రీ‌మ‌న్నారాయ‌ణ‌`... ధ‌నుష్ `తూటా`- మ‌మ్ముట్టి `రాజా న‌ర‌సింహా` రిలీజ్ కి రెడీ. కానీ ఇవి వ‌స్తున్నాయి అన్న‌ది జ‌నాల‌కు తెలిసింది త‌క్కువే.

ఇప్ప‌టికే థియేట‌ర్ల‌లో వెంకీమామ‌- ప్ర‌తిరోజు పండ‌గే వ‌సూళ్ల‌లో ఫ‌ర్వాలేద‌నిపిస్తున్నాయి. దొంగ‌- రూల‌ర్ అక్క‌డ‌క్క‌డ ఆడుతున్నాయి. ఈ చిత్రాల‌న్నిటినీ ప‌క్క‌న పెట్టి వీటికి థియేట‌ర్లు కేటాయించ‌డం క‌త్తిమీద సామే. ఎన్నింటికి థియేట‌ర్లు దొరుకుతాయో ఎన్నింటిని వాయిదా వేస్తారో ఇప్ప‌టికి ఇంకా తెలియ‌నే తెలీదు. వీళ్లంతా ఒక‌టో తారీఖు అంటూ తొలి నుంచి చెబుతుండ‌డంతో సందిగ్ధ‌త నెల‌కొంది. కొన్నిటికి తేదీలు స‌ర్ధుబాటు చేసారు. అది కూడా జ‌నాల‌కు తెలిసింది లేదు. మంచి రిలీజ్ తేదీ.. మంచి ప్ర‌చారం దేనికైనా ముఖ్యం. అలా చేయ‌క‌పోతే మంచి సినిమా కూడా కిల్ అయిపోయే ప‌రిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇంత కాంపిటీష‌న్ లోనూ ఎవ‌రూ స‌రైన ప‌బ్లిసిటీలో దృష్టి సారించిన‌ట్టు లేనేలేదని విమ‌ర్శ‌లొస్తున్నాయి.


Tags:    

Similar News