భార్య ఓదార్పుతో కోలుకున్న న‌టుడు!

బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ న‌టుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.

Update: 2026-06-09 07:30 GMT

బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ న‌టుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. వెండితెరపై ఎంతో గ్లామరస్‌గా కనిపించే ఈ నటుడి జీవితంలోనూ ఊహించని ఎన్నో చీకటి రోజులు ఉన్నాయి. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన అత్యంత కష్టతరమైన కాలం గురించి - ఆ సమయంలో తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణల గురించి ఎంతో ఓపెన్‌గా మాట్లాడారు. తన వ్యక్తిగత జీవితం ఒకేసారి ఎలా అస్తవ్యస్తంగా మారిందో? అర్జున్ రాంపాల్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

ఒకవైపు సుదీర్ఘ వైవాహిక బంధం ముగింపు దశకు చేరుకోవడం.. మరోవైపు అదే సమయంలో తన తల్లి క్యాన్సర్ బారిన పడటం రాంపాల్ ని తీవ్రంగా కుంగదీశాయి. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎన్నో సవాళ్లు ఒకేసారి చుట్టుముట్టడంతో మానసికంగా తాను ఎంతో ఒంటరివాడినయ్యానని భావోద్వేగానికి గురయ్యారు. వైవాహిక జీవితంలో తలెత్తిన విభేదాల కారణంగా తన వివాహ బంధం ముందుకు సాగని పరిస్థితి ఏర్పడిందని అర్జున్ గుర్తు చేసుకున్నారు. ఒకవైపు ఆ బంధాన్ని నిలబెట్టుకోలేక తపన పడుతుండగానే ప్రాణసమానమైన తల్లి ప్రాణాంతక వ్యాధితో పోరాడుతుండటం చూసి ఏం చేయాలో? తోచని స్థితిలో ఉండిపోయినట్లు క‌న్నీళ్లు చెమ‌ర్చారు.

ఆ కాలం తన జీవితంలోనే అత్యంత దారుణమైన -మానసిక ప్రశాంతత లేని కాలమని వివరించారు.

అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తన జీవితంలోకి ప్రవేశించిన మోడల్ గాబ్రియెల్లా డెమెట్రియాడెస్ తనకు బలమైన పునాదిగా మారిందని అర్జున్ రాంపాల్ కొనియాడారు. తాను మానసిక వేదనలో ఉన్నప్పుడు ఆమె అందించిన మద్దతు.. చూపించిన ఆత్మీయత మళ్లీ కోలుకోవడానికి ఎంతగానో తోడ్పడ్డాయన్నారు. గాబ్రియెల్లా జీవితంలోకి రావడం వల్లే తాను ఆ చీకటి రోజులను దాటి కొత్త జీవితాన్ని ప్రారంభించగలిగానని కృతజ్ఞత భావాన్ని చాటుకున్నారు.

జీవితంలో ఎన్ని ఆస్తులు.. అంతస్తులు ఉన్నా? మానసిక సక్షేమం.. కష్టకాలంలో తోడుండే నమ్మకమైన భాగస్వామి ఎంత అవసరమో అర్జున్ మాటలను బట్టి అర్థమవుతుంది. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు అధైర్య పడకుండా సరైన వ్యక్తుల మద్దతుతో జీవితాన్ని మళ్లీ ఎలా నిర్మించుకోవచ్చో రాంపాల్ సొంత అనుభవం ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ జంట తమ పిల్లలతో కలిసి ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు.

గ్లామర్ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీల జీవితాలు విజయాలతోనే నిండి ఉండ‌వు. వారి వెనుక కూడా ఎన్నో వ్యక్తిగత బాధలు, కన్నీళ్లు ఉంటాయని అర్జున్ రాంపాల్ ప్రయాణం నిరూపిస్తోంది. తన జీవితంలోని అత్యంత సున్నితమైన విషయాలను అభిమానులతో పంచుకోవడంతో కష్టాల్లో ఉన్న ఇతరులకు కూడా ఓ కొత్త ఆశను, ధైర్యాన్ని అందించారు అర్జున్ రాంపాల్.

Tags:    

Similar News