ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిన అర్జిత్ సింగ్.. తెరపైకి ధోని రిటైర్మెంట్!
అర్జిత్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటన వినగానే ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇకపై సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్‌గా కొత్త ప్రాజెక్టులను అంగీకరించబోనని ఆయన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.;
అర్జిత్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటన వినగానే ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇకపై సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్‌గా కొత్త ప్రాజెక్టులను అంగీకరించబోనని ఆయన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. అయితే, నెట్టింట ఈ వార్త కంటే ఎంఎస్ ధోనీ గురించిన చర్చాంశమే హాట్ టాపిక్‌గా మారింది. అర్జిత్ రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు కానీ, మన ధోని మాత్రం అస్సలు తగ్గట్లేదని ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. "ధోనీ కంటే ముందే అర్జిత్ రిటైర్ అవుతారని ఎవరూ ఊహించలేదు" అంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. వయసు పెరుగుతున్నా ధోనీలో ఏమాత్రం జోరు తగ్గకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక వివరాలు ఇలా వున్నాయి ..
టైమింగ్ అదిరింది:
అర్జిత్ సింగ్ తన రిటైర్మెంట్ గురించి మాట్లాడిన సమయానికే, ఎంఎస్ ధోనీ తదుపరి ఐపీఎల్ సీజన్ కోసం నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టడం చర్చకు దారితీసింది. 44 ఏళ్ల వయసులో కూడా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కోసం మరోసారి సిద్ధమవుతున్న ధోనీని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. 2020లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పినప్పటికీ, ఐపీఎల్‌లో మాత్రం ఆయన ప్రస్థానం నిర్విరామంగా సాగుతోంది. మరోవైపు అర్జిత్ లాంటి యువ గాయకుడు తప్పుకోవాలని చూస్తుంటే, ధోనీ మాత్రం మైదానంలో తన అనుభవాన్ని, ప్రశాంతమైన నాయకత్వాన్ని పంచుతూనే ఉండటం ఈ ఇద్దరి మధ్య ఆసక్తికరమైన పోలికకు కారణమైంది.
గతేడాది సవాళ్లు, ధోనీ ప్రదర్శన:
గత ఐపీఎల్ సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు పెద్దగా కలిసి రాలేదు. ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన సీఎస్‌కే, పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించి, జట్టు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. ధోనీ వ్యక్తిగత ప్రదర్శన విషయానికి వస్తే.. 13 ఇన్నింగ్స్‌ల్లో 24.50 సగటుతో 196 పరుగులు చేశారు. రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన సమయంలో ధోనీ మళ్ళీ కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్టాల్సి వచ్చింది. గణాంకాలు కాస్త అటు ఇటుగా ఉన్నా, జట్టుకు ధోనీ ఇచ్చే భరోసా మాత్రం వెలకట్టలేనిది.
రికార్డుల రారాజు.. మొండిగా ముందడుగు:
ప్రస్తుత ఫామ్‌తో సంబంధం లేకుండా ఐపీఎల్ చరిత్రలో ధోనీ రికార్డులు అసాధారణంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 278 మ్యాచ్‌లు ఆడిన ఆయన, 38.80 సగటుతో 5,439 పరుగులు సాధించారు. ఇందులో 24 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. చాలా మంది సెలబ్రిటీలు కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తుంటే, ధోనీ మాత్రం విమర్శలను లెక్కచేయకుండా ఆటపై తనకున్న మక్కువతో ముందుకు సాగుతున్నారు. అందుకే, ఎవరైనా సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటిస్తే.. అందరి కళ్లు వెంటనే ధోనీ మీదకు వెళ్తున్నాయి. ఆయన ఎనర్జీ లెవల్స్ ముందు కుర్రాళ్లు కూడా దిగదుడుపేనని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు.