పెద్దికి మ్యూజిక్.. రెహమాన్ ఎందుకు ఓకే చెప్పారంటే?
తాజాగా ముంబైలో నిర్వహించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న రెహమాన్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం పెద్దిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి, రై రై రా రా పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై మరింత ఆసక్తి పెంచాయి.
ఇటీవల విడుదలైన పెద్ది ట్రైలర్ లో కూడా రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఎమోషనల్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ కు ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత బలం చేకూర్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ముంబైలో నిర్వహించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న రెహమాన్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"తమిళ సినిమాలు చేశాను. హిందీ సినిమాలు కూడా చేశాను. అవన్నీ తెలుగులో డబ్బింగ్ వెర్షన్లుగా వచ్చాయి. కానీ ఇప్పుడు తెలుగులో స్ట్రయిట్ మూవీ చేస్తున్నాను. బుచ్చిబాబు కథ చెప్పినప్పుడు ఆయన కళ్లలో కనిపించిన డెడికేషన్ నాకు బాగా నచ్చింది. అందుకే ప్రాజెక్టు చేయాలని అనిపించింది" అని రెహమాన్ తెలిపారు. ఆ తర్వాత బుచ్చిబాబు పనితీరును ప్రశంసించారు.
"ఒక దర్శకుడు సబ్జెక్ట్ పై పూర్తి పట్టుతో ఉండి, ఆర్టిస్టుల నుంచి బెస్ట్ అవుట్ పుట్ తీసుకుంటే సినిమా మంచి స్థాయికి వెళ్తుంది. పెద్దిలోని ప్రతి ఫ్రేమ్ లో ఆ డెప్త్ కనిపిస్తోంది. రామ్ చరణ్ హార్డ్ వర్క్, బుచ్చిబాబు డెడికేషన్ ను క్లియర్ గా చూశాను. బుచ్చి సాఫ్ట్ అండ్ లవబుల్ వ్యక్తి. సెట్స్ లో అందరినీ ఉత్సాహంగా పనిచేయించేలా ఉంటారు" అని చెప్పారు. అయితే రెహమాన్ చేసిన తెలుగులో స్ట్రయిట్ మూవీ చేస్తున్నాననే వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చిన్నపాటి గందరగోళం నెలకొంది.
చాలామంది పెద్దినే ఆయన తొలి స్ట్రయిట్ తెలుగు సినిమా అని భావించారు. కానీ వాస్తవానికి అది నిజం కాదని తెలుస్తోంది. రెహమాన్ పూర్తి స్థాయిలో సంగీతం అందించిన తొలి స్ట్రయిట్ తెలుగు సినిమా 1994లో విడుదలైన సూపర్ పోలీస్. ఇందులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించారు. ఆ చిత్రానికి పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెహమానే సమకూర్చారు. ఆ తర్వాత ఆయన చేసిన అనేక తమిళ, హిందీ చిత్రాలు తెలుగులో డబ్బింగ్ రూపంలో విడుదలయ్యాయి.
ఈ నేపథ్యంలో పెద్ది గురించి మాట్లాడుతూ రెహమాన్ చాలా ఏళ్ల తర్వాత చేస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా అంటూ చేసిన కామెంట్ ను కొందరు ఇదే మొదటి తెలుగు సినిమాగా అర్థం చేసుకోవడంతో గందరగోళం ఏర్పడింది. ప్రస్తుతం ఆ విషయంపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఇక పెద్ది సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. భావోద్వేగాలు, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఆ చిత్రంపై ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.