కలాం బయోపిక్ కు ధనుష్ ను అందుకే తీసుకున్నా
రామేశ్వరం నుంచి రాష్టప్రతి భవన్ వరకు సాగిన కలాం ఇన్‌స్పిరేషనల్ లైఫ్ ను ఈ సినిమాలో ఓం రౌత్ చూపించబోతున్నాడు.;
భారత మాజీ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం జీవిత కథ ఆధారంగా వెండితెరపై సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. కలాం పేరుతో తెరకెక్కేఈ బయోపిక్ కు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నాడు. కాగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించనుండగా, ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు టీ సిరీస్‌లు నిర్మిస్తున్నాయి.
రామేశ్వరం నుంచి రాష్టప్రతి భవన్ వరకు సాగిన కలాం ఇన్‌స్పిరేషనల్ లైఫ్ ను ఈ సినిమాలో ఓం రౌత్ చూపించబోతున్నాడు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమా ను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కలాం పేరుతో రూపొందనున్న ఈ సినిమాకు మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించిన ధనుష్ ను ఈ సినిమాలో కలాంగా ఎంపిక చేయడానికి గల కారణాన్ని రీసెంట్ గా ఓం రౌత్ వివరించాడు.
ఈ సినిమాలో కేవలం అబ్దుల్ కలాం సాధించిన విజయాలను మాత్రమే కాకుండా ఆయన జీవితంలో జరిగిన అన్ని విషయాలను చూపించనున్నామని ఓం రౌత్ తెలిపాడు. ఆయన జీవితంలోని సక్సెస్, ఫెయిల్యూర్లతో పాటూ ఆధ్యాత్మికత పాత్ర కూడా పోషించాలి కాబట్టే టైటిల్ రోల్ కు ధనుష్ అయితేనే న్యాయం చేస్తాడని భావించే అతన్ని తీసుకున్నామని, ఈ క్యారెక్టర్ చేయడానికి ధనుష్ ఓకే చెప్పినందుకు ధనుష్ కు ఓం రౌత్ థాంక్స్ చెప్పాడు.
ఓం రౌత్ నుంచి చివరగా ఆదిపురుష్ సినిమా వచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేక ఫ్లాప్ గా నిలిచింది. ఆదిపురుష్ సినిమా టైమ్ లో ఓం రౌత్ పై విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగిన విషయం తెలిసిందే. దీంతో కెరీర్ లో కాస్త గ్యాప్ తీసుకున్న ఓం, అబ్దుల్ కలాం బయోపిక్ అనౌన్స్‌మెంట్ తో సంచలనం సృష్టించాడు. మరి కలాం సినిమాతో ఓం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.