టికెట్ ధరలో వాటా.. మంత్రి కందులకు ఎగ్జిబిటర్ల విన్నపం
ఆంధ్రప్రదేశ్‌లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.;
ఆంధ్రప్రదేశ్‌లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దశాబ్దాలుగా సామాన్య ప్రజలకు తక్కువ ధరకే వినోదాన్ని అందిస్తున్న ఈ థియేటర్లు.. ప్రస్తుత మల్టీప్లెక్స్ సంస్కృతి .. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల విజృంభణ కారణంగా మనుగడ సాగించడమే కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో తమ సమస్యలను పరిష్కరించి థియేటర్ల వ్యవస్థను కాపాడాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినీ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం అమరావతి సచివాలయంలో పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
థియేటర్ల నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో ఎగ్జిబిటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు, మున్సిపల్ పన్నులు , ప్రాథమిక నిర్వహణ వ్యయం భారంగా మారాయని వారు మంత్రికి వివరించారు. ప్రస్తుతం ఏసీ థియేటర్లకు రూ. 5, నాన్-ఏసీ థియేటర్లకు రూ. 3 గా ఉన్న నిర్వహణ ఛార్జీలను వరుసగా రూ. 15 మరియు రూ. 7 కు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ మార్పు వల్ల ప్రభుత్వానికి అదనపు జీఎస్టీ ఆదాయం కూడా సమకూరుతుందని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కేవలం నిర్వహణ ఛార్జీల పెంపు మాత్రమే కాకుండా.. పెద్ద బడ్జెట్ సినిమాల టికెట్ ధరల విషయంలో కూడా ఎగ్జిబిటర్లు కీలక ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచారు. ప్రభుత్వం అనుమతించే అదనపు టికెట్ ధరలో 20 శాతం వాటాను థియేటర్ల నిర్వహణ కోసం కేటాయించాలని వారు కోరారు. దీనితో పాటు వాణిజ్య విద్యుత్ టారిఫ్ నుండి ఉపశమనం కలిగించాలని.. మున్సిపల్ ఆస్తి పన్నులను తగ్గించాలని ఎగ్జిబిటర్లు విన్నవించారు. ఈ రాయితీలు లభిస్తేనే సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడకుండా ఉంటాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎగ్జిబిటర్ల విజ్ఞప్తిపై మంత్రి కందుల దుర్గేశ్ సానుకూలంగా స్పందించారు. తెలుగు సంస్కృతిలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు అంతర్భాగమని... చిత్ర పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు తర్కబద్ధంగా ఉన్నాయని.. పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు.
ఈ సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి... త్వరితగతిన సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ ప్రోత్సాహం అందితేనే గ్రామీణ - పట్టణ ప్రాంతాల్లోని సామాన్యులకు అందుబాటులో ఉండే వినోద పరిశ్రమ మనుగడ సాగించగలదని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.