స్టార్ హీరో చుట్టూ ఏడుగురు మేనేజర్లతో హింస
ఈరోజుల్లో సినిమాల బడ్జెట్లు అదుపు తప్పడానికి కారణాలేమిటో ఔత్సాహిక ఫిలింమేకర్స్ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.;
ఈరోజుల్లో సినిమాల బడ్జెట్లు అదుపు తప్పడానికి కారణాలేమిటో ఔత్సాహిక ఫిలింమేకర్స్ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. స్టార్ల గొంతెమ్మ కోర్కెల కారణంగా నిర్మాతలకు తడిసి మోపెడవుతోంది. సెట్లో మూడు నుంచి ఏడు కారవ్యాన్ లు ఉపయోగించే స్టార్లు ఉన్నారని ఇంతకుముందు పలువురు నిర్మాతలు వాపోయారు. తాజా ఇంటర్వ్యూలో అనురాగ్ కశ్యప్ ఒక ప్రముఖ కథానాయకుడికి మూడు కారవ్యాన్ లు సెట్ లో ఉండాల్సిందేనని, ఒకటి తన కోసం, మరొకటి అసిస్టెంట్ల కోసం, వేరొకటి సమావేశాల కోసం ఉపయోగిస్తాడని తెలిపారు. ఒకప్పుడు తన సినిమాల కోసం ఒక కారవ్యాన్ సెట్ లో ఉండేది. దానిని హీరో హీరోయిన్లు, ప్రధాన వ్యక్తులు ఉపయోగించేవారు. మిగతా వారంతా బయట చెట్ల కింద కుర్చీల్లో కూచునేవారు అని కూడా గుర్తు చేసుకున్నారు కశ్యప్.
అలాగే బాలీవుడ్ లోని ప్రముఖ హీరో చుట్టూ ఏడుగురు మేనేజర్లు ఉంటారని, వారు అతడిని కలిసేందుకు నిరాకరించారని అనురాగ్ చెప్పాడు. అతడు పరిశ్రమలో అగ్ర హీరో. అయితే సినిమాకి సంబంధించిన ఓ విషయం చర్చించేందుకు అతడిని కలవాలని ప్రయత్నించినప్పుడు ఆ ఏడుగురు మేనేజర్ల హింస భరించాల్సి వచ్చిందని తెలిపాడు. వారంతా తనను తీవ్రంగా తిట్టారని తెలిపాడు. స్టార్ హీరోని కలిసేందుకు వారంతా నిరాకరించారని కూడా చెప్పాడు. మా హీరోకి అలాంటి మెసేజ్ లు పెడతావా? అంటూ నిలదీశారని కూడా చెప్పాడు. దాంతో ఆ ప్రాజెక్టును వదిలి వెళ్లిపోయానని, తన స్క్రిప్టును గిఫ్ట్ గా ఇచ్చేసానని కూడా అనురాగ్ తెలిపారు.
ఆ స్టార్ హీరో ఎవరో చెప్పొచ్చు కదా? అని ప్రశ్నించగా, అందుకు ఆయన నిరాకరించారు. అతడు ఒక పెద్ద స్టార్ హీరో.. చెప్పకూడదు! అని అన్నారు. కొందరు స్టార్లు సెట్లో ఆరోగ్యకరమైన ఆహారం తినేందుకు చెఫ్ లను నియమించుకుంటారని, చెఫ్ కి రోజుకు 2లక్షలు చెల్లించడం చూసానని కూడా అన్నారు. తీరా ఆ చెఫ్ ఏం వండాడో తెలుసుకునేందుకు పెనంలోకి తొంగి చూస్తే అది పక్షుల రెట్టలా ఉందని అనురాగ్ అన్నాడు. బాలీవుడ్ లో అదుపు తప్పిన పరిస్థితులపై కినుక వహించిన అనురాగ్ కశ్యప్ ఇటీవల దక్షిణాది పరిశ్రమకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ అతడు ఓవైపు సినిమాల్లో నటిస్తూనే, మంచి స్క్రిప్టులు వచ్చినప్పుడు దర్శకత్వం వహిస్తున్నాడు.