కోహ్లీ బయోపిక్ కి దర్శకత్వం వహించను.. అనురాగ్ ఊహించని కామెంట్స్!
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన డైరెక్షన్ తో ఎన్నో చిత్రాలతో మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు.;
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన డైరెక్షన్ తో ఎన్నో చిత్రాలతో మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వసూల్ చేస్తూ దర్శకుడిగా బాలీవుడ్ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఇకపోతే తాజాగా ఈయన ప్రముఖ దిగ్గజ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ చేసే అవకాశం తనకు వచ్చిన చేయను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.
అసలు విషయంలోకి వెళితే.. టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ గురించి ఇండస్ట్రీలో ఎప్పటినుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే తాజాగా బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా కోహ్లీ బయోపిక్ గురించి మాట్లాడారు. ఒకవేళ ఈ బయోపిక్ తెరకెక్కించే అవకాశం తనకు వచ్చినా తాను చేయను.. విరాట్ అంటే తనకు ఇష్టమని.. కానీ బయోపిక్ మాత్రం చేయను అంటూ తెలిపారు. అయితే అనురాగ్ కశ్యప్ ఇలాంటి కామెంట్స్ చేయడం వెనుక అసలు కారణం ఏమిటి? అనే విషయంపై కూడా ఆయనే స్వయంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది.
ఈ మేరకు అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. "చిన్నపిల్లలను మొదలుకొని పెద్ద వాళ్ల వరకు విరాట్ కోహ్లీని ప్రతి ఒక్కరు విపరీతంగా అభిమానిస్తారు. క్రికెట్ అభిమానులతో పాటు ఎంతోమంది దృష్టిలో ఆయన ఒక హీరో. ఒకవేళ నేను ఎవరిదైనా బయోపిక్ చేయాల్సి వస్తే కష్టమైన సబ్జెక్టును మాత్రమే ఎంచుకుంటాను. సాధారణ వ్యక్తి జీవితాన్ని తెరపై చూపించడానికి మక్కువ చూపిస్తాను. కోహ్లీ చాలా గొప్ప వ్యక్తి.. నాకు వ్యక్తిగతంగా కూడా బాగా తెలుసు. అందంలోనే కాదు వ్యక్తిత్వంలో కూడా ఆయన ప్రశంసనీయుడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆయన ఒక అద్భుతం.. త్వరగా ఎమోషనల్ కూడా అవుతారు. అందుకే ఒక స్టార్ బయోపిక్ ను నేను తీయడానికి ముందుకు రాను " అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు అనురాగ్ కశ్యప్. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
విరాట్ కోహ్లీ బయోపిక్ విషయానికి వస్తే.. ఇప్పటికే చాలా సార్లు ఈ విషయంపై వార్తలు వైరల్ అయ్యాయి.. ఈ బ్యాటింగ్ మ్యాస్ట్రో పై బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ కూడా సినిమా చేయడానికి సిద్ధంగా ఉంది అంటూ వార్తలు వినిపించాయి.. అందులో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ హీరోగా నటిస్తారంటూ కూడా జోరుగా ప్రచారం సాగింది. దీనిపై రామ్ చరణ్ కూడా క్లారిటీ ఇచ్చారు. "కోహ్లీ నాకు చాలా ఇష్టమైన క్రికెటర్. ఎంతోమందికి స్ఫూర్తి కూడా.. ఒకవేళ ఆయన పాత్ర పోషించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను" అంటూ తన కోరికను బయటపెట్టారు. కానీ ఇప్పటివరకు ఈ బయోపిక్ ను ఎవరు చేయబోతున్నారు అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఏది ఏమైనా విరాట్ కోహ్లీ బయోపిక్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. కానీ ఆచరణకు మాత్రం నోచుకోకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.