'ధురంధర్'పై అనురాగ్ కశ్యప్..అతనో కశ్మీరీ పండిట్!
రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ రూపొందించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ `ధురంధర్` బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ స్ట్రాంగ్‌గా నిలబడి తన ర్యాంపేజ్‌ని కొనసాగిస్తోంది.;
రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ రూపొందించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ స్ట్రాంగ్‌గా నిలబడి తన ర్యాంపేజ్‌ని కొనసాగిస్తోంది. 2025, డిసెంబర్ 5న విడుదలై భారీ వసూళ్లని సొంతం చేసుకుంటూ ఇండియన్ సినిమాల్లో టాప్ 5 హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన సినిమాగా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూ టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. సినిమా రిలీజ్ దగ్గరి నుంచి మౌత్ టాక్ విపరీతంగా స్ప్రెడ్ కావడంతో ప్రేక్షకులు, క్రిటిక్స్, సెలబ్రిటీస్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కొంత మంది స్టార్స్ 'ధురంధర్'పై ప్రశంసలు కురిపిస్తుంటే కొంత మంది మాత్రం తటస్థంగా వ్యవహరిస్తున్నారు. మరి కొందరు ఇందులో చూపించిన అంశాలని రాజకీయ కోణంలో చూస్తూ అవి తమకు నచ్చలేదని కామెంట్ చేస్తున్నారు. ఇటీవల హృతిక్ రోషన్ `ధురంధర్` పై స్పందిస్తూ సినిమా బాగుంది. మేకింగ్ సూపర్ అన్నట్టుగా స్పందించి అదే సమయంలో ఇందులో చూపించిన రాజకీయాంశాలు తనకు నచ్చలేదని చెప్పడం తెలిసిందే. దీంతో నెట్టింట విమర్శలు ఎదుర్కొన్న హృతిక్ ఆ తరువాత తన ఒపీనియన్ మార్చుకుని సినిమాపై ప్రశంసలు కురిపించాడు.
అయినా సరే హృతిక్ రోషన్‌పై నెట్టింట భారీ స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా హృతిక్ రోషన్ తరహాలోనే దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ స్పందించడం ఆసక్తికరంగా మారింది. ఇదొక మంచి సినిమా అంటూ ప్రశంసలు కురిపిస్తూనే సినిమాలోని రెండు డైలాగ్‌లపై అభ్యంతరం చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఈ మూవీ చూసిన అనురాగ్ కశ్యప్ లెటర్‌బాక్స్‌డ్ లో ఆసక్తికరమైన పోస్ట్‌ని షేర్ చేశాడు. ఆదిత్యధర్ దర్శకత్వ ప్రతిభని, రణ్‌వీర్ సింగ్ నటనని ప్రశంసిస్తూనే `ధురంధర్`పై ఓ వివరణాత్మక పోస్ట్‌ని షేర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
'ఒక గూఢచారికి శత్రు దేశంపై ద్వేషం మరియు ఆగ్రహం లేకపోతే అతను గూఢచారి కాలేడు. ఒక సైనికుడికి కూడా శత్రు దేశంపై ఆగ్రహం లేకపోతే అతను సైనికుడు కాలేడు. ఈ రెండు విషయాలలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నాకు రెండు విషయాలతో అభ్యంతరం, సమస్య ఉంది. మాధవన్ `ఒక రోజు వస్తుంది. అప్పుడు ప్రతి ఒక్కరు దేశం గురించి ఆలోచిస్తారు.` అని చెప్పడం. అంతే కాకుండా సినిమా చివర్లో `ఇది కొత్త భారతదేశం` అని రణ్‌వీర్ చెప్పడం..ఆ రెండింటిని పక్కన పెడితే ఇది మంచి చిత్రం. పాకిస్థాన్ నేపథ్యంలో తీసిన ఇదొక బ్రిలియంట్ మూవీ` అన్నారు. అంతే కాకుండా ఆదిత్యధర్‌తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తనని సమర్ధించే ప్రయత్నం చేశాడు.
ఆదిత్యధర్ 'బూంద్' మూవీ నుంచి తెలుసు. అతని రాజకీయాలతో ఏకీభవించినా..ఏకీభవించకపోయినా తను మాత్రం నిజాయితీపరుడు. ఇతరుల మాదిరిగా తను అవకాశవాది కాదు. అతని సినిమాలన్నీ కశ్మీర్ చుట్టూనే ఉంటాయి. అతనో కశ్మీరీ పండిట్. తను ఎంతో బాధని ఎదుర్కొన్నాడు. తనతో ఎవరైనా వాదించండి లేదా అలాగే వదిలేయండి. ఫిల్మ్ మేకింగ్ అనేది అత్యున్నతమైనది. ది హర్ట్ లాకర్, జీరో డార్క్ థర్టీ, హౌస్ ఆఫ్ డైనమైట్స్ ఇవి ఆస్కార్ విన్నింగ్ ఫిలింస్. ఇవి అమెరికా ప్రాపగాండ ప్రచార చిత్రాలు` అన్నాడు. ఇక ఆదిథ్యధర్ మొండితనాన్ని ఈ సందర్భంగా ప్రశంసించాడు. `ధురంధర్`పై అనురాగ్ కశ్యప్ లెటర్ బాక్స్‌డ్‌లో షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.