నెట్‌ఫ్లిక్స్ వివాదంపై ప్రముఖ నటుడి స్పందన

ప్రముఖ బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ అనురాగ్‌ కశ్యప్‌ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న 'అడోలెసెన్స్‌' పై స్పందించాడు.;

Update: 2025-04-05 14:30 GMT

ప్రముఖ బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ అనురాగ్‌ కశ్యప్‌ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న 'అడోలెసెన్స్‌' పై స్పందించాడు. ఆ షో కి తనదైన శైలిలో రివ్యూను ఇచ్చాడు. అదే సమయంలో నెట్‌ఫ్లిక్స్ ఇండియా టీంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. అడోలెసెన్స్‌ లో ధైర్యంగా కథను చెప్పడంను అభినందించాడు. అయితే ఇండియాలో ఇలాంటి కథలను చెప్పేందుకు నెట్‌ఫ్లిక్స్ ఇండియా ప్రతినిధులు ఒప్పుకోవడం లేదు. వారిలో ధైర్యం, సృజనాత్మకత కనిపించడం లేదు. వారు కేవలం ఆర్థిక పరమైన విషయాల్లోనే ఆసక్తి కనబర్చుతున్నారు అంటూ అనురాగ్‌ కశ్యప్‌ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలపై బాలీవుడ్‌కి చెందిన ప్రముఖులు స్పందిస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్ ఇండియా టీం కంటెంట్‌ విషయంలో చాలా కండీషన్స్ పెడుతోందని, స్వేచ్చను ఇవ్వడం లేదని, విదేశీ భాషల్లో వచ్చే అద్భుతమైన కంటెంట్‌ తరహాలో ఇండియాలో కాస్త బోల్డ్‌ లేదా డార్క్‌ షేడ్‌ ఉన్న కంటెంట్‌ను అందించేందుకు ఇక్కడి టీం సిద్ధంగా లేరని అనురాగ్‌ కశ్యప్‌ ఆరోపించాడు. ఈ విషయమై ఆయనకు కొందరు మద్దతు తెలుపుతూ ఉంటే, ఇండియాలో ఉన్న పరిస్థితులను అనుసారంగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా ప్రతినిధులు నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి అనురాగ్‌ కశ్యప్‌ లేవనెత్తిన ఈ విషయం గురించి ప్రముఖంగా సోషల్‌ మీడియా, వెబ్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

తాజాగా ప్రముఖ నటుడు గుల్షన్ దేవయ్య ఈ విషయమై తనదైన శైలిలో స్పందించాడు. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ.. ఎప్పుడూ నేను ఏ ఒక్క విషయం గురించి ఫిర్యాదు చేయాలని అనుకోను. కానీ మనం ఎప్పుడూ ది బెస్ట్‌ చేయగలమని నేను అనుకుంటాను. మేకర్స్ యొక్క క్రియేటివిటీని తాను ఎప్పుడూ ప్రశ్నించను. ఏ ఒక్కరికీ సంపూర్ణ వాక్‌ స్వాతంత్య్రం ఉందని నేను అనుకోవడం లేదు. కొన్ని నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. రెగ్యులర్‌కి భిన్నంగా ఆలోచించాలి, అదే సమయంలో కొత్తగా కథలను చెప్పేందుకు క్రియేటివిటీగా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

అనురాగ్‌ కశ్యప్‌తో కొంత మేరకు ఏకీభవిస్తున్నట్లు గుల్షన్‌ అన్నారు. నేను ఫిల్మ్‌ మేకర్‌ను కాదు కనుక, ఎప్పుడూ ఆ రకమైన చర్చల్లో నేను పాల్గొనలేదు. తాను కేవలం సినిమా కాంట్రాక్ట్‌ల గురించి మాత్రమే చూసుకుంటాను అన్నాడు. ఇతర దేశాలతో పోల్చితే భారతదేశం భిన్నమైనది అనే విషయంను ఒప్పుకోవాల్సిందే. అయితే క్రియేటివిటీ విషయంలో కొందరు స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ ఉంటారు. నెట్‌ఫ్లిక్స్‌ వారు కంటెంట్‌ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ఇది ఇండియా కనుక ఎక్కడ ఇబ్బందులు తలెత్తుతాయో అనే ఆందోళనను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అనురాగ్‌ కశ్యప్‌ అదే విషయమై నెట్‌ఫ్లిక్స్ ఇండియా ప్రతినిధులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముందు ముందు అయినా మేకర్స్ క్రియేటివిటీకి తగ్గట్లుగా సినిమాల మేకింగ్‌ కు నెట్‌ఫ్లిక్స్ ఇండియా ప్రతినిధులు ఒప్పుకుంటారా అనేది చూడాలి.

Tags:    

Similar News