చాలా ధైర్యం ఉంటేనే రాముడిగా నటించగలరు..రణబీర్‌కి అనురాగ్ కితాబు
రణబీర్‌తో `బర్ఫీ` వంటి క్లాసిక్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అనురాగ్ బసు తాజాగా స్పందిస్తూ.. రాముడిగా రణబీర్ మేకోవర్‌ను మనసారా అభినందించారు.;
నితీష్ తివారీ ప్రతిష్టాత్మక దర్శకత్వంలో తెరకెక్కుతున్న `రామాయణం` చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ పై మిశ్రమ స్పందనలు వ్యక్తమైనా కానీ.. ఇందులో పాత్రలు పాత్రధారులు ఆసక్తిని కలిగిస్తున్నారు. టీజర్ విడుదల తర్వాత రణబీర్ కపూర్ `శ్రీరాముడి` లుక్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. టీజర్‌పై భిన్నమైన స్పందనలు వచ్చినా.. రాముడి పాత్రలో రణబీర్ లుక్ మాత్రం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. రణబీర్‌తో `బర్ఫీ` వంటి క్లాసిక్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అనురాగ్ బసు తాజాగా స్పందిస్తూ.. రాముడిగా రణబీర్ మేకోవర్‌ను మనసారా అభినందించారు.
రణబీర్ ఎప్పుడూ సవాళ్లతో కూడుకున్న పాత్రలను ఇష్టపడతాడని.. రాముడి పాత్రలో తన ఊహకు తగ్గట్టుగానే రణబీర్ అద్భుతంగా కనిపిస్తున్నాడని అనురాగ్ బసు పేర్కొన్నారు. శ్రీరాముడి వంటి మహోన్నత పాత్రను పోషించడానికి చాలా ధైర్యం కావాలి. మన పరిశ్రమలో నటులను ఒకే తరహా పాత్రలకు పరిమితం చేస్తారు..టైప్ కాస్ట్ వల్ల నటనకు ఆస్కారం ఉండదు.. కానీ అన్ని పరిధులు దాటి ఈ పాత్రకు రణబీర్ అంగీకరించడం నిజంగా సాహసోపేతమైన నిర్ణయం. నేను చూసినంత వరకు రణబీర్ ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడనిపిస్తోందని కితాబిచ్చారు.
మరోవైపు, రణబీర్ కపూర్ ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక `టైమ్ 100` అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో రణబీర్ చోటు దక్కించుకున్నారు. దీనిపై రామాయణ చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా హర్షం వ్యక్తం చేస్తూ రణబీర్‌తో దిగిన ఫోటోను పంచుకున్నారు. రణబీర్ ఈ తరంలోనే అత్యుత్తమ నటుడని.. శ్రీరాముడి పాత్రకు అతడి కంటే మెరుగైన ఎంపిక మరొకటి ఉండదని ఆయన కొనియాడారు. రణబీర్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఒడిదుడుకులు.. అతడి నిబద్ధతే ఈ స్థాయికి చేర్చాయని నమిత్ పేర్కొన్నారు.
ఈ చిత్రంలో నటీనటుల ఎంపిక కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంది. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా.. సీతమ్మ పాత్రలో దక్షిణాది నటి సాయి పల్లవి, రావణుడిగా కన్నడ స్టార్ యష్ కనిపించనున్నారు. అలాగే హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. ఇంతటి భారీ తారాగణం ఈ పౌరాణిక గాథపై ప్రేక్షకులలో భారీ క్యూరియాసిటీని పెంచింది. నాలుగు దశాబ్దాల క్రితం తమ తండ్రుల మధ్య ఉన్న స్నేహం.. ఇప్పుడు తమను ఈ గొప్ప కావ్యం కోసం కలిపిందని నిర్మాత నమిత్ మల్హోత్రా భావోద్వేగానికి గురయ్యారు.
రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. భారతీయ ఇతిహాసాన్ని అత్యాధునిక సాంకేతికతతో.. అత్యున్నత నిర్మాణ విలువలతో వెండితెరపై ఆవిష్కరించే సాహసం కొనసాగుతోంది. ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
యానిమల్, బ్రహ్మాస్త్ర చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించిన రణబీర్ కపూర్ రామాయణం ఫ్రాంఛైజీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఎంచుకుని తీవ్రంగా శ్రమిస్తున్నారు. నటుడిగా ఛాలెంజింగ్ పాత్రతో మెప్పించాలని రణబీర్ పట్టుదలగా ఉన్నాడు. అతడు యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్, బ్రహ్మాస్త్ర 2లోను వైవిధ్యమైన పాత్రలతో అలరించనున్నారు.