8 ఏళ్ల నుంచి హిట్టు లేదు.. రష్మిక సినిమా అయినా గట్టెక్కిస్తుందా?

ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అందం, అభినయం మాత్రమే సరిపోవు, కొంచెం అదృష్టం కూడా కావాలి. ఈ మాట బహుశా నటి అను ఇమ్మాన్యుయేల్‌కు సరిగ్గా సరిపోతుందేమో.;

Update: 2025-11-07 06:29 GMT

ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అందం, అభినయం మాత్రమే సరిపోవు, కొంచెం అదృష్టం కూడా కావాలి. ఈ మాట బహుశా నటి అను ఇమ్మాన్యుయేల్‌కు సరిగ్గా సరిపోతుందేమో. చూడగానే ఆకట్టుకునే రూపం, నటనకు అవకాశం ఉన్న పాత్రలు దొరికినా.. ఆమె కెరీర్ ఎందుకో గాడిలో పడలేకపోతోంది.

2016 లో న్యాచురల్ స్టార్ నాని సరసన 'మజ్ను' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ మలయాళీ బ్యూటీ. ఆ సినిమాలో కిరణ్మయి పాత్రలో చక్కగా నటించి, మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఈమెకు ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉంటుందని అందరూ అనుకున్నారు.

కానీ, 'మజ్ను' తర్వాత ఆమె వేసిన అడుగులు సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త', 'ఆక్సిజన్' వంటి సినిమాలు నిరాశపరిచాయి. ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో 'అజ్ఞాతవాసి', స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో 'నా పేరు సూర్య' లాంటి భారీ అవకాశాలు వచ్చాయి.

దురదృష్టవశాత్తూ, ఆ రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఆ దెబ్బకు ఆమె కెరీర్ ఒక్కసారిగా వెనకపడింది. ఆ తర్వాత 'శైలజారెడ్డి అల్లుడు' ఫరవాలేదనిపించినా, 'మహా సముద్రం', 'రావణాసుర' వంటి సినిమాలు కూడా ఆమెకు ఏమాత్రం కలిసిరాలేదు. దీంతో ఆమెకు మెయిన్ హీరోయిన్‌గా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.

ఇలాంటి క్లిష్ట సమయంలో, ఆమె ఇప్పుడు 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందన్న టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో, అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలో నటించింది. అయితే, ఇది మెయిన్ లీడ్ కాదు, సినిమాలో రెండో ముఖ్యమైన మహిళా పాత్ర అని స్పష్టంగా తెలుస్తోంది.

కెరీర్ ఆరంభంలో అగ్ర హీరోల సరసన నటించినా దక్కని విజయం, ఇప్పుడు ఇలా సెకండ్ లీడ్‌గా చేస్తున్న పాత్రతో అయినా వస్తుందో లేదో చూడాలి. ఒక్కోసారి మెయిన్ లీడ్ కంటే.. ఇలాంటి కీలక పాత్రలే నటీనటులకు ఎక్కువ పేరు తెచ్చిపెడతాయి. మరి, 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా అను ఇమ్మాన్యుయేల్ కెరీర్‌కు ఆశించిన 'సక్సెస్' ఇస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Tags:    

Similar News