సన్‌గ్రూప్ ఉద్యోగులతో అల్లుడు అనిరుధ్ ఆప్యాయత- సింప్లిసిటీ!
| అనిరుధ్ రవిచందర్, కావ్యా మారన్ తమ వివాహం తర్వాత సన్‌గ్రూప్ ఉద్యోగుల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో ఉద్యోగుల వద్దకు వెళ్లి కొత్త జంట ఆప్యాయంగా పలకరించడం వైరల్‌గా మారింది. ఉద్యోగులకు బంగారు కానుకలు ఇచ్చారనే వార్తలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఈ వేడుకపై సోషల్ మీడియాలో ప్రశంసలతో పాటు పెయిడ్ పీఆర్ విమర్శలు కూడా వస్తున్నాయి.
సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్యా మారన్ ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గ్రీస్‌లో సన్నిహితుల మధ్య జరిగిన ప్రైవేట్ వివాహం.. చెన్నైలో సినీ- రాజకీయ ప్రముఖుల సమక్షంలో నిర్వహించిన గ్రాండ్ రిసెప్షన్ అనంతరం ఈ నూతన దంపతులు తమ సంస్థ ఉద్యోగుల కోసం ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అత్యంత సంపన్న కుటుంబానికి అల్లుడైనా.. అనిరుధ్ ఎటువంటి భేషజాలు లేకుండా సాధారణ కుర్రాడిలా ఉద్యోగులతో కలిసిపోయి సరదాగా ముచ్చటించడం అందరినీ ఆకట్టుకుంది.
ఈ ప్రత్యేక విందులో కావ్యా మారన్ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ.. భోజనం చేస్తున్న ఉద్యోగుల వద్దకు స్వయంగా వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. సాధారణంగా కార్పొరేట్ కంపెనీలలో పండుగలు, వేడుకల పేరుతో కేవలం స్నాక్స్- ప్రసంగాలతో సరిపెడతారని... కానీ సన్‌గ్రూప్ ఉద్యోగులకు మాత్రం రాచమర్యాదలు దక్కుతున్నాయని నెటిజనులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్లేట్లలో వెరైటీ నాన్ వెజ్ వంటకాలు, స్వీట్లు వగైరా వగైరా ఊరిస్తున్నాయని జోక్ చేస్తున్నారు.
మరోవైపు వివాహ ఆహ్వాన పత్రికలతో పాటు మూడేళ్లకు పైగా పనిచేస్తున్న ఉద్యోగులకు బంగారు ఉంగరాలు, సీనియర్ సిబ్బందికి బంగారు నాణేలు..డైమండ్ రింగులు.. మేల్ ఉద్యోగులకు ఖరీదైన దుస్తులను బహుమతులుగా అందించారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. కానుకలు, తాయిలాలే కాదు ఆప్యాయతతోను కావ్య-అనిరుధ్ జంట అందరినీ ఆకట్టుకుంటున్నారు.
కొత్త జంట వినయపూర్వక ప్రవర్తనపై ప్రశంసలు కురుస్తుండగా.. సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇతర భారీ సెలబ్రిటీ వివాహాలతో పోలిస్తే వీరి వేడుక ఎంతో హుందాగా, ఆడంబరాలకు దూరంగా ఉందని పలువురు కొనియాడుతున్నారు. అయితే భోజనం చేస్తున్న సమయంలో కొత్త దంపతులను చూసి ఉద్యోగులు ఒక్కసారిగా లేచి నిలబడటం కాస్త ఇబ్బందికరంగా.. తరగతి గది వాతావరణాన్ని తలపించిందని కొందరు నెటిజనులు అభిప్రాయపడ్డారు.
సహజంగానే ఇలాంటి వేడుకలను వీక్షిస్తే సోషల్ మీడియా డిబేట్లు కామన్. కావ్యా మారన్ మంచితనాన్ని.. ఉద్యోగుల పై తను చూపే గౌరవాన్ని కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరు మాత్రం ఇదంతా కేవలం `పెయిడ్ పీఆర్` స్టంట్ అంటూ ఆరోపిస్తున్నారు. ఏదేమైనా.. ఒక్క విందుతో సన్‌గ్రూప్ కుటుంబంలో అనిరుధ్ తనదైన ముద్ర వేసి.. ఉద్యోగులతో ప్రత్యేక సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారనే విషయం స్పష్టమవుతోంది. ప్రస్తుతం అనిరుధ్ - కావ్యా మారన్ సన్‌గ్రూప్ ఉద్యోగులను ఆప్యాయంగా పలకరిస్తున్న దృశ్యాలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి.