అనిరుధ్ ఫైర్ రివ్యూలు ఎందుకు ఇవ్వట్లేదంటే?
కొందరు మ్యూజిక్ డైరెక్టర్లు తమ మాటలతోనే కాక.. సోషల్ మీడియా పోస్టుల ద్వారా కూడా సినిమాకు హైప్ పెంచే ప్రయత్నం చేస్తుంటారు.;
ఒక సినిమా రష్ అంతా పూర్తయ్యాక.. ఫస్ట్ కాపీ రెడీ కావడానికి ముందు.. మొదటగా ఆ చిత్రాన్ని చూసేది సంగీత దర్శకుడు. సినిమా ఫలితం ఏంటన్నది ముందుగా అర్థం అయ్యేది ఆ వ్యక్తికే. అందుకే సంగీత దర్శకుల అభిప్రాయానికి అందరూ విలువ ఇస్తారు. ఆడియో వేడుకలు, ప్రి రిలీజ్ ఈవెంట్లలో సినిమా గురించి మ్యూజిక్ డైరెక్టర్ ఏం మాట్లాడతాడా అని అందరూ ఆసక్తి ప్రద్శిస్తారు. వాళ్లు మంచి ఎలివేషన్ ఇచ్చారంటే సినిమా బాగుంటుందని ఆశలు పెట్టుకుంటారు.
కొందరు మ్యూజిక్ డైరెక్టర్లు తమ మాటలతోనే కాక.. సోషల్ మీడియా పోస్టుల ద్వారా కూడా సినిమాకు హైప్ పెంచే ప్రయత్నం చేస్తుంటారు. అందులో అనిరుధ్ రవిచందర్ ఒకడు. అతను ఫైర్ ఎమోజీలతో పోస్టు పెట్టాడంటే.. సినిమా ఒక రేంజిలో ఉంటుందని ప్రేక్షకులు నమ్మకం పెట్టుకుంటారు. ‘జైలర్’ సహా కొన్ని చిత్రాలకు తన అంచనా ఫలించింది. కానీ కొన్ని సినిమాల విషయంలో అనిరుధ్ అంచనా తప్పింది. అందుకేనేమో ఈ మధ్య అతను ఆ తరహా పోస్టులు పెట్టట్లేదు. ‘కూలీ’ సినిమాకు కూడా అతను ఇంకా ‘ఫైర్ ఎమోజీ’ పోస్టు పెట్టకపోవడంతో ఈ చిత్రంపై అనిరుధ్ అంచనా ఏంటో అనే ఉత్కంఠతో ఉన్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. దీనిపై అనిరుధ్ ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.
తాను ‘జైలర్’ సినిమాకు ఇచ్చిన ఫైర్ ఎమోజీ రివ్యూ బాగా పని చేసిందని అనిరుధ్ తెలిపాడు. ఆ సినిమాకు బాగా ఎగ్జైట్ అయి అలా పోస్ట్ చేశానని.. కానీ తర్వాత ప్రతి సినిమాకూ ప్రేక్షకులు తన నుంచి ప్రేక్షకులు అలాంటి పోస్టు ఆశించడం మొదలుపెట్టారని అతను చెప్పాడు. కానీ అన్ని సినిమాలూ బాగా ఆడవని.. కొన్ని చిత్రాల రిజల్ట్ ఏంటో ముందే అర్థం అయిపోతుందని.. అప్పుడు పోస్టు ఎలా పెడతామని అనిరుధ్ వ్యాఖ్యానించాడు.
తాను పోస్టు పెట్టకపోతే సినిమా మీద అనుమానాలు వస్తాయని.. అలా అని అబద్ధం చెబితే క్రెడిబిలిటీ దెబ్బ తింటుందని.. ఇది తన మీద చాలా ప్రెజర్ మొదలైందని.. అందుకే ఒక దశ దాటాక ఇక ఫైర్ ఎమోజీలతో రివ్యూలు ఇవ్వకూడదని నిర్ణయించుకుని ఆపేసినట్లు అనిరుధ్ తెలిపాడు. ఐతే ‘కూలీ’ సినిమా విషయంలో అభిమానులకు సందేహాలేమీ అక్కర్లేదని.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టకపోయినా, ఇంటర్వ్యూ ద్వారా చెబుతున్నానని.. దానికి ఫైర్ ఎమోజీలతో రేటింగ్ ఇస్తున్నానని.. సినిమా అదిరిపోయిందని అనిరుధ్ చెప్పాడు.