'స్పిరిట్' త‌ర్వాత‌ సందీప్ వంగాకు ఉన్న ఏకైక ఆప్ష‌న్!

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా తెరకెక్కిన 'యానిమల్' చిత్రం 2023లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో మనందరికీ తెలిసిందే.

Update: 2026-08-15 12:30 GMT

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా తెరకెక్కిన 'యానిమల్' చిత్రం 2023లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో మనందరికీ తెలిసిందే. సినిమా ముగింపులో 'యానిమల్ పార్క్' పేరుతో సీక్వెల్‌ను ప్రకటిస్తూ వేసిన పోస్ట్-క్రెడిట్ సీన్ ప్రేక్షకుల అంచనాలను ఆకాశానికి ఎత్తేసింది. అయితే సినిమా విడుదలై ఇన్ని రోజులవుతున్నా ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి పురోగతి లేకపోవడంతో అసలు 'యానిమల్ పార్క్' ఉందా లేక కేవలం హైప్ కోసం మాత్రమే ఆ టైటిల్ కార్డ్ వేసారా అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.

అయితే సినీ వర్గాల సమాచారం .. నిర్మాత భూషణ్ కుమార్ అందించిన వివరాల ప్రకారం  'యానిమల్ పార్క్' సీక్వెల్ గురించి ఈ ఏడాది చివ‌రిలో వివ‌రాలు వెల్ల‌డించే అవ‌కాశం ఉంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. యానిమ‌ల్ పార్క్ అనేది కేవలం ప్రచారం కోసం వేసిన టైటిల్ కాదని.. ఈ సినిమా స్క్రిప్ట్ ప‌నులు సాగుతున్నాయ‌ని మేకర్స్ గ‌తంలోనే స్పష్టం చేశారు. అయితే ఈ సీక్వెల్ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా - హీరో రణ్‌బీర్ కపూర్‌ల ముందస్తు షూటింగ్ షెడ్యూళ్లతో వారికున్న బిజీ కమిట్‌మెంట్లేనన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రస్తుతం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రెబల్ స్టార్ ప్రభాస్‌తో `స్పిరిట్` అనే భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఈ సినిమా ని వేగంగా పూర్తి చేసి త‌దుప‌రి యానిమ‌ల్ పార్క్ పై దృష్టి సారించాల‌ని సందీప్ వంగా ప‌ట్టుద‌ల‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. మరోవైపు రణ్‌బీర్ కపూర్ కూడా నితేష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక 'రామాయణ' రెండు భాగాలు, అలాగే సంజయ్ లీలా భన్సాలీ `లవ్ అండ్ వార్` చిత్రాలతో పూర్తి బిజీగా ఉన్నారు.

ఈ ఇద్దరి కాల్ షీట్లు ఖాళీగా లేకపోవడం వల్లే `యానిమల్ పార్క్`పై ఎలాంటి ప్ర‌క‌ట‌నా విడుద‌ల చేయ‌డం వీలుప‌డ‌లేదు. నిర్మాణ సంస్థ టి-సిరీస్ అందించిన అప్‌డేట్స్ ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ 2027 మిడిల్ లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండు విభిన్న పాత్రలు (రణవిజయ్ - ఆజీజ్), భారీ గ్రాఫిక్స్ పనులు ఉండటంతో ఈ సినిమా థియేటర్లలోకి రావడానికి 2028 లేదా 2029 వరకు సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.

మధ్యలో రణ్‌బీర్-సందీప్ ల మధ్య విభేదాలు ఉన్నాయని లేదా ప్రొడక్షన్ హౌస్‌తో సమస్యలు వచ్చాయంటూ అనేక రకాల పుకార్లు షికారు చేసినా అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టమైంది. రణ్‌బీర్ కపూర్ -సందీప్ వంగా ఇద్దరూ యానిమల్ ప్రపంచాన్ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నారు. కాబట్టి అభిమానులు కొంచెం ఓపికగా ఎదురుచూస్తే.. కాస్త ఆల‌స్యంగానే అయినా రణవిజయ్ వర్సెస్ ఆజీజ్ మధ్య జరిగే బిగ్గెస్ట్ వైలెంట్ యాక్షన్ డ్రామాను వెండితెరపై చూడవచ్చు. `స్పిరిట్` త‌ర్వాత‌ సందీప్ వంగాకు ఉన్న ఏకైక ఉత్త‌మ‌ ఆప్ష‌న్! అందువ‌ల్ల ఈ సీక్వెల్ ను మ‌రో లెవ‌ల్ లో ఊహించుకోవ‌చ్చు.

Tags:    

Similar News