స్టార్‌లను పక్కనపెట్టి.. అనిల్ సుంకర వేసిన భారీ ప్లాన్!

టాలీవుడ్‌లో నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనిల్ సుంకర గత కొంతకాలంగా ఊహించని ఎదురుదెబ్బలను ఎదుర్కొన్నారు.

Update: 2026-06-11 04:45 GMT

టాలీవుడ్‌లో నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనిల్ సుంకర గత కొంతకాలంగా ఊహించని ఎదురుదెబ్బలను ఎదుర్కొన్నారు. భారీ అంచనాలతో తెరకెక్కిన కొన్ని ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా కూడా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే సినీ పరిశ్రమలో విజయాలు, వైఫల్యాలు సహజమనే విషయాన్ని మరోసారి నిరూపిస్తూ ఇప్పుడు ఆయన ఒకేసారి మూడు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ముందుకు వస్తున్నారు. ఆయ‌న తీసుకున్న‌ ఈ నిర్ణయం AK ఎంటర్‌టైన్‌మెంట్స్ భవిష్యత్తును తిరిగి గాడిలో పెట్టేందుకు రూపొందించిన వ్యూహంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం అనిల్ సుంకర లైనప్‌లో ఉన్న మూడు సినిమాల‌ను పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన అంశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇవి స్టార్ హీరోలపై ఆధారపడిన భారీ బడ్జెట్ ప్రాజెక్టులు కావు. వారి వారి కెరీర్‌లో కీలక మలుపు కోసం ఎదురుచూస్తున్న హీరోలు, డైరెక్ట‌ర్ల‌తో రూపొందుతున్న సినిమాలు. అందుకే ఈ ప్రాజెక్టులు పరిశ్రమలో ప్రత్యేక చర్చకు దారితీస్తున్నాయి.

మొదటగా శ్రీను వైట్ల- శర్వానంద్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న జార్జ్ కృష్ణపై అంద‌రి దృష్టి నిలుస్తోంది. ఒకప్పుడు వరుస బ్లాక్‌బస్టర్లతో టాలీవుడ్‌ను శాసించిన శ్రీను వైట్ల గత కొన్నేళ్లుగా స‌క్సెస్‌కు దూరమయ్యారు. మరోవైపు శర్వానంద్ కూడా నారీ నారీ న‌డుమ మురారి లాంటి క‌మ‌ర్షియ‌ల్ హిట్ త‌ర్వాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి. ఇలాంటి టైమ్ లో వీరిద్దరినీ కలిపి సినిమా నిర్మించాలనే నిర్ణయం అనిల్ సుంకర తీసుకోవడం డేరింగ్ స్టెప్ గానే చెప్పాలి. సంక్రాంతి 2027 టార్గెట్ గా రూపొందుతున్న ఈ సినిమా ఇద్దరికీ కంబ్యాక్ అవకాశంగా మారవచ్చు.

ఇక వడ్డీ కాసులవాడ సినిమాతో మంచు మనోజ్ మరోసారి తన ఉనికిని బలంగా చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు. బిందాస్ తర్వాత AK ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో ఆయన చేస్తున్న ఈ సినిమా కూడా ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. హీరోగా ఈ ప్రాజెక్టు మ‌నోజ్ కు కీల‌కంగా మారే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. ఇక‌ మూడోది వైష్ణవ్ తేజ్ హీరోగా మహేష్ సూరపనేని దర్శకత్వంలో రూపొందనున్న సినిమా. ఉప్పెన తర్వాత ఆశించిన స్థాయి విజయాలను అందుకోలేకపోయిన వైష్ణవ్ తేజ్‌కు ఈ సినిమా కొత్త ప్రారంభంగా మారుతుందనే అంచనాలు ఉన్నాయి.

ఈ మూడు ప్రాజెక్టులను ఒకే ఫ్రేమ్‌లో చూస్తే టాలీవుడ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న కంబ్యాక్‌ల సీజన్ స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీను వైట్ల, మంచు మనోజ్, వైష్ణవ్ తేజ్.. ముగ్గురూ తమ తమ కెరీర్‌లలో మళ్లీ బలంగా నిలబడాల్సిన అవసరం ఉన్న దశలో ఉన్నారు. అలాంటి వారిపై నిర్మాతగా అనిల్ సుంకర నమ్మకం ఉంచడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, ఈ లైనప్ మరో విషయాన్ని కూడా సూచిస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌ల కోసం పోటీ పడే బదులుగా కంటెంట్‌కు ప్రాధాన్యం ఉన్న, మధ్యస్థాయి మార్కెట్ కలిగిన హీరోలతో సినిమాలు చేయాలనే వ్యూహాన్ని అనిల్ సుంకర ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. భారీ రెమ్యునరేషన్లు, అధిక బడ్జెట్‌ల కంటే సరైన కథలు, సరైన కాంబినేషన్లపై దృష్టి పెట్టినట్లు ఈ ప్రాజెక్టులు సూచిస్తున్నాయి. అందుకే ఈ మూడు సినిమాలు కేవలం కొత్త ప్రాజెక్టులు మాత్రమే కాదు. AK ఎంటర్‌టైన్‌మెంట్స్ రీబిల్డింగ్‌కు బ్లూప్రింట్, పలువురు నటులు- డైరెక్ట‌ర్ల కంబ్యాక్ ప్రయత్నాలకు వేదిక, అలాగే నిర్మాతగా అనిల్ సుంకర తీసుకుంటున్న ధైర్యమైన రిస్క్‌లకు ప్రతీకగా నిలుస్తున్నాయి. మ‌రి ఆయ‌న చేస్తున్న ఈ రిస్క్ ఎలాంటి ఫ‌లితాన్నిస్తుందో చూడాలి.

Tags:    

Similar News