ఎంతైనా మెగా ఫ్యామిలీ క‌దా...! అనీల్ రావిపూడి పంచ్!!

ఈ క్రమంలో `రాకాస` చిత్రం సాధించిన విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సమ్మర్ బ్లాక్‌బస్టర్ ఈవెంట్‌లో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశారు;

Update: 2026-04-07 04:04 GMT

ప్రస్తుతం టాలీవుడ్‌లో చిన్న చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. ఈ క్రమంలో `రాకాస` చిత్రం సాధించిన విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సమ్మర్ బ్లాక్‌బస్టర్ ఈవెంట్‌లో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెగా ఫ్యామిలీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. నిహారిక కొణిదెల ఫోన్ చేసి ఈవెంట్‌కు వ‌స్తున్నారు క‌దా! అని కోర‌గానే..ముంబై వెళ్లాల్సిన షెడ్యూల్ ఉన్నా.. కాదనలేక వచ్చానని.. ఎంతైనా మెగా ఫ్యామిలీ క‌దా...! అంటూ స‌ర‌దాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను అలరించాయి.

ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన నిహారికను అనిల్ రావిపూడి `మోస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్` అని అభివర్ణించారు. సినిమా పై త‌న‌కు ఉన్న అంకితభావం.. ప్రమోషన్ల కోసం ఆమె పడే కష్టం గొప్పదని కొనియాడారు. అలాగే దర్శకురాలు మానస శర్మను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఒక మహిళా దర్శకురాలు.. ఒక మహిళా నిర్మాత కలిసి ఈ స్థాయి బ్లాక్‌బస్టర్ కొట్టడం నిజమైన`గర్ల్ పవర్`కు నిదర్శనమని అభినందించారు. ప్రతిభ ఉన్న మహిళా టెక్నీషియన్లు పరిశ్రమలోకి రావడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు.

సినిమాలోని నటీనటుల గురించి ప్రస్తావిస్తూ.. సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్‌పై అనిల్ ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో ఒక ప్రమోషనల్ వీడియో చేస్తున్నప్పుడే సంగీత్ తన టైమింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడని.. భవిష్యత్తులో అతడు పెద్ద స్టార్ అవుతాడని అప్పుడే ఊహించానని చెప్పారు. వెన్నెల కిషోర్ సెకండ్ హాఫ్‌లో చేసిన అల్లరి సినిమాకు ప్రధాన బలమని.. హీరోయిన్ నయన్ సారిక ఇతర నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని మెచ్చుకున్నారు.

వేసవి కాలంలో సినిమాలకు ఐపీఎల్ ఒక పెద్ద సవాల్ అని అనిల్ రావిపూడి అభిప్రాయపడ్డారు. క్రికెట్ మ్యాచెస్ జరుగుతున్న సమయంలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కష్టమైన పని అని.. కానీ `రాకాస` వంటి వినోదాత్మక చిత్రాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు అత‌డు కృతజ్ఞతలు తెలిపారు. తనకు కూడా క్రికెట్ అంటే ఇష్టమేనని..అయితే ఐపీఎల్ చూస్తూనే మంచి సినిమాలను కూడా థియేటర్లలో ఆదరించాలని ఆయన కోరారు.

చివరగా.. తాను ఇంకా పూర్తి సినిమా చూడలేదని.. వైజాగ్ వెళ్ళిన తర్వాత థియేటర్‌లో ఫస్ట్ షో చూస్తానని అనిల్ రావిపూడి తెలిపారు. నిహారిక కోరిక మేరకు థియేటర్ లోపల ఒక సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News