రావిపూడి ఊహించని ప్లాన్.. జానర్ మార్చుతున్నారా?
టాలీవుడ్ లో కమర్షియల్ ఎంటర్టైనర్లకు పెట్టింది పేరు దర్శకుడు అనిల్ రావిపూడి. ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, కామెడీ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను అలరించే సినిమాలను తెరకెక్కిస్తూ వరుస విజయాలు అందుకుంటున్నారు.;
టాలీవుడ్ లో కమర్షియల్ ఎంటర్టైనర్లకు పెట్టింది పేరు దర్శకుడు అనిల్ రావిపూడి. ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, కామెడీ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను అలరించే సినిమాలను తెరకెక్కిస్తూ వరుస విజయాలు అందుకుంటున్నారు. ఆయన చిత్రాలు సాధారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకుని రూపొందుతుంటాయి. అందుకే ఆయన దర్శకత్వంలో వచ్చే సినిమాలపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి కనిపిస్తుంటుంది.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారు మూవీతో రావిపూడి మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. కమర్షియల్ గా కూడా ఆ సినిమాతో సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన అప్ కమింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తున్నారు. స్టార్ హీరోలు వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలిసి నటించే మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు అనిల్ రావిపూడి సిద్ధమవుతున్నారు.
రీసెంట్ గా ఆ సినిమాను ఆయన అనౌన్స్ చేయగా.. స్క్రిప్ట్ పనులు ఇప్పటికే చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ ప్రాజెక్టు షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇంతలోనే అనిల్ రావిపూడి అప్ కమింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటివరకు కమర్షియల్ కామెడీ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన, ఈసారి కొత్త జోనర్ ను టచ్ చేయబోతున్నారని సమాచారం.
తనకు అచ్చొచ్చిన జోనర్ ను వదులుకోకుండా.. భారీ స్థాయిలో రూపొందే ఓ యానిమేషన్ ప్రాజెక్టుపై వర్క్ చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ స్థాయికి ఎదిగిన అనిల్ రావిపూడి యానిమేషన్ జోనర్ లో సినిమా చేయాలని ప్లాన్ చేయడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారీ రేంజ్ స్టోరీతో, విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యమిచ్చేలా ఆ ప్రాజెక్టును రూపొందించాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం.
ఆ సినిమాను నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందే ఆ యానిమేషన్ మూవీ కోసం ప్రస్తుతం బేసిక్ వర్క్స్ కొనసాగుతున్నాయని సమాచారం. కథ, టెక్నికల్ టీమ్ ఎంపిక వంటి అంశాలపై కూడా చర్చలు జరుగుతున్నాయని వినికిడి. అయితే ఆ యానిమేషన్ ప్రాజెక్టు వెంటనే ప్రారంభం అయ్యే అవకాశాలు లేవని టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం అనిల్ రావిపూడి ఇతర కమిట్మెంట్లతో బిజీగా ఉండటంతో.. ఆ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. వెంకీ, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ అయ్యాక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఇప్పటివరకు కమర్షియల్ ఎంటర్టైనర్‌తో విజయాలు అందుకున్న రావిపూడి, ఇప్పుడు యానిమేషన్ జోనర్ లోకి అడుగుపెట్టాలనుకోవడం ఆసక్తికరంగా మారింది. ఆ ప్రాజెక్టు నిజంగా రూపొందితే.. దర్శకుడిగా ఆయన కెరీర్ లో మరో కొత్త ఛాప్టర్ స్టార్ట్ అవుతుందనే చెప్పాలి. మరేం జరుగుతుందో వేచి చూడాలి.