హాఫ్ సెంచరీలు బ్యాక్ టూ బ్యాక్ అతడికే సాధ్యం!
ఈరోజుల్లో సినిమా వారం రోజులు ఆడితే వంద రోజులు ఆడినట్లే. ఎందుకంటే 100 రోజుల కలెక్షన్స్ వారం రోజుల్లోనే సినిమాలు రాబడుతున్నాయి.;
ఈరోజుల్లో సినిమా వారం రోజులు ఆడితే వంద రోజులు ఆడినట్లే. ఎందుకంటే 100 రోజుల కలెక్షన్స్ వారం రోజుల్లోనే సినిమాలు రాబడుతున్నాయి. దీంతో వంద రోజులు...50 రోజులు సినిమా థియేటర్లో పని లేకుండా పోతుంది. అన్ని రోజులు ఆడినా జనాలు చూసే స్థితిలో లేరు. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన రెండు..మూడు వారల్లోనే ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఇంకా ముందుగానే రిలీజ్ చేయాలనుకుంటే థియేటర్లో ప్లాప్ అయితే వారం లోనే ఓటీటీలో ఆ చిత్రం దర్శనమిస్తోంది. దీంతో ఎంత గొప్ప సినిమా తీసినా? అందులో ఎంత పెద్ద స్టార్ నటించినా? సినిమా అన్నది థియేటర్లో వారం మించి ఆడటం కష్టంగా మారింది.
వారం దాటి ఆడితే ఆ చిత్రాన్ని గొప్పగానే చెప్పాలి. అలాంటి రోజుల్లో కూడా అనీల్ రావిపూడి ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. తాజాగా అనీల్ రావిపూడి రీసెంట్ రిలీజ్ `మన శంకర వరప్రసాద్ గారు` దిగ్విజయంగా 50 రోజులను పూర్తి చేసుకుంది. 109 సెంటర్లలో ఈ చిత్రం అర్ధశతదినోత్సవాన్ని పూర్తి చేసుకుంది. దీంతో ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందన్నది మరోసారి ప్రూవ్ అయింది. ఎంత భారీ హిట్ అయినా ఇన్ని రోజులు థియేటర్లో ఆడటం అన్నది చిన్న విషయం కాదు. అందులోనూ 100కి పైగా దాటిన సెంటర్లలోనే అంటే ఆమాషాషీ కాదు.
ఆ రకంగా అనీల్ పేరిట ఇదో రికార్డు. అనీల్ రావిపూడి పేరిప్పుడు టాలీవుడ్ లో ఓ బ్రాండ్. ఇప్పటి వరకూ వైఫల్యమే ఎరుగని దర్శకుడిగా పేరుంది. డైరెక్ట్ చేసిన తొమ్మిది సినిమాలు బ్లాక్ బస్టరే. అవన్నీ ఒకదాన్ని మించి మరోటి విజయం సాధించిన చిత్రాలే. వీటిలో ఎనిమిది సినిమాలు 50 రోజుల పాటు థియేటర్లో దిగ్విజయంగా ఆడినవే ఓసారి వాటి వివరాల్లోకి వెళ్తే.. అనీల్ రావిపూడి దర్శకుడి పని చేసిన తొలి సినిమా `పటాస్` బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది. కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచిన చిత్రమిది. దాదాపు అన్ని ప్రధాన కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకుంది.
అటుపై మెగా మేనల్లుడు సాయితేజ్ తో తెరకెక్కించిన `సుప్రీమ్` ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా కూడా మెజారిటీ థియేటర్లలో 50 రోజులు ఆడింది. అలాగే మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కించిన `రాజా ది గ్రేట్` మాస్ సెంటర్లలో 50 రోజుల మైలురాయిని సులభంగా దాటేసింది. వెంకటేష్-వరుణ్ తేజ్ కథానాయకులుగా తెరకెక్కించిన `ఎఫ్ 2`: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్` చాలా సెంటర్లలో 50 రోజులు, కొన్ని చోట్ల 100 రోజులు కూడా ఆడింది. మహేష్ నటించిన `సరిలేరు నీకెవ్వరు` బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ రన్ సాధించి 50 రోజులు పూర్తి చేసుకుంది. అనంతరం `ఎఫ్ 3` కూడా కీలక సెంటర్లలో 50 రోజులు ఆడింది. బాలకృష్ణ నటించిన `భగవంత్ కేసరి` కూడా సక్సెస్‌ఫుల్‌గా 50 రోజులు ఆడింది. ఇలా అనీల్ రావిపూడి ఖాతాలో అర్ధశతదినోత్సవం పూర్తిచేసుకున్న చిత్రాలున్నాయి.