ఏపీ టాలీవుడ్ నిర్మాణం: ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. సినీపెద్దలే పట్టించుకోలేదా?
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర, టెలివిజన్ -నాటక రంగాన్ని ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ఇటీవలే కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్‌కు సమాంతరంగా మరో కొత్త టాలీవుడ్ ని నిర్మించేందుకు పాలకులు సిద్ధంగా లేరా? లేక ఇండస్ట్రీకి చెందిన అగ్ర శ్రేణి సినీ పెద్దలకే ఆసక్తి లేదా? అనే ప్రశ్నలపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ వర్గాల్లో విభిన్న కోణాల్లో ఆసక్తికరమైన విశ్లేషణలు సాగుతున్నాయి. ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో ఎంతో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏపీలో సరికొత్త చిత్రసీమ ఏర్పాటుపై సానుకూల వైఖరితోనే ఉంది. ఇందుకోసం గతంలోనే పరిశ్రమ ప్రముఖులతో పలు సమీక్షా సమావేశాలను కూడా నిర్వహించింది. అంతేకాకుండా ప్రతి ఏటా ప్రతిష్టాత్మక `నంది అవార్డులు` అందించాలనే బలమైన సంకల్పం కూడా ప్రభుత్వానికి ఉన్నా కానీ.. ఆనాటి నంది జూరీ సభ్యులు .. కొంతమంది సినీ పెద్దల ఏకపక్ష నిర్ణయాల వల్ల ఆ పురస్కారాల కార్యక్రమం తీవ్ర వివాదాల్లో చిక్కుకుని అపహాస్యం పాలైంది. మీడియాలో వరుసగా వచ్చిన వ్యతిరేక కథనాలు ప్రభుత్వానికి తీవ్ర గౌరవభంగంగా మారడంతో.. అప్పటి నుండి పాలకులు అవార్డుల ఊసెత్తకుండా సైలెంట్ అయిపోయారు.
ప్రభుత్వం వైపు నుండి కొంత నిశ్శబ్దం ఆవరించినా.. కనీసం టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు, సినీపెద్దలైనా చొరవ తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును లేదా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలిసి ఏపీలో మరో కొత్త సినీ పరిశ్రమ విస్తరణపై అభ్యర్థించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. ప్రస్తుతం పరిశ్రమకు చెందిన నిర్మాతలు లేదా వివిధ రంగాల ప్రతినిధులు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలు ఏవైనా ఉంటే నేరుగా వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు విన్నవిస్తున్నారు. అయితే ఇదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి పరిశ్రమ సమిష్టి ప్రణాళికల గురించి గౌరవప్రదంగా ఒక మాట కూడా మాట్లాడకపోవడం ఇటీవలి కాలంలో పొలిటికల్ కారిడార్‌లో విస్తృతంగా చర్చకు దారితీసింది. సినీ పెద్దల ఈ తరహా వైఖరి వెనుక అసలు కారణాలు ఏంటనే కోణంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర, టెలివిజన్ -నాటక రంగాన్ని ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ఇటీవలే కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ఏపీ ఫిలిం-టీవీ రంగం, నాటక రంగ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన APSFTvTDC (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ) కొత్త డైరెక్టర్‌గా చదలవాడ శ్రీనివాసరావును, ఛైర్మన్‌గా భరత్ భూషణ్‌ను నియమించింది. ఈ సరికొత్త నియామకాల తర్వాతైనా రాష్ట్రంలో సినిమా, థియేటర్ ఆర్ట్స్ రంగాలు కొత్త పుంతలు తొక్కుతాయని అంతా ఆశిస్తున్నారు. ఎందుకంటే ఇన్నాళ్లూ విజయవాడ కేంద్రంగా ఎఫ్‌డీసీ (FDC) బోర్డు ఉన్నప్పటికీ గతంలో అంబికా కృష్ణ లాంటి వారు అధ్యక్షులుగా వ్యవహరించిన కాలంలోనూ ప్రకటనలు ఘనంగా ఉండటమే తప్ప ఆచరణలో పనులు శూన్యంగా మారాయనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుత సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ చేస్తున్న ప్రకటనలు కూడా కేవలం నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో కార్యాచరణ శూన్యమనే అసంతృప్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో కనీసం ఇప్పుడైనా APSFTvTDC లేదా ఏపీ ఎఫ్‌డీసీలలో కదలిక వస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. నవ్యాంధ్రలో ఒక బలమైన చిత్రసీమ అభివృద్ధి చెందాలని అటు ప్రజలు, ఇటు రాజకీయ నాయకులు బలంగా ఆకాంక్షిస్తున్నప్పటికీ.. టాలీవుడ్ అగ్ర నేతలెవరూ ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోరకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవల APSFTvTDC కొత్త డైరెక్టర్, ఛైర్మన్‌లను సన్మానించిన ఫిల్మ్ ఛాంబర్.. నామమాత్రంగా ఏపీలో సినిమా అభివృద్ధికి సహకరిస్తామని ప్రకటించింది తప్ప, అందుకు సంబంధించిన స్పష్టమైన విధివిధానాలను కానీ.. భవిష్యత్ కార్యాచరణను కానీ ఎక్కడా వెల్లడించలేదు. హైదరాబాద్‌కు సమాంతరంగా ఏపీలో సరికొత్త సినీ హబ్‌ను నిర్మించాలంటే అన్ని వైపుల నుండి బలమైన కసి, నిరంతర శ్రమ అవసరం. కానీ ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వాల్లో చలనం తెచ్చేలా ఎలాంటి ముందడుగు వేయకపోవడం వల్ల ఈ కల ఎప్పటికీ నెరవేరనిదిగానే మిగిలిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.