'ఆంధ్ర కింగ్ తాలూకా'ను ఓటీటీ దెబ్బ కొట్టిందా?

మంచి సినిమాగా పేరు తెచ్చుకున్నా.. రివ్యూలు, పబ్లిక్ టాక్ బాగున్నా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా అనుకున్నంతగా ఆడకపోవడం మీద ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చే జరుగుతోంది.;

Update: 2025-12-03 15:30 GMT

మంచి సినిమాగా పేరు తెచ్చుకున్నా.. రివ్యూలు, పబ్లిక్ టాక్ బాగున్నా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా అనుకున్నంతగా ఆడకపోవడం మీద ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చే జరుగుతోంది. రామ్ లేక లేక మంచి సినిమా ఇస్తే చూడరేంటి అంటూ అభిమానులు ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ.. ‘టీఎఫ్ఐ ఫెయిల్డ్ హియర్’ అనే ట్యాగ్‌ను కూడా జోడించారు. దాని మీద రామ్ సైతం నిన్నటి సక్సెస్ ప్రెస్ మీట్లో స్పందించాడు. ప్రేక్షకులను తప్పుబట్టలేమని.. వాళ్లు మంచి సినిమాను ఎప్పుడూ ఫెయిల్ చేయరని అన్నాడు.

ఈ సినిమాకు తక్కువ కలెక్షన్లు వస్తాయని తాము ముందే ఊహించామని రామ్ ఈ సందర్భంగా చెప్పాడు. నిర్మాతలు కూడా ఇదే రకంగా మాట్లాడారు. వాళ్లందరూ ఒక విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. అన్ సీజన్ అయిన నవంబరులో ఈ సినిమాను రిలీజ్ చేయడం తప్పని అన్నారు. వెంకటేష్‌ లాంటి పెద్ద స్టార్‌తో తాను కలిసి నటించిన ‘మసాలా’ చిత్రాన్ని నవంబరులో రిలీజ్ చేయడం వల్ల ఓపెనింగ్స్ కూడా రాకపోవడాన్ని రామ్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు కూడా.

ఐతే నవంబరు ఇంత బ్యాడ్ సీజన్ అని తెలిసి కూడా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఆ నెలలోనే సినిమాను ఎందుకు రిలీజ్ చేసింది అన్నది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. కానీ విధి లేకే టీం అలా చేసిందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ రోజుల్లో కొత్త సినిమాల రిలీజ్ డేట్లను ఓటీటీ సంస్థలు నిర్దేశిస్తున్నాయి.

ముందుగా డిజిటల్ రిలీజ్ స్లాట్ ఫిక్స్ చేసి.. అందుకు అనుగుణంగా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ నిర్ణయించుకునేలా చేస్తున్నాయని.. ముందే డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌కు అమ్మేసిన మైత్రీ వాళ్లు.. వాళ్లు చెప్పిన ప్రకారమే మరో ఆప్షన్ లేక నవంబరు చివరి వారంలో సినిమాను రిలీజ్ చేశారని అంటున్నారు. ఇలా తప్పక నవంబరులో రిలీజ్ చేసి థియేట్రికల్ రెవెన్యూను దెబ్బ తీసుకున్నారని.. ఒకవేళ క్రిస్మస్ లాంటి టైంలో రిలీజ్ చేస్తే సినిమాకు కచ్చితంగా మెరుగైన వసూళ్లు వచ్చేవని ట్రేడ్ పండిట్లు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News