అనసూయ శివాజీలో ఎవరు గెలిచారు.. మధ్యలో అన్వేష్ ఎందుకు వచ్చాడు?
అనసూయ వర్సెస్ శివాజీ.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నడుస్తున్న హాట్ టాపిక్ ఇదే.;
అనసూయ వర్సెస్ శివాజీ.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నడుస్తున్న హాట్ టాపిక్ ఇదే. ఒక డ్రెస్సింగ్ కామెంట్ తో మొదలైన ఈ రచ్చ, రోజుకో మలుపు తిరుగుతూ సాగింది. అసలు ఇందులో న్యాయం ఎవరి వైపు ఉంది? చివరికి ఎవరు గెలిచారు? అని ఆరా తీస్తే ఆసక్తికరమైన నిజాలు బయటపడుతున్నాయి. పైకి ఇది ఆత్మగౌరవం పోరాటంలా కనిపిస్తున్నా, లోపల జరుగుతున్న తంతు వేరు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
నిజానికి.. ఈ ఎపిసోడ్ లో అనసూయ గెలవలేదు, అలాగని శివాజీ కూడా గెలవలేదని అంటున్నారు. ఇద్దరూ తమ సోషల్ మీడియా అకౌంట్ల ఎంగేజ్మెంట్ పెంచుకోవడంలో మాత్రం సక్సెస్ అయ్యారని.. ఇద్దరికీ ఫాలోవర్స్ పెరిగారు, రీచ్ పెరిగిందని అంటున్నారు. జనాలకు బోర్ కొడుతున్నా సరే, ఈ ఇష్యూని ఇంకా డ్రాగ్ చేయడం వెనుక అసలు కారణం ఇదేనని నెటిజన్లు ఫిక్స్ అయ్యారు. ఇదంతా ఒక 'మ్యూచువల్ బెనిఫిట్' డ్రామాలా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక ఈ మంటల్లో చలి కాచుకోవడానికి వచ్చిన మూడో వ్యక్తి యూట్యూబర్ అన్వేష్. ఒకప్పుడు మంచి ట్రావెల్ వ్లాగర్ గా పేరు తెచ్చుకున్న అన్వేష్, ఈ మధ్య కాలంలో తన గ్రాఫ్ పడిపోవడంతో ఆందోళనలో ఉన్నట్లున్నాడు. కొత్త ఫాలోవర్స్ రాకపోగా, ఉన్నవాళ్ళు తగ్గుతున్నారు. దీంతో ఎలాగైనా మళ్ళీ ట్రెండింగ్ లోకి రావాలనే అత్యుత్సాహంతో ఈ వివాదంలో తలదూర్చాడు. కానీ అది కాస్తా రివర్స్ అయ్యింది.
లాజిక్ తో మాట్లాడాల్సింది పోయి, నోటికి వచ్చినట్లు బూతులతో విరుచుకుపడటంతో అన్వేష్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా సీతమ్మ, ద్రౌపది గురించి ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని ఆగ్రహానికి గురిచేశాయి. సపోర్ట్ కోసం వస్తే, ఉన్న పరువు కాస్తా గంగలో కలిసినట్లయ్యింది. అటెన్షన్ కోసం చేసిన పని ఇప్పుడు అతని కెరీర్ కే ఎసరు తెచ్చేలా ఉంది.
దెబ్బ గట్టిగా తగిలేసరికి బ్యాంకాక్ లో వినాయకుడి సాక్షిగా క్షమాపణలు చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ కూడా "నేను తప్పు చేస్తే రక్తం కక్కుకుని చనిపోతా" అంటూ సవాళ్లు విసరడం సిల్లీగా అనిపించింది. చేసిన తప్పును కవర్ చేసుకోవడానికి ఎంత ప్రయత్నించినా, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. నెగిటివిటీని తట్టుకోలేక ఇప్పుడు కవర్ డ్రైవ్ లు ఆడుతున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఫైనల్ గా చూస్తే.. అనసూయ, శివాజీ ఎవరి దారిలో వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు. కానీ మధ్యలో వచ్చిన అన్వేష్ మాత్రం పెద్ద చిక్కుల్లో పడ్డాడు. ఫాలోవర్స్ అంతా మూకుమ్మడిగా రిపోర్ట్ చేస్తుండటంతో, 'నా అన్వేషణ' ఛానల్ మళ్ళీ మొదటికి వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. సోషల్ మీడియాలో క్రేజ్ కోసం హద్దులు దాడితే ఫలితం ఎలా ఉంటుందో అన్వేష్ ఎపిసోడ్ ఒక ఉదాహరణగా మిగిలిపోనుందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ఒక అభిప్రాయం ఉన్నప్పుడు దాన్ని అర్థమయ్యేలా చెప్పాలి కానీ బూతులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామని హిందు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదవుతున్నాయి. ఎప్పటికైనా అన్వేష్ ఇండియాకు వస్తాడు కదా అప్పుడు అతనికి తగిన కౌంటర్ ఇస్తామని మరికొందరు అంటున్నారు.