అనంత్ అంబానీ ‘శివ’ వాచ్.. రూ.12 కోట్ల ఆధ్యాత్మిక కళాఖండం..!
అంబానీ ఇంట జరిగే వేడుకలే కాదు.., వారు ధరించే వస్తువులు కూడా ప్రపంచానికి అద్భుతంలా కనిపిస్తాయి.;
అంబానీ ఇంట జరిగే వేడుకలే కాదు.., వారు ధరించే వస్తువులు కూడా ప్రపంచానికి అద్భుతంలా కనిపిస్తాయి. అనంత్ అంబానీ ధరించిన ఈ జాకబ్ అండ్ కో (Jacob & Co) వాచ్ కేవలం సమయాన్ని చూపే పరికరం మాత్రమే కాదు.. అత్యాధునిక ఇంజినీరింగ్, భారతీయ ఆధ్యాత్మికత కలగలిసిన ఒక అరుదైన కళాఖండం. రూ.12 కోట్ల విలువైన ఈ గడియారం విశేషాలను తెలుసుకుందాం.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాచ్ ప్రియులను ఆకర్షిస్తున్న ఈ గడియారం పేరు ‘ఓపెరా గాడ్‌ఫాదర్ బాగుట్ శివ’. ప్రపంచ కుబేరుల కోసం అత్యంత సంక్లిష్టమైన గడియారాలను రూపొందించే ‘జాకబ్ అండ్ కో’ దీనిని అనంత్ అంబానీ కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఒక గడియారంలో వెయ్యికి పైగా వజ్రాలు ఉండడం ఒకెత్తు అయితే, దాని గుండెకాయ లాంటి మధ్య భాగంలో ధ్యాన ముద్రలో ఉన్న శివుడి విగ్రహం కొలువై ఉండడం ఈ వాచ్‌ను ప్రపంచంలోనే అత్యంత విభిన్నమైనదిగా మార్చింది.
ఖరీదైన హంగులు
ఈ వాచ్ కేవలం ఒక నగలా భావించవచ్చు. దీని తయారీలో వాడిన మెటీరియల్స్ అత్యంత ఖరీదైనవి. ఈ వాచ్ బాడీ మొత్తం 18 క్యారెట్ల రోజ్ గోల్డ్‌తో తయారైంది. దీనిపై 300కు పైగా బాగుట్ కట్ వజ్రాలను అత్యంత నైపుణ్యంతో పొదిగారు. మొత్తం మీద చిన్నవీ, పెద్దవీ కలిపి వెయ్యికి పైగా వజ్రాలు ఈ వాచ్‌లో మెరుస్తుంటాయి. ప్రతి వజ్రాన్ని చేతితోనే అమర్చడం దీని ప్రత్యేకత. వాచ్ లోపల మధ్యలో అట్రాక్షన్‌గా ఉన్న శివుడి విగ్రహం ‘ఓం (ॐ)’ చిహ్నం భారతీయ సంస్కృతి పట్ల అంబానీ కుటుంబానికి ఉన్న భక్తి చాటిచెబుతున్నాయి.
658 విడి భాగాలు
సాధారణ గడియారాల్లో వంద లోపు విడిభాగాలు ఉంటాయి, కానీ ఈ వాచ్‌లో ఏకంగా 658 సూక్ష్మ విడిభాగాలు ఉన్నాయి. ఇది ఒక మ్యూజికల్ వాచ్. ఒక చిన్న బటన్ నొక్కగానే ‘ది గాడ్‌ఫాదర్’ సినిమాలోని థీమ్ మ్యూజిక్ ప్లే అవుతుంది. ఈ మ్యూజిక్ వస్తున్నప్పుడు వాచ్ లోపల ఉన్న రెండు సిలిండర్లు తిరుగుతూ సంగీతాన్ని ఉత్పత్తి చేస్తాయి. భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల సమయం చూపడంలో వచ్చే తేడాను అరికట్టడానికి ఇందులో ట్రిపుల్ యాక్సిస్ టూర్‌బిలియన్ టెక్నాలజీని వాడారు. ఇది గడియారాన్ని అత్యంత ఖచ్చితంగా ఉంచుతుంది.
ఈ గడియారం కేవలం విలాసం కోసం మాత్రమే కాదు, ఒక లోతైన సందేశాన్ని ఇస్తుంది. గడియారంలో కాలుడిని అమర్చడం ద్వారా ‘కాలం అనంతమైనది, అది శివ స్వరూపం’ అనే భావన వస్తుంది. సంపద ఎంత ఉన్నా, ఆధ్యాత్మిక ప్రశాంతత అంతరాత్మలోనే ఉంటుందని ధ్యాన ముద్రలోని శివుడు గుర్తు చేస్తాడు.
అనంత్ అంబానీ వాచ్ కలెక్షన్
అనంత్ అంబానీకి గడియారాల మీద ఉన్న మక్కువ అంతా ఇంతా కాదు. ఆయన వద్ద ఉన్న కలెక్షన్ విలువ రూ.200 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. గతంలో జరిగిన ఒక వేడుకలో అనంత్ ధరించిన వాచ్‌ను చూసి మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రిసిల్లా చాన్ ఆశ్చర్యపోయారు. ‘నాకు ఎప్పుడూ వాచ్‌ల మీద ఆసక్తి ఉండేది కాదు.., కానీ నీ వాచ్ చూశాక అవి ఎంత బాగుంటాయో అర్థమైంది.’ అని జుకర్‌బర్గ్ ప్రశంసించారు.
రూ.12 కోట్ల వాచ్ సామాన్యులకు కలనే.. కానీ అంబానీ వంటి కుబేరుల విషయంలో అది వారి స్థాయికి తగ్గ విలాసం. కేవలం విలాసానికే పరిమితం కాకుండా, తమ మూలాలను, భక్తిని ఇలాంటి వస్తువుల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పడం అభినందనీయం. ఈ గడియారం ప్రపంచ వాచ్ తయారీ రంగంలో భారత్ ఆధ్యాత్మిక ముద్ర వేసిందని చెప్పవచ్చు.