'అమ్మా' సంఘంలో ర‌చ్చ‌: పరువు తీస్తున్న నటీనటుల ప్రవర్తన!

ఇటీవల అన్సిబా హసన్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడైన నటుడు టినీ టామ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.

Update: 2026-05-27 05:16 GMT

మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (ఎఎంఎంఏ - అమ్మా) ప్రస్తుతం తీవ్ర వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఒకప్పుడు క్రమశిక్షణకు, గౌరవానికి మారుపేరుగా నిలిచిన ఈ ప్రతిష్టాత్మక అసోసియేషన్ ఇప్పుడు నటీనటుల అంతర్గత కలహాలు, ఆరోపణలతో వీధిన పడింది. `దృశ్యం` ఫేమ్ అన్సిబా హసన్ `అమ్మా` జాయింట్ సెక్రటరీ పదవికి రాజీనామా చేయడంతో మొదలైన ఈ వివాదం.. రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతూ అసోసియేషన్ పరువును బజారున పడేస్తోంది. నటీనటుల మధ్య చెలరేగిన ఈ శత్రుత్వం ఇప్పుడు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల అన్సిబా హసన్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడైన నటుడు టినీ టామ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై లేనిపోని పుకార్లు ప్రచారం చేస్తున్నారని.. `జిహాదీ` అని త‌న‌ను పిలిచార‌ని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదం సద్దుమ‌ణగకముందే తాజాగా మరో సీనియర్ నటి నీనా కురుప్ కూడా ఈ యుద్ధంలోకి ప్రవేశించి టినీ టామ్‌పై మరింత తీవ్రమైన ఆరోపణలు చేశారు. అసోసియేషన్‌కు చెందిన `ఫ్యామిటీ మీట్‌` కార్యక్రమానికి ఒకరోజు ముందు టినీ టామ్ బహిరంగంగా తనపై దాడికి ప్రయత్నించారని.. బూతులు తిట్టారని ఆరోపించడం పరిశ్రమలో తీవ్ర కలకలం రేపింది.

నీనా కురుప్ తెలిపిన వివరాల ప్రకారం.. కమిటీ సభ్యులందరి ముందే టినీ టామ్ తనపైకి దూసుకొచ్చారని, చుట్టుపక్కల వారు జోక్యం చేసుకుని అతడిని వెనక్కి లాగడంతో ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. ఈ ఘటనా తాలూకు మానసిక క్షోభను తాను ఇప్పటికీ అనుభవిస్తున్నట్లు నీనా తెలిపారు. ఈ విషయంపై అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్వేతా మీనన్‌కు సమాచారం అందించి.. ఎగ్జిక్యూటివ్ కమిటీకి అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు నీనా వెల్లడించారు. తనపై తప్పుడు ప్రచారాలు జరుగుతుండటం వల్లే తాను నోరు విప్పాల్సి వచ్చిందని.. ఇందుకు సంబంధించిన ఆడియో రికార్డింగులు కూడా తన వద్ద ఉన్నాయని నీనా స్పష్టం చేశారు.

ఈ మొత్తం వ్యవహారంలో అసోసియేషన్‌లోని గ్రూపు రాజకీయాలు (గ్రూపిజం) స్పష్టంగా కనిపిస్తున్నాయని నీనా కురుప్ ఆరోపించారు. గతంలో `అమ్మా` సంఘంలో కేవలం సమస్యల ఆధారంగానే చర్చలు, విభేదాలు ఉండేవని.. కానీ ఇప్పుడు అవి వ్యక్తిగత కక్షలుగా మారిపోయాయని విమర్శించారు. ఒక ప‌ర్టిక్యుల‌ర్ గ్రూప్ త‌మ‌ను ఎవరైతే నిల‌దీస్తారో వారిని టార్గెట్ చేస్తుంద‌ని వివ‌రిచారు నీనా. టినీ టామ్ సాధారణంగానే మహిళలపై దూకుడుగా బెదిరించే ధోరణితో ప్రవర్తిస్తారని.. ముఖానికి దగ్గరగా వచ్చి గట్టిగా అరుస్తూ భయపెట్టే ప్రయత్నం చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ వివాదాలన్నీ సంఘం ప‌రువు తీస్తున్నా మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి చిత్ర పరిశ్రమలోని పెద్దలు దీనిని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించకపోవడం గమనార్హం. ఇదే విషయమై నీనా కురుప్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఒకవేళ ఇలాంటి దుష్ప్రవర్తన శ్వేతా మీనన్, మోహన్‌లాల్ లేదా మమ్ముట్టి వంటి సీనియర్ల కు ఎదురై ఉంటే అసోసియేషన్ ఇంత నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించేదా? అని ప్రశ్నించారు. చిన్న తప్పులను పదే పదే విస్మరించడం వల్లే ఇవి పెద్ద సమస్యలుగా మారుతున్నాయని.. కమిటీలో మహిళల గొంతు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ అంతర్గత యుద్ధం `అమ్మా` సంఘం ప్రతిష్టను పూర్తిగా దిగజారుస్తోంది.

Tags:    

Similar News