మెగాస్టార్ (X) అభి: తండ్రి కొడుకు ఆ విషయంలో పోలికే లేదు!
అమితాబ్, జయాబచ్చన్ ఇప్పటికీ నటులుగా కొనసాగుతున్నారు. పరిశ్రమలో గొప్ప గౌరవం అందుకుంటున్నారు.;
అవును.. తండ్రి ఒక దారిలో కొడుకు ఒక దారిలో వెళ్లారు. ఆ ఇద్దరూ పెళ్లి విషయంలో తీసుకున్న నిర్ణయాలు విభిన్నమైనవి. వివాహ సమయాలు, సంస్కృతి సాంప్రదాయాలు, కెరీర్ ప్రయాణం, స్టార్ డమ్ .. ఇలా చాలా విషయాలు ఆ ఇద్దరి నిర్ణయాలను ప్రభావితం చేసాయి. ముఖ్యంగా భార్య ఎంపిక, తనపై కండిషన్స్ విషయంలో ఆ ఇద్దరికీ అసలు పోలిక అన్నదే లేదు. కాలంతో పాటే చాలా డిసైడ్ అయ్యాయని అంగీకరించాలి. ఇదంతా ఎవరి గురించి అంటే? బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ .. ఆయన నటవారసుడు అభిషేక్ బచ్చన్ గురించే.
ఆ ఒక్క కండిషన్‌తో పెళ్లి:
అమితాబ్ అప్పట్లో జయాబచ్చన్ ని పెళ్లాడే ముందు ఒక కండిషన్ పెట్టారట. 3 జూన్ 1973 న ఈ జంట వివాహం జరిగింది. ఆరోజుల్లో జయాబచ్చన్ బాలీవుడ్ లో పెద్ద స్టార్. కానీ అమితాబ్ స్టార్‌గా ఎదిగే ప్రయత్నంలో ఉన్నాడు. అయినా అతడు జయాబచ్చన్ ని పెళ్లాడాలంటే ఒక కండిషన్ పెట్టాడు. ఆమె సినిమాలు వదిలేసి ఇంటిని తీర్చిదిద్దాలనేది అతడి కండిషన్. ఆ ప్రకారమే జయాబచ్చన్ తన నటనకు బ్రేక్ ఇచ్చి కుటుంబానికి అంకితమయ్యారు. ముఖ్యంగా కుమార్తె శ్వేతాబచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్ జన్మించాక పూర్తిగా పిల్లల కోసం సమయం కేటాయించారు జయాజీ. ఐదు దశాబ్ధాల అన్యోన్య దాంపత్యం ఆ ఇద్దరిదీ. అయితే రేఖతో అమితాబ్ అనుబంధం విషయంలో జయాబచ్చన్ చాలా ఘర్షణ పడ్డారు. చివరికి సెట్ రైట్ అయ్యారు. జంజీర్ లో అమితాబ్- జయా కలిసి నటించారు. సినిమా హిట్టయితే లండన్ విహారయాత్రకు వెళ్లాలనుకున్నారు. ఆశించినట్టే ఆ సినిమా ఘనవిజయం సాధించింది. యాత్రను కూడా ఆస్వాధించారు. పిల్లల్ని పెంచి పెద్దవాళ్లను చేయడంలో జయాబచ్చన్ పాత్ర అత్యంత కీలకమైనది. బిగ్ బి ఎంత బిజీగా ఉన్నా, పిల్లలకు సమయం కేటాయించేవారు.
ఈ వయసులోను 'స్కై' ఈజ్ లిమిట్
అమితాబ్, జయాబచ్చన్ ఇప్పటికీ నటులుగా కొనసాగుతున్నారు. పరిశ్రమలో గొప్ప గౌరవం అందుకుంటున్నారు. జయాబచ్చన్ ఇటీవల సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. అమితాబ్ ఎనిమిది పదుల వయసు దాటాక కూడా నార్త్, సౌత్ అనే తేడా లేకుండా స్టార్ గా ఏల్తున్నారు. ఆయన సినిమాలు బంపర్ హిట్లు కొడుతున్నాయి. బుల్లితెరపైనా హోస్ట్ గా అతడు అసాధారణ సంపాదనాపరుడిగా కొనసాగుతుండడం ఆశ్చర్యపరుస్తోంది.
తండ్రితో పోలికే లేదు:
ఇక అమితాబ్ (83) తో పోలిస్తే అభిషేక్ బచ్చన్ సన్నివేశం వేరు. 2007లో ఐశ్వర్యారాయ్ ని పెళ్లాడేప్పటికి అభిషేక్ కెరీర్ జీరో. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ క్రేజ్ వేరు. ఐష్ అప్పటికే పెద్ద స్టార్. మణిరత్నం 'గురూ' చిత్రంలో జంటగా కలిసి నటించినప్పుడు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కానీ అభిషేక్ తన భార్యకు పెళ్లి పేరుతో ఎలాంటి కండిషన్లు పెట్టే స్థితి లేదు. పెళ్లయాక కూడా ఐష్ తన కెరీర్ ని యథాతథంగా కొనసాగించారు. పైగా తన భార్య విశ్వాసాలు, ప్రతిభను ఎప్పుడూ అభిషేక్ కొనియాడుతూనే ఉన్నారు. ఐశ్వర్యారాయ్ సలహాలు తీసుకుని తనని తాను మలుచుకున్నానని వినమ్రంగా చెబుతారు. ఇక అభిషేక్ కెరీర్ పరంగా పరిణతి సాధించడానికి చాలా సమయం పట్టింది. తండ్రితో పోలిస్తే అంత పెద్ద స్టార్ కాలేకపోయాడు. ఇక కుమార్తె ఆరాధ్య బచ్చన్ వేగంగా ఎదిగేస్తోంది. ఈ సమయంలో అభి-ఐష్ విడిపోయారనే పుకార్లు పుట్టుకురావడం నిరాశపరిచింది. కానీ అదంతా అసత్య ప్రచారం అని ఈ జంట తమ చర్యలతో నిరూపిస్తున్నారు.
నాడు-నేడు: పరిస్థితులు మారిపోయాయి
2007 నుంచి వెనక్కి వెళితే 1973 చాలా దూరంలో ఉంది. 30 సంవత్సరాల వ్యత్యాసం.. జనరేషన్ గ్యాప్ చాలా ఎక్కువ. అమితాబ్ పెళ్లినాటికి, అభిషేక్ పెళ్లి నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పటి ఆలోచనలు ఆచరణలు సంస్కృతి సాంప్రదాయాలు వేరు. ఇప్పటి ఆలోచనలు, ఆచరణలు, సంస్కృతి సాంప్రదాయాలు పూర్తిగా వేరు. నేటి జెన్ జెడ్ కి అనుగుణంగా ఎవరైనా కండిషన్స్ మార్చుకోవాల్సి ఉంది.