ఈ హీరోని ఇండస్ట్రీ నుంచి గెంటేయాలని చూస్తున్నారు!
ఇప్పుడు ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు అమాల్ మాలిక్ ఒక సంచలన వ్యాఖ్య చేసాడు.;

వర్ధమాన నటుడు, ప్రతిభావంతుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 34 వయసులో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలీవుడ్ లో అసాధారణంగా ఎదుగుతున్న ఒక ప్రతిభావంతుడి అంతర్ధానాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. బాలీవుడ్ లోని ఒక సెక్షన్ పెద్ద మనుషులు గ్రూపుగా ఏర్పడి అతడిపై కుట్రలకు పాల్పడ్డారని, అవకాశాలు రానివ్వకుండా చేసారని ప్రచారం సాగింది. హిందీ చిత్రసీమను రింగ్ మాస్టర్లు శాసిస్తుంటారు. ఔట్ సైడర్స్ ని ఇన్ సైడర్స్ కి పోటీ లేకుండా ఆపుతారనే ఒక కొత్త కోణంపై చాలా చర్చ సాగింది. సుశాంత్ సింగ్ మరణించి ఇన్నేళ్లయినా ఇప్పటికీ ఇన్ సైడర్, ఔట్ సైడర్ టాపిక్ ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రజల్లో నలుగుతూనే ఉంది.
ఇప్పుడు ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు అమాల్ మాలిక్ ఒక సంచలన వ్యాఖ్య చేసాడు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తరహాలోనే ఇతర ప్రతిభావంతులకు కూడా గ్రూప్ రాజకీయాలు, కుట్రల కారణంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తలెత్తుతుందని అతడు వ్యాఖ్యానించాడు. సుశాంత్ సింగ్ లాంటి మంచి వ్యక్తిని కోల్పోయాం. అతడిలాగానే యువహీరో కార్తీక్ ఆర్యన్ కూడా కొందరి కుట్రను ఎదుర్కొంటున్నాడు. వారంతా గ్రూపుగా ఏర్పడి అతడిని పరిశ్రమ నుంచి గెంటేయాలని ప్రయత్నిస్తున్నారు. ఏదో ఒకరోజు సుశాంత్ లానే అతడు కూడా ఏదైనా చేసుకుంటాడు! అని వ్యాఖ్యానించాడు.
కార్తీక్ తన తల్లిదండ్రుల మద్ధతుతో ఈ రంగంలో నిలదొక్కుకున్నాడు. ప్రతిభావంతుడు నవ్వుతూనే ఈ కుట్రల్ని ఎదుర్కొంటున్నాడని గాయకుడు అమాల్ మాలిక్ వ్యాఖ్యానించాడు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు అంటారు.. కాదు హత్య అని మరికొందరు అంటారు. ఏది ఏమైనా ఆ మంచి మనిషి మన మధ్య ఇప్పుడు లేడు. అలాంటి పరిస్థితి కార్తీక్ కి వస్తుందేమో! అని సంచలన వ్యాఖ్యలు చేసాడు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ని అతడి చుట్టూ ఉన్నవాళ్లే నాశనం చేసారని, అది తట్టుకోలేకపోయాడని కూడా అమాల్ మాలిక్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు కార్తీక్ పరిస్థితి కూడా అలానే ఉందని ఆందోళన చెందాడు.
అయితే కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇలాంటి సమయంలో అమాల్ మాలిక్ వ్యాఖ్యలు ఆశ్చర్యపరిచాయి. కార్తీక్ ని కొంత కాలం పాటు దూరం పెట్టిన బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ ఇప్పుడు అతడితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. కరణ్ తో కార్తీక్ వివాదాలు సమసిపోయాయి. అయితే కార్తీక్ పై కుట్రలు చేస్తున్న ఆ గ్రూప్ లో ఎవరెవరు ఉన్నారు? అన్నది అమాల్ మాలిక్ రివీల్ చేయలేదు.