యశ్‌ను తగ్గించారా?.. అసలు అరవింద్ చెప్పింది ఇదే
ఎందుకంటే అరవింద్ అక్కడ యశ్‌కు కెరీర్ లేదని చెప్ప లేదు. ‘కేజీఎఫ్’ తర్వాత అతను చేరుకున్న భారీ స్థాయిని ఉదాహరణగా తీసుకున్నారు.
2023లో ‘కోటబొమ్మాళి పీఎస్’ సినిమా ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. యశ్ తల్లి ఇటీవల చేసిన కామెంట్స్ తో ఆ విడియో మరింత వైరల్ గా మారింది. ఇంతకు అందులో అల్లు అరవింద్ ఏమన్నారు అనేది కరెక్ట్ గా అర్థం చేసుకుంటే అసలు గొడవ అనేదే లేదు. సినిమా బడ్జెట్లు, హీరోల రెమ్యునరేషన్ల గురించి అల్లు అరవింద్ మాట్లాడారు. హీరో పారితోషికం ఒక్కటే సినిమా ఖర్చును నిర్ణయించదని చెబుతూ ‘కేజీఎఫ్‌కు ముందు యశ్ ఎవరు? ఆ సినిమా అతన్ని ఎంత పెద్ద స్టార్‌ను చేసింది?’ అనే అర్థంలో ఉదాహరణ ఇచ్చారు.
సినిమా స్కేల్, మేకింగ్ కూడా హీరో రేంజ్‌ను మార్చగలవన్నదే ఆయన పాయింట్. ఇప్పుడు వైరల్ అవుతున్న క్లిప్ మాత్రం ఆ మాటల్లోని ‘కేజీఎఫ్‌కు ముందు యశ్ ఎవరు?’ అనే భాగం చుట్టూనే తిరుగుతోంది. పూర్తి సందర్భం చూస్తే అక్కడ యశ్‌పై విమర్శ కంటే, ‘కేజీఎఫ్’కు ముందు తర్వాత అతని కెరీర్ ఎంత మారిందన్న ఉదాహరణే కనిపిస్తుంది. ఒక్క శుక్రవారం ఒక నటుడి స్థాయిని మార్చేయగలదనే మాట ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉంది. యశ్ కూడా గతంలో ‘కేజీఎఫ్’ తన కెరీర్‌ను మార్చిందని అంగీకరించారు.
అయితే రీసెంట్ గా యశ్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ ఆ పాత కామెంట్స్ పై స్పందించారు. ‘కేజీఎఫ్’కు ముందే యశ్ వరుస విజయాలు ఇచ్చాడని, బస్ డ్రైవర్ కుమారుడిగా ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా పైకి వచ్చాడని చెప్పారు. దీంతో మూడేళ్ల కిందటి వీడియో మళ్లీ సోషల్ మీడియాలో పెద్ద అంశంగా మారింది. ఈ వ్యవహారంపై రామ్ గోపాల్ వర్మ కూడా ట్వీట్ చేసి, అరవింద్ చెప్పిన అసలు పాయింట్‌ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారనే భావంలో స్పందించారు.
ఒకవేళ యశ్ తల్లికి ఆ తెలుగు వీడియో పూర్తి సందర్భం తెలియకపోతే, ఆయన మేనేజర్ లేదా పీఆర్ టీమ్ అయినా ముందే వివరించి ఉండాల్సింది. ఎందుకంటే అరవింద్ అక్కడ యశ్‌కు కెరీర్ లేదని చెప్ప లేదు. ‘కేజీఎఫ్’ తర్వాత అతను చేరుకున్న భారీ స్థాయిని ఉదాహరణగా తీసుకున్నారు. భాష వల్ల మాట మరోలా అర్థమై ఉంటే, పూర్తి వీడియో చూపించి క్లారిటీ ఇవ్వడం పెద్ద పని కూడా కాదు.
ఈ వివాదంపై మరో కోణంలో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘టాక్సిక్’ ఫలితంపై విమర్శలు, బాక్సాఫీస్ ఒత్తిడి నడుస్తున్న సమయంలో దాని నుంచి డైవర్ట్ చేసేందుకు ఈ పాత కామెంట్స్ ను వాడుతున్నారా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఇక 2023లో బడ్జెట్ల గురించి జరిగిన మాటను 2026లో యశ్‌ను అవమానించిన కామెంట్ గా మార్చడం మాత్రం అసలు వీడియోతో సరిపోలడం లేదు.
అల్లు అరవింద్ పాత స్పీచులు చూసినవాళ్లకు ఆయన ఏం మాట్లాడినా కూడా ఆలోచించి మాట్లాడతారు అనే అభిప్రాయం ఉంది. ఇక్కడ కూడా యశ్ ఎదుగుదలనే ఉదాహరణగా చెప్పారు. ఇప్పుడు యశ్ పాన్ ఇండియా స్టార్ కావడంతో కుటుంబం నుంచి వచ్చే ప్రతి మాట దేశవ్యాప్తంగా వెళ్తుంది. కాబట్టి పూర్తిగా ఏదైనా విషయం గురించి తెలుసుకొని మాట్లాడితే బెటర్ అనేలా మరికొందరు కామెంట్ చేస్తున్నారు.