కొత్త నిర్మాతలకు బిగ్ సపోర్ట్.. అల్లు అరవింద్ స్ట్రాటజీ ఏంటి?
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మరోసారి తన స్ట్రాటజీస్ తో చర్చనీయాంశంగా మారారు.;
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మరోసారి తన స్ట్రాటజీస్ తో చర్చనీయాంశంగా మారారు. పరిశ్రమలో కొత్త నిర్మాతలను ప్రోత్సహించే దిశగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా సినిమా నిర్మాణంలోకి రావాలనుకునే వారికి ఆర్థిక సాయం అందిస్తూ, వారిని నిర్మాతలుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
సమాచారం ప్రకారం, అల్లు అరవింద్ చిన్న మొత్తంలో వడ్డీతో డబ్బులు అప్పుగా ఇస్తూ, ఆ ప్రాజెక్టులను తన డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ద్వారా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఆ విధానం వల్ల కొత్తగా రంగంలోకి వచ్చే వారికి పెద్ద రిస్క్ లేకుండా నిర్మాతలుగా ఎదగడానికి అవకాశం లభిస్తుంది. అదే సమయంలో ఆయనకు కూడా డిస్ట్రిబ్యూషన్ స్థాయిలో లాభాలు వచ్చేలా వ్యూహం అమలు చేస్తున్నారని వినికిడి.
ప్రత్యేకంగా ఆహా ఓటీటీతో అనుబంధం ఉన్న కొంతమందిని నిర్మాతలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని టాక్ వినిపిస్తోంది. ఆహా సంస్థకు చెందిన ఇద్దరు కీలక వ్యక్తులు కలిసి ఒక కొత్త సినిమాను నిర్మించబోతున్నారని సమాచారం. ఆ ప్రాజెక్ట్ కు కూడా అల్లు అరవింద్ ఆర్థికంగా మద్దతు ఇస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, అజిత్ ఠాకూర్- బీవీఎస్ రవి వంటి వారికి కూడా ఆయన పెట్టుబడులు అందించారని వినికిడి.
వీరిద్దరూ కలిసి నటుడు అల్లరి నరేష్ తో ఓ రీమేక్ సినిమా నిర్మించబోతున్నట్టు సమాచారం. ఇది వారి తొలి నిర్మాణ ప్రయోగంగా భావిస్తున్నారు. కొత్తగా నిర్మాతలుగా ఎదగాలని భావించే వారికి అల్లు అరవింద్ చేస్తున్న సహాయం ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే గతంలో కూడా అల్లు అరవింద్ ఇదే తరహాలో బన్నీ వాస్, ధీరజ్ మొగలినేని లాంటి వారికి ఆర్థిక సహాయం అందించి నిర్మాతలుగా నిలబెట్టారు.
అయితే ఒకప్పుడు బలంగా ఉన్న GA2 బ్యానర్ ప్రభావం ప్రస్తుతం కొంత తగ్గిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ కొత్త నిర్మాతలను ప్రోత్సహించే తన ప్రయత్నాలు మాత్రం ఆయన కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే, అల్లు అరవింద్ తీసుకుంటున్న ఆ కొత్త వ్యూహం టాలీవుడ్ లో నిర్మాతల సంఖ్య పెరగడానికి దోహదపడుతుందనే సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏదేమైనా కొత్త నిర్మాతలకు అల్లు అరవింద్ అవకాశాలు కల్పించడం ద్వారా సినిమా రంగంలో పోటీ పెరిగే అవకాశం ఉందని కొందరు భావిస్తుంటే, మరికొందరు ఇది పరిశ్రమకు కొత్త ఊపు తీసుకురావచ్చని అంటున్నారు. చిన్న బడ్జెట్ సినిమాలకు ఇది మంచి అవకాశం కల్పిస్తుందనే అభిప్రాయం కూడా ఉంది. ఇక అల్లు అర్జున్ స్ట్రాటజీ ఎంతవరకు విజయవంతమవుతుందో, కొత్త నిర్మాతలు ఎంతవరకు స్థిరపడతారో వేచి చూడాలి.