లేడీ నిర్మాత కోసం ఉచితంగా సినిమా చేసిన హీరో!

ఖిలాడీ అక్షయ్ కుమార్ వృత్తిపరమైన నిజాయితీతో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. `భూత్ బంగ్లా` చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నిర్మాత ఏక్తా కపూర్ అక్షయ్ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.;

Update: 2026-04-07 03:30 GMT

ఖిలాడీ అక్షయ్ కుమార్ వృత్తిపరమైన నిజాయితీతో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. `భూత్ బంగ్లా` చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నిర్మాత ఏక్తా కపూర్ అక్షయ్ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. గతంలో ఇద్ద‌రు కలిసి చేసిన ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో అక్షయ్ స్వయంగా తనకు ఫోన్ చేసి రెమ్యూనరేషన్ చెక్కును వెనక్కి ఇచ్చేశారని తెలిపి ఆశ్చర్యానికి గురిచేసారు తన 31 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఇలాంటి సంఘటనను ఎప్పుడూ చూడలేదని ఏక్తా కపూర్ భావోద్వేగానికి లోనయ్యారు.

`సినిమా ఫ్లాప్ అయిందని తెలిసిన వెంటనే అక్షయ్ సార్ నాకు కాల్ చేశారు. ఈ సినిమాలో మీరు డబ్బులు నష్టపోయారు. అందుకే ఈ చెక్కును తిరిగి తీసుకోండి` అని ఆయన చాలా క్యాజువల్‌గా చెప్పడం నన్ను షాక్‌కు గురిచేసిందన్నారు. సాధారణంగా హీరోలు సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తమ రెమ్యూనరేషన్ తీసుకుంటారు. కానీ అక్షయ్ చూపిన ఈ ఉదారత అరుదైనదని కొనియాడారు. ఏక్తా కపూర్ ఆ చెక్కును తీసుకోవడానికి నిరాకరించినప్పటికీ అక్షయ్ పట్టుబట్టడంతో ఆమె ఒక కండిషన్ పెట్టారట.

`దయచేసి ఈ డబ్బులు వద్దు. దీనికి బదులుగా నాతో మరో సినిమా చేయండి. ఆ సినిమాతో నేను అంతకంటే ఎక్కువే సంపాదిస్తాను` అని ఆమె అడిగారట. అలా ఏక్తా కపూర్ కోరిక మేరకే `భూత్ బంగ్లా` ప్రాజెక్ట్ పట్టాలెక్కిందని ఆమె వెల్లడించారు. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో 2013లో `వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై దొబారా` చిత్రం తెర‌కెక్కింది.

అక్షయ్ కుమార్ కేవలం ఒక స్టార్ హీరో మాత్రమే కాదు. నిర్మాతలకు అండగా ఉండే వ్యక్తి అని ఈ సంఘటనతో మరోసారి ప్రూవ్ అయింది. నిర్మాత నష్టాల్లో ఉన్నప్పుడు తన వంతు బాధ్యతగా రెమ్యూనరేషన్ వదులుకోవడం అనేది ఆయన క్రమశిక్షణకు, వృత్తి పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనం. బాలీవుడ్‌లో ఇలాంటి నైతిక విలువలు కలిగిన నటులు చాలా అరుదుగా ఉంటారని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

`భూత్ బంగ్లా` విషయానికి వస్తే చాలా కాలం తర్వాత అక్షయ్ కుమార్ - లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన `హేరా ఫేరి`, `భూల్ భూలయ్యా` వంటి చిత్రాలు క్లాసిక్ కామెడీలుగా నిలిచాయి. తాజాగా మళ్లీ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్ వంటి హేమాహేమీలు కూడా నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదల కానుంది.

Tags:    

Similar News