జాలీ LLB 3 ట్రైలర్: హాస్యం సంఘర్షణ ఎప్పటికీ యూనివర్శల్
జాలీ మిశ్రా వర్సెస్ జాలీ త్యాగి కోర్టు గదిలో ఒకరితో ఒకరు ఢీకొడితే ఎలా ఉంటుందో తెలుసా? తెలుసుకోవాలనుకుంటే ఈ ట్రైలర్ చూడాల్సిందే.;
జాలీ మిశ్రా వర్సెస్ జాలీ త్యాగి కోర్టు గదిలో ఒకరితో ఒకరు ఢీకొడితే ఎలా ఉంటుందో తెలుసా? తెలుసుకోవాలనుకుంటే ఈ ట్రైలర్ చూడాల్సిందే. బాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ ఫ్రాంఛైజీ చిత్రంగా గుర్తింపు పొందిన జాలీ LLB ఫ్రాంచైజ్ నుంచి మూడవ భాగం జాలీ LLB 3 విడుదలకు సిద్ధమవుతోంది.
జాలీ మిశ్రా వర్సెస్ జాలీ త్యాగి:
ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ జాలీ మిశ్రాగా కనిపించనుండగా, అర్షద్ వార్సీ జాలీ త్యాగి పాత్రలో కనిపిస్తారు. ఇద్దరు జాలీల మధ్య బిగ్ ఫైట్ హాస్యం, సంఘర్షణలతో కోర్ట్ రూమ్ డ్రామా ఆద్యంతం రక్తి కట్టిస్తోంది. ట్రైలర్ ఆద్యంతం లాయర్లు అక్షయ్ వర్సెస్ అర్షద్ వార్షీ ఫైట్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ గా మారనుందని స్పష్ఠతనిచ్చింది. ఆ ఇద్దరి మధ్యా వాద ప్రతివాదనల కారణంగా గందరగోళంలో పడే జడ్జి త్రిపాఠి పాత్ర ఆసక్తిని కలిగిస్తోంది. ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తే ఎన్నో సన్నివేశాలతో జాలీ ఎల్ ఎల్ బి 3 ఆద్యంతం రక్తి కట్టించబోతోందని ట్రైలర్ చెబుతోంది. ఈ చిత్రంలో అమృతారావు, హ్యూమా ఖురేషి పాత్రలు కూడా ప్రత్యేక ఆకర్షణగా కనిపించనున్నాయి.
సామాజిక సమస్య హైలైట్:
జాలీ ఎల్.ఎల్.బి ఫ్రాంచైజ్ ఎప్పుడూ బలమైన సామాజిక సమస్యతో హాస్యాన్ని మిళితం చేసి కథను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే తీరు ఆసక్తిని కలిగిస్తుంది. వినోదంతో పాటు సామాజిక సమస్య గురించి వర్ణించడం ఈ ఫ్రాంఛైజీ ఉద్ధేశం. పార్ట్ 3లోను దీనిని కాపాడుతామని టీమ్ చెబుతోంది. ప్రతిభావంతుడైన సుభాష్ కపూర్ దర్శకత్వంలో స్టార్ స్టూడియో18 ఈ చిత్రాన్ని నిర్మించింది. 19 సెప్టెంబర్ 2025న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.
పరిమిత బడ్జెట్లతో...
కోర్ట్ రూమ్ డ్రామాలు ఎప్పుడూ పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కించి, అసాధారణ ఫలితాలను అందుకోవడానికి మంచి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. జాలీ ఎల్.ఎల్.బి 2013లో వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఆ తర్వాత పార్ట్ 2ని కూడా ఎంతో ప్రణాళికాబద్ధంగా రూపొందించారు. ముఖ్యంగా అదుపు తప్పని బడ్జెట్లు ఈ ఫ్రాంఛైజీకి ప్రధానంగా ప్లస్. ఇప్పుడు మరోసారి అక్షయ్ కుమార్ లాంటి పెద్ద స్టార్ తో తీసినా కానీ పరిమిత బడ్జెట్లో గొప్ప వినోదాన్ని అందించే ప్రయత్నమిదని తెలుస్తోంది. పార్ట్ 3 హిట్టయితే మునుముందు ఇది కొనసాగేందుకు ఆస్కారం ఉంది. హాస్యం సంఘర్షణ, భావోద్వేగపు డెప్త్ ఎప్పటికీ యూనివర్శల్ అని జాలీ ఎల్.ఎల్.బి పార్ట్ 3 నిరూపిస్తుందేమో!