స్టార్ హీరోతో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల అగ్లీ ఫైట్

దురంధ‌ర్ చిత్రంలో పాకిస్తాన్ - లియ‌రీ గ్యాంగ్ స్ట‌ర్ రెహ్మాన్ డెకైథ్ పాత్ర‌లో న‌టించాడు అక్ష‌య్ ఖ‌న్నా. అత‌డి న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.;

Update: 2025-12-29 18:54 GMT

దురంధ‌ర్ చిత్రంలో పాకిస్తాన్ - లియ‌రీ గ్యాంగ్ స్ట‌ర్ రెహ్మాన్ డెకైథ్ పాత్ర‌లో న‌టించాడు అక్ష‌య్ ఖ‌న్నా. అత‌డి న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. దురంధ‌ర్ చిత్రానికి ర‌ణ్ వీర్ సింగ్ హీరో అయినా కానీ, రెహ్మాన్ డెకైథ్ పాత్ర‌ను మ‌లిచిన తీరుకు అందరూ ప్ర‌శంస‌లు కురిపించారు. అక్ష‌య్ ఖ‌న్నా చాలా కాలం త‌ర్వాత త‌న‌లోని సిస‌లైన న‌టుడిని బ‌య‌ట‌కు తీసాడు. ఈ సినిమాలో అత‌డు పూర్తిగా విగ్గుతో క‌నిపించాడు. అత‌డి బాల్డ్ హెడ్ ని దాచేసిన సంగ‌తి తెలిసిందే.

ర‌ణ్ వీర్ సింగ్, అక్ష‌య్ ఖ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన దురంధ‌ర్ రికార్డుల‌ను వేటాడుతోంది. ఆదిత్యా ధ‌ర్ తెర‌కెక్కించిన‌ ఈ సినిమా ఇప్ప‌టికే 1000 కోట్ల గ్రాస్ క్ల‌బ్‌లో ప్ర‌వేశించింది. భార‌త‌దేశంలో 600 కోట్లు పైగా వ‌సూలు చేసింది. విడుద‌లైన నాలుగో వారంలోను రోజుకు 20 కోట్లు చొప్పున వ‌సూలు చేస్తూ చాలా సినిమాల రికార్డుల‌ను తిర‌గ‌రాసే దిశ‌గా వెళుతోంది.

అయితే ఈ సినిమా విజ‌యం త‌ర్వాత అక్ష‌య్ ఖ‌న్నా తీసుకున్న ఒక నిర్ణ‌యం తీవ్ర వివాదాస్ప‌దం అయింది. అక్ష‌య్ అప్ప‌టికే దృశ్యం 3లో న‌టించేందుకు నిర్మాత‌ల‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అజ‌య్ దేవ‌గ‌న్ తో పాటు ఈ చిత్రంలో అత‌డు న‌టించాల్సి ఉండ‌గా, ఇప్పుడు మ‌న‌సు మార్చుకున్నాడు. ఆ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగాడు. అయితే `దృశ్యం 3` దర్శకుడు అభిషేక్ పాఠక్, అక్షయ్ ఖన్నా సినిమా నుండి ఆకస్మికంగా వైదొలగడంపై స్పందించారు. ఇంతకుముందు నిర్మాత కుమార్ మంగత్ పాఠక్ ఖ‌న్నా ప్రవర్తనను తప్పుబట్టి, సినిమా నుండి వైదొలగినందుకు అతడిని విమర్శించారు. ఇప్పుడు ద‌ర్శ‌కుడు అభిషేక్ కూడా దానిని త‌ప్పు ప‌ట్టాడు.

అయితే అక్ష‌య్ ఖ‌న్నా స్థానంలో ప్ర‌ముఖ న‌టుడు జైదీప్ అహ్లావ‌త్ వ‌చ్చి న‌టిస్తాడ‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ దీనిని ద‌ర్శ‌కుడు క‌న్ఫామ్ చేయ‌లేదు. దానికి బ‌దులుగా నేను ఒక కొత్త పాత్రను రాస్తున్నాను అని తెలిపాడు. ఆయన (అజయ్ దేవగన్) ఆ బాధ్యతను పూర్తిగా నాకే వదిలేశారు. ఇది నిర్మాత‌ల‌కు సంబంధించిన మ్యాట‌ర్. న‌వంబ‌ర్ లో కాంట్రాక్ట్ పై సంత‌కం చేసిన త‌ర్వాత ప‌రిస్థితులు మారిపోయాయి. సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ఐదు రోజుల ముందు అతను మూవీ నుంచి తప్పుకున్నాడు. లుక్ ఖరారైంది.. కాస్ట్యూమ్స్ తయారు చేస్తున్నారు.. కథ విన్నాడు.. అత‌డికి కథ చాలా నచ్చింది! అని తెలిపారు.

అయితే త‌న పాత్ర కోసం అక్షయ్ విగ్ ధరించాలనుకుంటున్నాడని, అయితే ద‌ర్శ‌క‌నిర్మాతలు అతడి డిమాండ్‌కు అంగీకరించలేదని వార్తలు వచ్చాయి. దీనిపై అభిషేక్ ఇంకా ఇలా అన్నాడు. ఈ సినిమా ఎక్కడ ముగిసిందో అక్కడి నుండే ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం కోర్టులో అతడిని గుండుతో చూపించి, సాయంత్రానికి జుట్టుతో తిరిగి రావడం ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యమవుతుంది? ఈ విషయాన్నే నేను అతనికి వివరించి ఒప్పించాను. అని తెలిపారు.

Tags:    

Similar News