తండ్రి లక్ష ఇస్తే.. కొడుకు 2 కోట్లు..
నాగార్జున తన తండ్రి సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇప్పటికీ వరుస సినిమాలు ప్రకటిస్తూ బిజీగా మారిపోయారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఈవెంట్లో పాల్గొన్న ఈయన ఏకంగా రెండు కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చి, అందరిని ఆశ్చర్యపరిచారు.;
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర కుటుంబాలలో ఒకటిగా పేరు సొంతం చేసుకుంది అక్కినేని కుటుంబం. తెలుగు సినీ ఇండస్ట్రీకి మూల స్తంభంగా నిలిచిన ఏఎన్ఆర్.. ఎన్టీఆర్ కంటే ముందే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. తన అద్భుతమైన నటనతో ఎంతోమంది హృదయాలను దోచుకున్నారు. ముఖ్యంగా అమ్మాయిల కలల రాకుమారుడుగా ఆ కాలంలోనే పేరు దక్కించుకున్న ఈయన..తన లెగసీని కొనసాగించడానికి తన వారసులు నాగార్జునను ఇండస్ట్రీలోకి దింపిన విషయం తెలిసిందే.
నాగార్జున తన తండ్రి సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇప్పటికీ వరుస సినిమాలు ప్రకటిస్తూ బిజీగా మారిపోయారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఈవెంట్లో పాల్గొన్న ఈయన ఏకంగా రెండు కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చి, అందరిని ఆశ్చర్యపరిచారు. అప్పట్లో తన తండ్రి లక్ష రూపాయలు ఇచ్చి గొప్ప మనసు చాటుకుంటే.. ఇప్పట్లో కొడుకు ఏకంగా 2 కోట్లు ఇచ్చి తండ్రిలాగే తన గొప్ప మనసును చాటుకున్నారు.
తాజాగా కృష్ణాజిల్లా గుడివాడలో ఏఎన్నార్ కాలేజ్ వజ్రోత్సవ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజాతో కలిసి నాగార్జున పాల్గొన్నారు. కాలేజ్ లో రూసా భవనాన్ని కూడా నాగార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. "1959లో ఈ కళాశాలకు ఏఎన్ఆర్ లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు. ముఖ్యంగా విద్యార్థుల స్కాలర్షిప్ కోసం ఇప్పుడు మా కుటుంబం తరఫున రెండు కోట్ల రూపాయలు విరాళం ఇస్తున్నాను"అంటూ నాగార్జున తెలిపారు.
అదే విధంగా తన తండ్రి గురించి మాట్లాడుతూ.. "మా నాన్న ఒక రైతుబిడ్డ. ఆయనకు చదువంటే చాలా ఇష్టం. అప్పట్లో సినిమాకు కేవలం 5000 రెమ్యూనరేషన్ ఇస్తే.. 1959లో కళాశాలకు ఏకంగా లక్ష రూపాయలు విరాళం ఇచ్చి చదువు పట్ల ఆయనకున్న విజ్ఞతను చాటుకున్నారు. ఈ కాలేజీలో చదివిన ఎంతో మంది విద్యార్థులు నేడు దేశ , విదేశాలలో ఉన్నత స్థానాలలో నిలిచారు".. అంటూ ఏఎన్ఆర్ కాలేజీకి తమ కుటుంబం ఇచ్చిన విరాళాల గురించి నాగార్జున తెలిపారు. అప్పట్లోనే లక్ష రూపాయలు ఇచ్చి ఏఎన్ఆర్ మంచి మనసు చాటుకోగా.. ఇప్పుడు తండ్రికి తగ్గట్టుగానే నాగార్జున కూడా ఇప్పటి జనరేషన్ ను బట్టి రెండు కోట్ల రూపాయలను ప్రకటించారు.
నాగార్జున విషయానికి వస్తే.. ప్రముఖ స్టార్ హీరోగా చలామణి అవుతున్న ఈయన వరుస సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. మరొకవైపు తన వందవ సినిమా కోసం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఎలాగైనా వంద కోట్ల క్లబ్లో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళ డైరెక్టర్ రా.కార్తీక్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో టబు , అనుష్క శెట్టితో పాటు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.. మరి భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది