అప్పుడు 'అఆ'.. ఇప్పుడు 'లెనిన్'..
టాలీవుడ్ లో సక్సెస్ మీట్స్ చాలా జరుగుతుంటాయి. కానీ కొన్ని ఈవెంట్స్ మాత్రం ప్రత్యేకంగా నిలుస్తాయి.
టాలీవుడ్ లో సక్సెస్ మీట్స్ చాలా జరుగుతుంటాయి. కానీ కొన్ని ఈవెంట్స్ మాత్రం ప్రత్యేకంగా నిలుస్తాయి. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ సినిమా సక్సెస్ మీట్ లో నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పదేళ్ల క్రితం అఆ సినిమా సక్సెస్ మీట్ కోసం గుంటూరుకు వచ్చిన తాను, ఇప్పుడు లెనిన్ సక్సెస్ మీట్ ను అక్కడే జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.
"గుంటూరులో సక్సెస్ మీట్ చేసుకుని దాదాపు 10 ఇయర్స్ అవుతోంది. చివరిసారిగా ‘అఆ’ సినిమా కోసం వచ్చాను. అప్పట్లో ఇండస్ట్రీలో నా ప్రయాణం ప్రారంభ దశలో ఉండేది. ఇప్పుడు లెనిన్ తో మళ్లీ గుంటూరులో విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే అవకాశం వచ్చింది" అని అన్నారు. విడుదలకు ముందు విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో ప్రమోషన్స్ నిర్వహించిన మూవీ టీమ్, విడుదల తర్వాత హైదరాబాద్ లో సక్సెస్ మీట్ చేసింది. అయితే గుంటూరులో కూడా సక్సెస్ మీట్ జరపాలని డిసైడ్ అయినట్లు తెలిపారు.
నిజానికి అఆ సినిమా అప్పట్లో నితిన్ కెరీర్ ను కొత్త రేంజ్ కు తీసుకెళ్లింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీ కుటుంబ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని భారీ వసూళ్లు సాధించింది. నితిన్ కెరీర్ లో అతిపెద్ద హిట్స్ లో ఒకటిగా నిలిచిన ఆ సినిమా, నిర్మాతలకు మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్లు కూడా మంచి లాభాలు అందించింది. ఆ సక్సెస్ ను గుర్తుచేసుకుంటూ నాగవంశీ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు లెనిన్ జర్నీతో కంపేర్ చేస్తున్నారు ఆడియన్స్.
అఖిల్ విషయానికి వస్తే, లెనిన్ ఆయన కెరీర్‌లో కీలక మలుపుగా మారినట్లు కనిపిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.67 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం ప్రకటించింది. అంతేకాదు, అఖిల్ కెరీర్ లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా కూడా నిలిచిందని చెబుతున్నారు. ఇప్పుడు సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్ కూడా ఉంది. జూలై చివరి వారానికి వరకు పెద్ద సినిమాల విడుదలలు లేకపోవడం వల్ల లెనిన్ కు థియేటర్లలో మంచి అవకాశం లభిస్తోంది.
ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ కొనసాగితే రెండో వారంలో కూడా వసూళ్ల జోరు తగ్గే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగవంశీ చేసిన అఖిల్ కు తొలి రూ.100 కోట్ల సినిమా ఇవ్వాలనే వ్యాఖ్యలకు మరింత ఇంపార్టెన్స్ ఏర్పడింది. రెండో వారం అదే జోష్ కొనసాగిస్తే అఖిల్ కెరీర్ లో తొలి రూ.100 కోట్ల గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని సినీ ప్రియులు అంచనా వేస్తున్నారు.
పదేళ్ల క్రితం అఆ మూవీ సక్సెస్ ఒక హీరో కెరీర్ లో మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు లెనిన్ సక్సెస్ కూడా అఖిల్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచినట్లే. ముఖ్యంగా అఖిల్ కు లెనిన్ కేవలం హిట్ సినిమా మాత్రమే కాకుండా, స్టార్ హీరోగా కొత్త ఛాప్టర్ ను స్టార్ట్ చేయొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఫుల్ రన్ లో లెనిన్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతటి వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.