డైరెక్టర్ ఎక్స్‌పీరియెన్స్ కాదు.. ఆ ఒక్క విషయమే చూశా!

మీ కంబ్యాక్ సినిమాకు ఒక్క సినిమా మాత్రమే చేసిన నందుని డైరెక్ట‌ర్ గా సెలెక్ట్ చేసుకున్నార‌నే ప్రశ్నకు అఖిల్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది.

Update: 2026-07-08 14:06 GMT

అఖిల్ అక్కినేని హీరోగా మురళీ కిషోర్ అబ్బూరు(నందు) దర్శకత్వంలో తెరకెక్కిన లెనిన్ జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కెరీర్‌లో తొలి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌కు ఈ సినిమా అత్యంత కీలకంగా మారింది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మంచి అంచనాలు తీసుకొచ్చాయి. తాజాగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో అఖిల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

మీ కంబ్యాక్ సినిమాకు ఒక్క సినిమా మాత్రమే చేసిన నందుని డైరెక్ట‌ర్ గా సెలెక్ట్ చేసుకున్నార‌నే ప్రశ్నకు అఖిల్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. డైరెక్ట‌ర్ కు ఎంత ఎక్స్‌పీరియెన్స్ ఉంద‌న్న‌ది తానెప్పుడూ చూడ‌లేద‌ని, తనను కదిలించే కథ ఉంటే చాలని ఆయన చెప్పారు. లెనిన్ కథ విన్నప్పుడు కంటెంట్, క‌థ త‌న‌తో మాట్లాడాయ‌ని, ఆ క‌థ త‌న‌ను పూర్తిగా ఆక‌ట్టుకుంద‌ని, దానికి తాను పూర్తిగా అడిక్ట్ అయిపోయాన‌ని, అందుకే ఈ ప్రాజెక్ట్‌ను వెంటనే ఓకే చేశానని అఖిల్ వెల్లడించారు.

అంతేకాదు, డైరెక్ట‌ర్ కొత్తవాడా, అనుభవం ఉందా అనే ఆలోచన కూడా తాను చేయలేదని అఖిల్ ఈ సంద‌ర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఒక సినిమా చేసిన ఆయ‌న్ని కొత్త డైరెక్ట‌ర్ అని ఎలా అనుకుంటున్నారో, ఈ సినిమాలో తాను కూడా ఒక న్యూ క‌మ‌ర్ లానే క‌నిపిస్తాన‌ని, పూర్తిగా కొత్త థృక్ప‌ధంతో ఈ సినిమా చేశాన‌ని అఖిల్ చెప్పారు. ఈ కామెంట్స్ అఖిల్ లో వచ్చిన ఆలోచనా విధానంలోని మార్పును కూడా ప్రతిబింబిస్తున్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఇదే ప్రెస్ మీట్‌లో గత మూడేళ్లలో తనలో చాలా మార్పు వచ్చిందని కూడా అఖిల్ వెల్లడించారు. ఒకప్పుడు ఎక్కువగా మాట్లాడేవాడినని, కానీ ఇప్పుడు తన మాటల కంటే తన సినిమా, తన పని మాట్లాడితేనే బాగుంటుందని అర్థమైందన్నారు. అందుకే ప్రస్తుతం చాలా ప్రశాంతంగా ఉంటున్నానని తెలిపారు అఖిల్.

అఖిల్ మాట‌ల‌ను బట్టి చూస్తే, ఈసారి ఆయన కేవలం మరో సినిమా రిలీజ్ కోసం కాకుండా, తనను తాను కొత్తగా ప్రూవ్ చేసుకోవాల‌నే టార్గెట్ తో లెనిన్ ను చేసినట్లు స్పష్టమవుతోంది. డైరెక్ట‌ర్ పై ఉంచిన నమ్మకం, కథపై ఉన్న విశ్వాసం, తనను తాను కూడా కొత్త నటుడిలా మలుచుకున్నానన్న కాన్ఫిడెన్స్ ప్రస్తుతం లెనిన్ మూవీపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. కెరీర్‌లో ఇప్పటివరకు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన అఖిల్‌కు లెనిన్ నిజంగా టర్నింగ్ పాయింట్ అవుతుందా? అనేది తెలియాలంటే జులై 10 వ‌ర‌కు ఆగాల్సిందే.



Tags:    

Similar News