టికెట్ రేట్లు పెంచుతాం కానీ.. 'అఖండ 2' నిర్మాత క్లారిటీ!
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ అనగానే అంచనాలు ఊహకందని రేంజ్ లో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.;
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ అనగానే అంచనాలు ఊహకందని రేంజ్ లో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు 'అఖండ 2: తాండవం' సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది. డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా గురించి ఏ చిన్న వార్త వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట ఒక ఇంటర్వ్యూలో ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల పెంపు గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
సాధారణంగా పెద్ద సినిమా అంటే రేట్ల పెంపు కామన్. ప్రభుత్వ అనుమతితో టికెట్ ధరలు పెంచడం నిర్మాతల హక్కు. దీనిపై నిర్మాతలు మాట్లాడుతూ.. "సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టాం, బడ్జెట్ పరంగా ఎక్కడా రాజీ పడలేదు. దానికి తగ్గట్టే మార్కెట్ కూడా బాగుంది. కాబట్టి కచ్చితంగా రేట్ల పెంపు ఉంటుంది. అయితే అది జనాలను ఇబ్బంది పెట్టేలా ఉండదు" అని క్లారిటీ ఇచ్చారు.
"రేట్లు పెంచుతాం కానీ, అది రీజనబుల్ గానే ఉంటుంది. ప్రేక్షకులు తిట్టుకునేలా అయితే ఉండదు" అని గోపి ఆచంట స్పష్టం చేశారు. ఇటీవల కల్కి, పుష్ప సినిమాలకు టికెట్ రేట్లు భారీగా పెంచడం, దానిపై సోషల్ మీడియాలో విమర్శలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖండ 2 నిర్మాతలు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. జనం భయపడి థియేటర్ కు రాకుండా ఉండే పరిస్థితి రాకూడదని వారు భావిస్తున్నారు.
ఇక ప్రీమియర్ షోల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం. అయితే ఫ్యాన్స్ ఎంత ముఖ్యమో, న్యూట్రల్ ఆడియన్స్ కూడా అంతే ముఖ్యం. సాయంత్రానికి వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్, జనరల్ పబ్లిక్ టాక్ సినిమాకు చాలా కీలకం" అని చెప్పారు. ఫ్యాన్స్ ఎలాగూ సాటిస్ఫై అవుతారు, కానీ సినిమా లాంగ్ రన్ కు సామాన్య ప్రేక్షకుల ఆదరణే ముఖ్యమని వారు అభిప్రాయపడ్డారు.
టికెట్ రేట్ల పెంపు అనేది కేవలం నిర్మాతల చేతిలోనే ఉండదని, డిస్ట్రిబ్యూటర్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గ్రౌండ్ లెవల్ లో పరిస్థితి వారికి బాగా తెలుస్తుంది కాబట్టి, అందరికీ ఆమోదయోగ్యమైన ధరనే నిర్ణయిస్తామని హామీ ఇచ్చారు. మొదటి రోజు ప్రీమియర్స్, ఫ్యాన్స్ షోలతో రికవరీ అయిపోతుందనే అపోహలో తాము లేమని, లాంగ్ రన్, పాజిటివ్ టాక్ మాత్రమే సినిమా విజయాన్ని డిసైడ్ చేస్తాయని అన్నారు.
'అఖండ 2' నిర్మాతలు చాలా బ్యాలెన్స్డ్ గా వ్యవహరిస్తున్నారు. భారీ హైప్ ఉన్నా, ఆడియన్స్ ను ఇబ్బంది పెట్టకూడదనే వారి ఆలోచన మంచిదే. రీజనబుల్ రేట్లతో వస్తే, సినిమాకు పాజిటివ్ టాక్ తోడైతే రికార్డులు బద్దలు కొట్టడం బాలయ్యకు కొత్తేమీ కాదు. మరి అఖండ 2 బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.