తెలంగాణలోనూ పర్మిషన్లు.. 'అఖండ 2'కి అదిరిపోయే రేట్లు!
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అనగానే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలిసిందే.;
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అనగానే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలిసిందే. 'అఖండ 2: తాండవం' రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఆ హడావిడి పీక్స్ కు చేరుకుంది. మరికొన్ని గంటల్లోనే వెండితెరపై అఖండ తాండవం స్టార్ట్ కానుంది. ఏపీలో ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా గుడ్ న్యూస్ అందింది. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమాకు తెలంగాణ సర్కార్ కీలక అనుమతులు జారీ చేసింది.
లేటెస్ట్ గా విడుదలైన జీవో ప్రకారం, తెలంగాణలోనూ టికెట్ రేట్లు పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. సింగిల్ స్క్రీన్స్ లో రూ. 50, మల్టీప్లెక్స్ లలో రూ. 100 వరకు అదనంగా పెంచుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఈ పెంచిన రేట్లు కేవలం విడుదలైన మొదటి మూడు రోజులు ఉంటాయి. అంటే డిసెంబర్ 5 నుంచి 7 వరకు మాత్రమే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
ఇక అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బెనిఫిట్ షోలకు కూడా అనుమతి లభించింది. డిసెంబర్ 4వ తేదీ రాత్రి 8 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో స్పెషల్ షో వేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ షో టికెట్ ధరను రూ. 600గా నిర్ణయించారు. అంటే రిలీజ్ కు ముందే అర్ధరాత్రి నుంచే బాలయ్య జాతర మొదలవ్వడం ఖాయం.
ఈ జీవోలో మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. పెంచిన టికెట్ రేట్ల ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతాన్ని తప్పనిసరిగా మూవీ ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (MAA) అకౌంట్ కు జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది సినీ కార్మికుల సంక్షేమానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. టికెట్ రేట్లు పెంచినా, అందులో కొంత భాగం మంచి పనికి వెళ్తుండటం అభినందనీయం. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఈ రేట్ల పెంపు పెద్ద ఊరటనిస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాల నుంచి పూర్తి మద్దతు లభించడంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆనందంలో ఉన్నారు. బోయపాటి మార్క్ మాస్, బాలయ్య ఎనర్జీ, తమన్ మ్యూజిక్.. ఈ మూడు కలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ అవుతాయో చూడాలి. మొత్తానికి అన్ని అడ్డంకులు తొలగిపోయి, పర్ఫెక్ట్ ప్లానింగ్ తో 'అఖండ 2' థియేటర్లలోకి వస్తోంది. ఫ్యాన్స్ కు పండగ వాతావరణం తీసుకురావడానికి బాలయ్య రెడీ అయ్యారు. ఇక ఓపెనింగ్ లెక్క ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.