బాలయ్య 'తాండవం'.. వారిద్దరి రెమ్యూనరేషన్ సంగతేంటి?
టాలీవుడ్ సీనియర్ హీరో, నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న అఖండ 2:;
టాలీవుడ్ సీనియర్ హీరో, నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న అఖండ 2: తాండవం మూవీ మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఆ సినిమా.. పాన్ ఇండియా రేంజ్ లో డిసెంబర్ 5వ తేదీన విడుదల కానుంది.
అయితే బాలయ్య, బోయపాటి కాంబినేషన్ రిపీట్ అవ్వడం.. ఫస్ట్ పార్ట్ అఖండ సూపర్ హిట్ అవ్వడంతో సీక్వెల్ పై అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరోసారి హిట్ కాంబో.. పెద్ద విజయం సాధిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే సమయంలో ఇప్పటికే మూవీ మంచి బిజినెస్ జరుపుకుందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
అఖండ 2: తాండవం క్యాస్టింగ్ రెమ్యూనరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సినిమాకు రూ.200 కోట్ల బడ్జెట్ అయిందని తెలుస్తుండగా.. రూ.145 కోట్ల థియేట్రికల్ బిజినెస్ కూడా జరిగినట్లు సమాచారం. అయితే ఇప్పుడు హీరో తోపాటు డైరెక్టర్ రెమ్యూనరేషన్ వివరాలు.. సినీ వర్గాలతోపాటు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
సినిమాకు గాను బాలయ్య రూ.40 కోట్ల పారితోషికం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. కొంతకాలంగా తన సినిమాలకు అంత మొత్తంలోనే అందుకుంటున్నట్లు సమాచారం. అదే సమయంలో బోయపాటి.. రూ.35 కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అంతే కాదు.. టాలీవుడ్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న మూడో డైరెక్టర్ ఆయనేనని వినికిడి.
తెలుగు బడా దర్శకులు రాజమౌళి, సుకుమార్.. అత్యధిక రెమ్యూనరేషన్లు అందుకుంటున్న దర్శకుల జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్నారని అంతా చెబుతుంటారు. ఇప్పుడు వారి తర్వాత బోయపాటి శ్రీనునేని వినికిడి. ఏదేమైనా.. అఖండ సీక్వెల్ కు గాను కథానాయకుడు, దర్శకుడు భారీ మొత్తంలోనే అందుకుంటున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా సహా పలువురు నటీనటులు కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. రామ్ ప్రసాద్, సంతోష్ డీ డీటాకే సినిమాటోగ్రాఫర్లుగా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మరి మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.