డే 1 రికార్డ్.. అఖండ 2 కొట్టగలదా?

2025 బాక్సాఫీస్ ప్రయాణం దాదాపు ఎండింగ్ కి వచ్చేసింది. ఈ ఏడాది చాలా భారీ సినిమాలు, భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చాయి.;

Update: 2025-11-08 09:43 GMT

2025 బాక్సాఫీస్ ప్రయాణం దాదాపు ఎండింగ్ కి వచ్చేసింది. ఈ ఏడాది చాలా భారీ సినిమాలు, భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చాయి. కొన్ని హిట్టయ్యాయి, కొన్ని ఫ్లాప్ అయ్యాయి. కానీ, "ఓపెనింగ్ డే మానియా" అంటే ఏంటో చూపించింది మాత్రం రెండే రెండు సినిమాలు. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర "డే 1" వంద కోట్ల క్లబ్‌లో చేరడం అనేది ఇప్పుడు కొత్త బెంచ్‌మార్క్‌గా మారింది. ఈ ఏడాది ఆ ఫీట్‌ను అందుకున్నవి రెండే సినిమాలు.

ఈ లిస్ట్‌లో మొదటిది, కోలీవుడ్ నుంచి వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ 'కూలీ'. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో విడుదలకు ముందు ఉన్న హైప్, రజనీ స్టైల్ కలిసి.. ఆ సినిమాకు మొదటి రోజు 100 కోట్లకు పైగా ఓపెనింగ్ తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత సినిమా ఫ్లాప్ అయినా, ఓపెనింగ్ మాత్రం రికార్డే. ఇక రెండోది, టాలీవుడ్ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ'. పవన్ మానియాకు, సుజీత్ స్టైలిష్ టేకింగ్ తోడవ్వడంతో 'ఓజీ' కూడా ఫస్ట్ డే 100 కోట్ల క్లబ్‌లో ఈజీగా అడుగుపెట్టింది.

ఇప్పుడు, 2025 ముగింపులో అందరి కళ్లూ ఒకే ఒక్క సినిమాపై పడ్డాయి. డిసెంబర్ 5న రాబోతున్న 'అఖండ 2'. 'అఖండ'కు సీక్వెల్, బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు హై రేంజ్ లోనే ఉన్నాయి. ప్రశ్న ఇప్పుడు సినిమా హిట్టా ఫ్లాపా అని కాదు.. 'అఖండ 2' ఈ 100 కోట్ల ఓపెనింగ్ క్లబ్‌లో మూడో సినిమాగా నిలవగలదా? అనేది అసలు పాయింట్.

'అఖండ 2'కు ఉన్న పాజిటివ్ వైబ్స్ మామూలుగా లేవు. ఇది ఒక నార్మల్ సీక్వెల్ కాదు. బాలయ్య 'అఘోరా' గెటప్‌కు ఉన్న క్రేజ్, బోయపాటి మార్క్ 'పూనకాలు' తెప్పించే ఎలివేషన్స్, దానికి తోడు థమన్ మ్యూజిక్.. ఈ కాంబోకు తిరుగులేదు. ఫస్ట్ సింగిల్ "అఖండ తాండవం" కోసం ఏకంగా శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ లాంటి ఇద్దరు లెజెండ్స్‌ను దించడం చూస్తే, థమన్ ఏ రేంజ్‌లో ప్లాన్ చేశాడో అర్థమవుతోంది.

అయితే, 100 కోట్ల ఓపెనింగ్ అనేది మాటలు కాదు. దానికి కేవలం తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు బద్దలు కొడితే సరిపోదు. పాన్ఇండియా రేంజ్‌లో, ముఖ్యంగా హిందీ, తమిళ, కన్నడ మార్కెట్లలో కూడా ఒకేసారి భారీ ఓపెనింగ్ రావాలి. 'అఖండ' మొదటి భాగం తెలుగులో ఇండస్ట్రీ హిట్ రేంజ్ ఆడినా, దాని ఫస్ట్ డే వరల్డ్‌వైడ్ కలెక్షన్ 100 కోట్లు దాటలేదు. ఇప్పుడు సీక్వెల్, మొదటి భాగం కంటే 5 రెట్లు పెద్ద ఓపెనింగ్ తెస్తేనే ఈ ఫీట్ సాధ్యమవుతుంది.

'కూలీ'కి రజనీన్ లోకేష్ కాంబో, 'ఓజీ'కి పవన్ సుజీత్ క్రేజ్ వర్కవుట్ అయ్యాయి. మరి, బాలయ్య బోయపాటి అనే బ్రాండ్.. ఆ ఇద్దరు సూపర్ స్టార్ల ఓపెనింగ్ డే రికార్డును అందుకునేంత పవర్ చూపిస్తుందా? అనేది పూర్తిగా ట్రైలర్ క్రియేట్ చేయబోయే హైప్ మీదే ఆధారపడి ఉంది. ట్రైలర్ గనుక 'అఖండ 1'కి మించి "జాతర" మోడ్‌లో ఉంటే, ఈ రికార్డును కొట్టడం అసాధ్యమేమీ కాకపోవచ్చు.

Tags:    

Similar News