'ఐ బొమ్మ' రవిని సృష్టించింది మీరే.. సీపీఐ నారాయణ

నందమూరి బాలకృష్ణ 'అఖండ 2' సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకోవడానికి, స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.;

Update: 2025-12-03 06:56 GMT

నందమూరి బాలకృష్ణ 'అఖండ 2' సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకోవడానికి, స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా 'ఐ బొమ్మ' రవి ప్రస్తావన తెచ్చి ఆయన చేసిన విశ్లేషణ అందరినీ ఆలోచింపజేసేలా ఉంది.

నారాయణ మాట్లాడుతూ.. "అఖండ 2 సినిమాకు రేట్లు పెంచడం దుర్మార్గం. ఇలా రేట్లు పెంచడం వల్లనే 'ఐ బొమ్మ' రవి లాంటి వాళ్లు పుట్టుకొస్తారు. సామాన్యుడికి సినిమాను దూరం చేస్తే, వాడు తక్కువ ఖర్చులో వచ్చే ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటాడు. ఆ మార్గమే పైరసీ. దాన్ని పెంచి పోషిస్తున్నది ప్రభుత్వమే" అని మండిపడ్డారు.

అంతేకాదు, "ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే మీరే పరోక్షంగా అలాంటి వారిని సృష్టిస్తున్నారు" అని ఆయన సంచలన ఆరోపణ చేశారు. వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసే నిర్మాతలు, ఆ భారాన్ని ప్రజల మీద మోపడం సరికాదని హితవు పలికారు. వినోదం అనేది సామాన్యుడి హక్కు అని, దాన్ని వ్యాపారంగా మార్చి దోచుకోవడం అన్యాయమని అన్నారు.

సినిమా అంటేనే సామాన్యుడికి ఉన్న అతి తక్కువ ఖర్చుతో కూడిన వినోదం. కానీ ఇప్పుడు టికెట్ రేట్లు వందల్లో ఉండటంతో, కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లాలంటే వేలల్లో ఖర్చవుతోంది. ఈ భారం భరించలేకే జనాలు పైరసీ సైట్ల వైపు మొగ్గు చూపుతున్నారని నారాయణ అభిప్రాయపడ్డారు. "ఇలాగే చేసుకుంటూ పోతే భవిష్యత్తులో ఐ బొమ్మ లాంటి వారు మరింత మంది పుట్టుకొస్తూనే ఉంటారు, దాన్ని ఎవరూ ఆపలేరు" అని హెచ్చరించారు.

ఒక పక్క ప్రభుత్వం పైరసీని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నా, మరో పక్క టికెట్ రేట్ల పెంపు ద్వారా పైరసీకి ఆజ్యం పోస్తోందని ఆయన విమర్శించారు. సంపన్న వర్గాలకు కొమ్ము కాస్తూ, పేదవాడి జేబులు కొట్టే విధానాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. కళామతల్లిని వ్యాపార వస్తువుగా మార్చవద్దని కోరారు. నారాయణ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది నెటిజన్లు ఆయన మాటలతో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు సినిమా అనేది జనాలకు నిత్యావసర వస్తువు కాదని ఒక కారు కొనాలి అంటే అక్కడ రేట్లపై ఇలానే స్పందిస్తారా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.




Tags:    

Similar News