ఆయనతో జెన్యూన్‌గా ఉంటే ఎంతో ఆప్యాయతను తిరిగిస్తారు: అజయ్ భూపతి
తెలుగు చిత్రపరిశ్రమలో క్రమశిక్షణకు, వైవిధ్యమైన నటనకు చిరునామాగా నిలిచిన సీనియర్ నటులు కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో పనిచేసే అవకాశం రావడం ఏ దర్శకుడికైనా ప్రత్యేకమైన అనుభవమే.
తెలుగు చిత్రపరిశ్రమలో క్రమశిక్షణకు, వైవిధ్యమైన నటనకు చిరునామాగా నిలిచిన సీనియర్ నటులు కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో పనిచేసే అవకాశం రావడం ఏ దర్శకుడికైనా ప్రత్యేకమైన అనుభవమే. తాజాగా ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి మోహన్ బాబుతో పనిచేసిన జ్ఞాపకాలను.. ఆయన సెట్‌లో ప్రవర్తించే విధానాన్ని ఎంతో ఆత్మీయంగా గుర్తుచేసుకున్నారు. మోహన్ బాబు లాంటి సీనియర్ నటుడితో పనిచేస్తున్నప్పుడు ఒక దర్శకుడిగా తనకు లభించిన గౌరవం.. తమ మధ్య ఏర్పడిన అనుబంధం గురించి అజయ్ భూపతి వెల్లడించిన వివరాలు సినీ వర్గాల్లో చర్చగా మారాయి.
సినిమా షూటింగ్ సమయంలో మోహన్ బాబు చూపించే క్రమశిక్షణ, నటన విషయంలో ఆయనకున్న అంకితభావం అసాధారణమైనవని అజయ్ భూపతి కొనియాడారు. ``ఎలా చేయాలి? ఎంతవరకు చేస్తే బాగుంటుంది?`` అని ఒక సీనియర్ నటుడై ఉండి కూడా ప్రతి విషయాన్ని దర్శకుడిని అడిగి తెలుసుకునేవారని తెలిపారు. సీన్లలో క్యారెక్టర్ తప్ప వేరేది కనిపించకూడదనే స్పష్టమైన విజన్‌తో తాను అడిగిన బాడీ లాంగ్వేజ్‌ను మోహన్ బాబు అద్భుతంగా పండించారని... దర్శకుడి విజన్‌కు పూర్తిగా లొంగిపోయి పనిచేయడం ఆయన గొప్పతనమని అభిప్రాయపడ్డారు.
మోహన్ బాబు వ్యక్తిత్వం గురించి వివరిస్తూ... ఆయనతో నిజాయితీగా (జెన్యూన్‌గా) ఉంటే ఎంతో ఆప్యాయతను తిరిగి ఇస్తారని అజయ్ చెప్పారు. ఒక నటుడిగా, నిర్మాతగా, విద్యాసంస్థల అధినేతగా సమాజంలో ఎంతో ఉన్నతమైన హోదా ఉన్నా.. షూటింగ్ సెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత అవన్నీ పక్కన పెట్టేస్తారని తెలిపారు. దర్శకుడు కూర్చోమంటే కూర్చోవడం.. దర్శకుడు నిలబడితే తాను కూడా నిలబడే ఉండటం లాంటి పద్ధతులు మోహన్ బాబులోని నిజమైన డిసిప్లిన్‌ను ఎత్తిచూపుతాయని... ఆయన వేరే లెవల్ నటుడని కొనియాడారు.
షూటింగ్ సమయంలో సెట్‌లో నటీనటుల మధ్య ఉండే అనుబంధం గురించి చెబుతూ అజయ్ భూపతి సరదా వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా సినిమాల్లో హీరో, హీరోయిన్ల మధ్య ఉండే కెమిస్ట్రీ కంటే కూడా తనకూ, మోహన్ బాబుకూ మధ్య ఉన్న బాండింగ్, కెమిస్ట్రీయే చాలా ఎక్కువ అని నవ్వుతూ చెప్పారు. కొన్నిరోజులు తాను ఫోన్ చేయకపోతే ఆయన చిన్నపిల్లాడిలా హర్ట్ అవుతారని... అంతటి ఆత్మీయతను కనబరచడం తన మంచి మనసుకు నిదర్శనమని పేర్కొన్నారు. సినిమా పూర్తయి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకుల మనసులో ఆ పాత్రే నిలిచిపోతుందని అన్నారు.
ఇండస్ట్రీలోని యంగ్ డైరెక్టర్లకు అజయ్ భూపతి ఒక మంచి సూచన చేశారు. చిత్ర పరిశ్రమలోని సీనియర్ నటుల సేవలను సరిగ్గా ఉపయోగించుకోవాలని.. కొత్త దర్శకులు తమ కథల్లోని శక్తివంతమైన పాత్రలతో మోహన్ బాబును ఒప్పించగలిగితే ఆయన 1000 శాతం న్యాయం చేస్తారని చెప్పారు. పాత్ర ప్రాధాన్యతను అర్థం చేసుకుని.. దాన్ని ఊహించని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లే సత్తా మోహన్ బాబుకు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని అజయ్ భూపతి స్పష్టం చేశారు. జయకృష్ణ, రాషా తడానీ జంటగా, మంచు మోహన్ బాబు కీలక పాత్రలో అజయ్ భూపతి తెరకెక్కించిన శ్రీనివాస మంగాపురం ఇటీవలే థియేటర్లలోకి విడుదలైన సంగతి తెలిసిందే.