ఎయిర్ ఇండియా ప్రమాదంపై టాలీవుడ్ ప్రముఖుల స్పందన
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారి ఆత్మకు శాంతి చేకూరాలి.;
అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్ బయలుజేరిన వెంటనే ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలడం యావత్ దేశాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్యను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. విమానంలో ఉన్న వారు మాత్రమే కాకుండా, నివాస ప్రాంతంలో విమానం కుప్పకూలడం తో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. విమాన ప్రమాదం తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు తీవ్ర ఆవేదనతో దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతి చెందిన వారికి సంతాపం తెలియజేయడంతో పాటు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. తెలుగు సినీ ప్రముఖులు పలువురు ఈ ప్రమాదంపై స్పందించారు.
సినీ నటుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ... ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దిగ్భ్రాంతికి గురి చేసింది. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు, సిబ్బంది కోసం ప్రార్థిస్తున్నాను. ఈ కష్ట సమయంలో వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. అంతే కాకుండా ప్రమాదంకు గురి అయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం అంతా బాధితులు, వారి కుటుంబాలకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేశారు.
విమాన ప్రమాదం విన్న వెంటనే తీవ్ర దిగ్బ్రాంతికి గురి అయ్యాను. బాధితులు అందరికీ ప్రార్థనలు, అందరి మద్దతు వారికి ఉండాలని కోరుకుంటున్నాను. ప్రయాణికుల, సిబ్బంది కుటుంబ సభ్యులకు అందరం అండగా ఉండాలని ఎన్టీఆర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
అహ్మదాబాద్‌లో జరిగిన దురదృష్టకర విమాన ప్రమాదం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. నా ప్రార్థనలు అందరు ప్రయాణీకులు, విమానంలోని సిబ్బంది, బాధితులు మరియు వారి కుటుంబాలతో ఉన్నాయి అంటూ రామ్ చరణ్ ఎక్స్ లో ట్వీట్ చేశారు
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. నిజంగా హృదయ విదారకం అంటూ అల్లు అర్జున్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఎయిర్ ఇండియా ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించింది. తీవ్ర దుఃఖంలో దేశం ఉన్న ఈ సమయంలో మా కన్నప్ప ట్రైలర్ విడుదలను ఒక రోజు వాయిదా వేస్తున్నాము. అలాగే రేపు జరగాల్సిన ఇండోర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నాం. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రార్థనలు అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశారు.
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. మనసుకు చాలా బాధను కలిగించింది. ఈ విషాద సమయంలో బాధితుల కుటుంబాలకు అండగా ఉండాలి. ఈ నష్టంను తట్టుకునే శక్తిని వారికి దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటూ హీరో శర్వానంద్ ట్వీట్ చేశాడు.
ఎయిర్ ఇండియా ప్రమాదం హృదయ విదారకమైనది. 242 మందితో ఉన్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంను జీర్ణించుకోలేక పోతున్నాను. ప్రతి ఒక్క ప్రాణం రక్షించబడాలని కోరుకుంటున్నాను అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశాడు.