'పెద్ది' తర్వాత నెక్స్ట్ ఏంటి?

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. పెద్ది తర్వాత థియేటర్లకు ప్రేక్షకులను మళ్లీ రప్పించే సినిమా ఏది? అంటూ మాట్లాడుకుంటున్నారు.

Update: 2026-06-05 04:24 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది విడుదలైన తొలి షో నుంచే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం ప్రీమియర్ షోలకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ రాగా.. గురువారం అనేక ప్రాంతాల్లో హౌస్‌ ఫుల్ బోర్డులు కనిపించాయి. దీంతో థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంక్రాంతి సీజన్ తర్వాత పెద్ద స్టార్ హీరో సినిమా థియేటర్లలోకి రావడం, ప్రేక్షకులు భారీగా వచ్చి మూవీని ఆదరించడం టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఆ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో పెద్ది హవా మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. పెద్ది తర్వాత థియేటర్లకు ప్రేక్షకులను మళ్లీ రప్పించే సినిమా ఏది? అంటూ మాట్లాడుకుంటున్నారు. దీంతో జూన్ నెలలో వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలపై అందరి దృష్టి పడింది. సింగ్ గీతం, మా ఇంటి బంగారం, లెనిన్ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానుండటంతో వాటి రిజల్ట్స్ పై ఆసక్తి నెలకొంది.

జూన్ 11న విడుదల కానున్న సింగ్ గీతం ఇప్పటికే పాజిటివ్ బజ్ సంపాదించుకుంది. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ఆ చిత్రానికి నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మ్యూజికల్ కామెడీ డ్రామాగా రూపొందిన ఆ సినిమా యూనిక్ కాన్సెప్ట్‌ తో రాబోతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దీంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

ఆ తర్వాత జూన్ 19న స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో నటించిన మా ఇంటి బంగారం విడుదల కానుంది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఆ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే విడుదలై సినిమాపై ఆసక్తి పెంచింది. చాలా గ్యాప్ తర్వాత సమంత లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా వస్తుండడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక జూన్ 25న అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఆయన కెరీర్‌ లో ఆ మూవీ అత్యంత కీలకంగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయిన అఖిల్‌.. ఈసారి భారీ ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై కొంత ఆసక్తి పెంచింది. అయితే ఒక సినిమా విజయాన్ని ముందుగానే అంచనా వేయడం కష్టం.

స్టార్ హీరోల చిత్రాలైనా, కొత్త కాన్సెప్ట్‌ తో వచ్చిన సినిమాలైనా చివరికి ప్రేక్షకులను ఆకట్టుకునే అంశం కంటెంట్‌ మాత్రమే. కథ, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను మెప్పిస్తేనే థియేటర్ల వద్ద హౌస్‌ ఫుల్ వాతావరణం కొనసాగుతుంది. పాజిటివ్ టాక్ వచ్చినప్పుడు మాత్రమే సక్సెస్ ఫుల్ లాంగ్ రన్ దక్కుతుంది. ప్రస్తుతం పెద్ది థియేటర్లలో సందడి చేస్తుండగా.. దాని తర్వాత ఆడియన్స్ ఛాయిస్ ఏ సినిమా అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. జూన్ నెలలో విడుదలవనున్న సినిమాల్లో ఏది బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుందో అంతా వేచి చూడాలి.

Tags:    

Similar News