శేష్ పంచ్.. ఆ హీరో ఫీలయ్యారా?

తాజాగా అడివి శేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు, వేసిన పంచులు హాట్ టాపిక్‌ గా మారాయి. ఆయన చేసిన కామెంట్స్ వల్ల మరో యంగ్ హీరో గురించి ఊహాగానాలు మొదలయ్యాయి.;

Update: 2026-04-06 06:04 GMT

టాలీవుడ్‌ యంగ్ హీరోల మధ్య పోటీ, పోలికలు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. తాజాగా అడివి శేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు, వేసిన పంచులు హాట్ టాపిక్‌ గా మారాయి. ఆయన చేసిన కామెంట్స్ వల్ల మరో యంగ్ హీరో గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఆ వ్యాఖ్యలతో సంబంధం లేకపోయినా, కొందరు ఓ హీరో పేరును లాగడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్, హీరోగా మాత్రమే కాకుండా రైటర్‌ గా సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న డెకాయిట్ ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ లో భాగంగా ఓ పోడ్‌ కాస్ట్‌ లో పాల్గొన్న శేష్ పలు వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఓ యంగ్ హీరో గురించి చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. "ఓ యాక్టర్‌ పేరు చెప్పను. నా ప్రొడ్యూసర్ బర్త్‌ డే సందర్భంగా కలిశా. 'నువ్వు నా కంటే పెద్ద సినిమా చేశావు' అన్నట్టుగా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అతను చెప్పింది తెలుగులో చెబితే ఎవరో అర్థమైపోతుంది. అందుకే ఇంగ్లీష్‌ లో చెబుతున్నా" అని శేష్ అన్నారు. ఆ మాటలు విన్నప్పుడు అదొక రకమైన పోలికల పోటీలా అనిపించిందని చెప్పారు.

"యంగ్ హీరోల్లో టాప్ అవ్వాలనుకుంటే ముందు పెద్ద హీరోలు ఉన్నారు. వారిని దాటాలని అనుకుంటే రజనీకాంత్, చిరంజీవి లాంటి లెజెండ్స్ ఉన్నారు. వారిని మించి వెళ్లాలని అనుకుంటే షారుఖ్ ఖాన్ ఉన్నారు. ఇంకా ఆయనకన్నా టాప్ కావాలంటే టామ్ క్రూజ్ ఉన్నారు. పోలికలు ఎక్కడికి తీసుకెళ్తాయి?" అంటూ తన అభిప్రాయం వెల్లడించారు.

శేష్ చేసిన కామెంట్స్ తర్వాత సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో అంటూ నెటిజన్లు వివిధ హీరోల పేర్లు ప్రస్తావించడం ప్రారంభించారు. దీంతో సంబంధం లేని ఒక హీరో పేరు ఎక్కువగా ప్రస్తావించడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. తనకు ఎలాంటి సంబంధం లేదని, తన పేరును చర్చలోకి తీసుకురావడం బాధ కలిగించిందని చెబుతున్నారట.

సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ ఆయనను ఇబ్బంది పెట్టినట్లు సమాచారం. అంతేకాకుండా ఆ విషయంపై క్లారిటీ కోసం అడివి శేష్ ను సంప్రదించాలా అనే ఆలోచన వచ్చినా.. జరిగిపోయిన విషయంపై మాట్లాడి ప్రయోజనం ఏమిటన్న భావనతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఒకవేళ శేష్ నుంచి కాల్ వచ్చినా స్పందించకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి.. శేష్ చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నవి ఎవరికీ తెలియకపోయినా.. సోషల్ మీడియాలో వచ్చిన ఊహాగానాలు మాత్రం అనవసరంగా ఒక హీరోను టార్గెట్ చేసినట్లయ్యాయి. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News